పిల్లాడు ఆకలేసి గుక్క పట్టి ఏడుస్తున్నాడు. తల్లి పాలు సరిపోవడం లేదు. పాల పొడికి 14 రూపాయలు కావాలి. ఇంట్లో ఆ కొద్ది డబ్బు కూడా లేదు. తల్లి తల్లడిల్లుతున్నది. తండ్రి తనలో తానే కుమిలిపోతున్నాడు. ఇల్లంతా వెతికితే నాలుగైదు రూపాయి నాణేలు కనిపించాయి. చుట్టు పక్కల అందరి జీవితాలు ఇంతే. ఎలాగోలా వాళ్లనీ, వీళ్లనీ అడిగి ఆ 14 రూపాయలకు లాక్టో డెక్స్ కంపెనీ పాల పొడి తీసుకొని వచ్చాడతను. పాలు కలిపి పిల్లాడికి తాగించారు. కానీ, జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఆలోచనతో కష్టపడితే తప్పక ఆదరిస్తుంది. కొన్నేళ్లు తిరిగి చూస్తే అదే పాలపొడి కంపెనీలో అతనో పెద్ద వాటాదారు. సినిమాను తలపించే ఈ జీవితం ప్రముఖ స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ విజయ్ కేడియాది. ప్రస్తుతం రెండు వేల కోట్ల రూపాయల పోర్ట్ ఫోలియో అతని సొంతం.
సినిమాల్లో హీరోకు కష్టాలు వస్తే రిక్షా తొక్కి, బస్తాలు మోసి ఒక పాట పూర్తయ్యేలోపు సంపన్నుడు అయి హీరోయిన్ను పెళ్లి చేసుకునే కథలు ఎన్నో చూశాం. కానీ, విజయ్ కేడియా జీవితంలో ఆ సినిమాలను మించిన మలుపులు ఉన్నాయి. నిరుపేదరికం నుంచి ఆయన జీవితం అనుకోని అంతస్తుల్ని అందుకుంది. ఎంత కింది స్థాయి నుంచి వచ్చిన వాళ్లయినా సరే ఆలోచనతో పెట్టుబడి పెడితే అందనంత ఎత్తుకు ఎదగొచ్చని ఆయన జీవితం నిరూపిస్తుంది. అందుకే దేశంలోని ఎందరో మదుపరులకు ఆయనో మార్గదర్శి. ఆయన ఇన్వెస్ట్మెంట్ సూత్రాలకన్నా, జీవితాన్ని నడిపించిన విధానం మరింత విలువైన పాఠం.
‘ఇదిగో డియర్ లాక్టో డెక్స్ కంపెనీలో పెద్ద వాటా. నా తరఫున ఇది నీకు నేనిస్తున్న ప్రేమ పూర్వక కానుక…’ అంటూ 2009లో ఆ భర్త తన భార్యకు లాక్టోడెక్స్ కంపెనీ స్టాక్స్ పత్రాలు అందించాడు. ‘ఒకప్పుడు ఈ కంపెనీ పాల పొడి 14 రూపాయలతో కొనడానికి డబ్బులు లేక ఇబ్బంది పడ్డాం. ఇంట్లో ఒక్కో రూపాయి నాణెం వెతకడానికి నువ్వు పడిన తపన నాలో ఆలోచన రేకెత్తించింది. ఆ రోజు నుంచి నాలో మార్పు చోటు చేసుకుంది. ఈ రోజు ఆ కంపెనీలో పెద్ద వాటాదారులం మనం’ అంటూ షేర్లకు సంబంధించిన సర్టిఫికెట్లు ఆమెకు అందిస్తూ చెప్పిన వ్యక్తి విజయ్ కేడియా. ఒకప్పుడు బతకడానికి టీ ఎస్టేట్ కార్మికులకు స్నాక్స్ అమ్మిన విజయ్ కేడియా చివరకు ఆ టీ ఎస్టేట్‌నే కొనేశాడు.
