దేవ, మానవ గణాలకు అధినాయకుడు.. గణేషుడు. ‘గణానాం త్వా గణపతిగ్ం హవా మహే’ అంటూ పూజల్లో అగ్రస్థానం అందుకున్నాడు. ఇండ్లల్లో సాధారణ నోములు మొదలుకొని వైదిక యాగాల వరకూ.. అన్నిటా తొలి పూజలు స్వీకరిస్తున్నాడు. ఇప్పుడు దేశవిదేశాల్లోనూ నిత్యపూజలతో అలరారుతున్నాడు.
జపాన్‌లో గణపతిని కాంగిటెన్ అని పిలుస్తారు. షాటెన్, గణాబాచి, బినాయకటెన్ ఇలా పలు పేర్లతోనూ పూజిస్తారు. టోక్యోలో అతి పురాతన బౌద్ధ ఆలయాల్లో కాంగిటెన్ ఆలయమూ కనిపిస్తుంది. కొన్ని ఆలయాల్లో ఆడ ఏనుగు (స్త్రీ శక్తి)ను ఆలింగనం చేసుకున్న రూపంలోనూ విగ్రహాలు కనిపిస్తాయి. ఈ విగ్రహాలను పెట్టెల్లో ఉంచే సంప్రదాయం ఉంది. ఉత్సవాల సమయంలో వెలుపలికి తీసి పూజలు నిర్వహిస్తుంటారు. ఆర్థిక విజయాలు ప్రసాదించే దైవంగా వినాయకుడిని కొలుస్తారు జపనీయులు.
ఇండోనేషియా కరెన్సీపైనే గణపతి దర్శనమిస్తాడు. బాలీతోపాటు సుమత్రా దీవులు, జావా ద్వీపంలోనూ వినాయకుడి ఆలయాలు దర్శనమిస్తాయి. చవితితోపాటు ఇతర పర్వదినాల్లో గజాననుడికి ప్రత్యేక పూజలు, ఉత్సవాలు నిర్వహిస్తుంటారు. బాలీలో 30 అడుగుల ఎత్తున్న వినాయక విగ్రహన్ని 2006లో ప్రతిష్ఠించారు. ఇండోనేషియాలోనూ గణపతి నిమజ్జనోత్సవాలు కోలాహలంగా జరుపుతారు. పెద్ద ఎత్తున ఊరేగింపు నిర్వహిస్తారు. వేలాదిగా భక్తులు తరలివచ్చి కొబ్బరి కాయలు కొడుతుంటారు. ఆ కొబ్బరి చిప్పలను తొలగించడానికి ఒక రోజంతా పడుతుంది. ఈ విగ్రహం చుట్టూ 204 దేశాల జెండాలను ఉంచుతారు.
మనం శివపార్వతుల తనయుడిగా వినాయకుణ్ని కొలుస్తాం. కానీ, మయన్మార్‌లో విఘ్నేశ్వరుడిని బ్రహ్మగా భావిస్తారు. అందుకు ఓ పురాతన గాథ కూడా ప్రచారంలో ఉంది. బ్రహ్మదేవుడి శిరస్సు భంగం అయినప్పుడు.. ఏనుగు తలను అతికించారనీ, అలా బ్రహ్మ దేవుడు కాస్తా గజాననుడిగా మారాడని విశ్వసిస్తారు. నేటికీ మయన్మార్‌లో వినాయక చవితికి గణపతిని పరబ్రహ్మగా పూజిస్తుంటారు. వారం రోజులు విశేష పూజలు జరిపిస్తారు.
వినాయకుణ్ని థాయ్‌లాండ్‌లో ‘ఫ్రాఫికనెట్’ అని పిలుస్తారు. బ్యాంకాక్‌కు చెందిన ల్యూంగ్ పొర్ అనే బౌద్ధ భిక్షువు గణపతికి ఆలయాన్ని నిర్మించమని ప్రభుత్వాన్ని కోరాడు. దానికోసం తన భూమిని విరాళంగా ఇచ్చాడు. కొంతమంది దాతల సహకారంతో ప్రభుత్వం ఈ ప్రాజెక్టును పూర్తిచేసింది. ఇందులో థాయ్లాండ్లోనే అతిపెద్ద వినాయక విగ్రహాలు ఉన్నాయి. అందులో ఒక విగ్రహం 15 మీటర్ల ఎత్తు, 9 మీటర్ల వెడల్పు ఉంటుంది. 2010లో మరో విగ్రహాన్ని 9 మీటర్ల ఎత్తు, 15 మీటర్ల వెడల్పుతో చెక్కారు.