1962లో కోల్‌కత్తాలో మధ్యతరగతి మార్వాడీ కుటుంబంలో పుట్టిన కేడియా తండ్రి స్టాక్ బ్రోకర్‌గా పని చేశారు. తాను పదో తరగతి చదివేప్పుడు తండ్రి మరణించారు. కుటుంబం కష్టాల పాలైంది. కేడియా పదో తరగతి తప్పాడు. చదువు మీద ఆసక్తి పోయింది. ఎలాగోలా తిరిగి టెన్త్ పాస్ అయ్యాడు. మంచి సంబంధాలు రావాలి అంటే డిగ్రీ అయినా పూర్తి చేయమని తల్లి పోరు పెట్టడంతో ఎలాగోలా డిగ్రీ పూర్తి చేసి పెళ్లి చేసుకున్నాడు. 19 ఏండ్ల వయసులో స్టాక్ మార్కెట్లో ప్రవేశించి ట్రేడింగ్ చేయడంతో నష్టాల పాలయ్యాడు. మంజుతో వివాహం, కుమారుడు అంకిత్ పుట్టాక కష్టాలు మరింతగా పెరిగాయి. ఆ సమయంలోనే పాల పొడికి కూడా డబ్బులు లేవు. ఆరు మంది కుటుంబ సభ్యులు కలిసి ఒకే గదిలో ఉండేవారు. తల్లి బంగారు ఆభరణాలు అమ్మి అప్పులు తీర్చాడు. టీ ఎస్టేట్‌లో కార్మికులకు స్నాక్స్ అమ్మడం వంటి చిన్న చిన్న వ్యాపారాలు ఎన్నో చేశాడు. వచ్చిన ఆదాయాన్ని క్రమ పద్ధతిలో మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం మొదలు పెట్టాడు. పంజాబ్ ట్రాక్టర్ స్టాక్‌ను 350 రూపాయలకు కొని 500 శాతం లాభానికి అమ్మాడు. 1991లో కేడియా సెక్యూరిటీస్ ప్రైవేట్ లిమిటెడ్ కేవలం కొన్ని వేల రూపాయలతో ప్రారంభించారు. ఎండీ అని బిజినెస్ కార్డులో తన పేరు చూసుకోవాలి అనే కోరికతోనే దాన్ని స్థాపించినట్టు చెబుతుంటారాయన. తొలుత కేవలం వాళ్ల కుటుంబ సభ్యుల ఇన్వెస్ట్మెంట్లు మాత్రమే ఈ కేడియా సెక్యూరిటీస్ ప్రైవేట్ లిమిటెడ్ చూసేదట.
స్టాక్ మార్కెట్ తో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరికి విజయ్ కేడియా పేరు ఇప్పుడు తెలుసు. ఆయన విజయవంతమైన ఇన్వెస్టర్ మాత్రమే కాదు, కొత్తగా మార్కెట్లోకి వచ్చే వారికి బిజినెస్ చానెల్స్ ద్వారా సలహాలు ఇస్తారు. సరదా మనిషి. సింపుల్ జీవితం. పాపులర్ హిందీ పాటలను స్టాక్ మార్కెట్ అంశాలతో పేరడీ చేసి పాడడం ఆయనకు ఒక హాబీ. తన పోర్ట్ ఫోలియోలో ఎన్ని వందల కోట్ల విలువైన స్టాక్స్ ఉన్నా అది మార్కెట్‌కు సంబంధించినవి, బ్యాంకులో ఉన్న క్యాష్ మాత్రమే తనదిగా భావిస్తానని చెబుతారు. ఆ పెట్టుబడి విలువ ఎంత తగ్గినా, పెరిగినా తన లైఫ్ స్టయిల్ మారదు. ఒక డాక్టర్, ఇంజనీర్, సీఏ తమ వృత్తిలో నైపుణ్యం కోసం ఎలా ప్రయత్నిస్తారో, ఎలా పరితపిస్తారో అలా స్టాక్ మార్కెట్లో స్టాక్ గురించి అధ్యయనం చేసి ఇన్వెస్ట్ చేస్తే బోలెడు లాభాలు ఉన్నాయని గ్రహించారాయన. జూదంలా కాకుండా వృత్తిగా గౌరవిస్తే, ఓపిక చూపిస్తే మార్కెట్ ఆశీర్వదిస్తుంది అని నమ్మారు. అందుకే ఏకంగా రెండు వేల కోట్ల రూపాయల పోర్ట్ ఫోలియోతో సంతోషకరమైన జీవితం గడుపుతున్నారు. లండన్ బిజినెస్ స్కూల్లో కూడా విజయ్ కేడియా తన విజయ కథను వివరించారు. పలు దేశాలు అతన్ని తమ యూనివర్సిటీల్లో ఉపన్యాసాలు ఇవ్వమని ఆహ్వానిస్తుంటాయి. చిత్తశుద్ధితో ఏ పనిని నమ్ముకున్నా, మన కృషి తోడుగా ఆ రంగంలో ఎదగవచ్చు అని విజయ్ కేడియా జీవితం నిరూపించింది.