అదొక ఆశ్రమ పాఠశాల. ఆ ప్రాంగణమంతా వేద మంత్రాలతో మార్మోగుతుంటుంది. వేదానికి నాదాన్ని జతచేస్తూ వాద్యఘోష వినిపిస్తుంది. బ్రహ్మ తేజస్సుతో వెలిగిపోతున్న పిల్లలు.. సాయంత్రాలు ముల్లుగర్రలు చేతబూని ‘సై’ అంటూ పోరాటాలు చేస్తుంటారు. వేద విద్యకు అనుబంధంగా లెక్కలతో దోస్తీ చేస్తారు. సైన్స్ ప్రయోగాలు శ్రద్ధగా నేర్చుకుంటారు. ఆంగ్లంలో అనర్గళంగా ప్రసంగిస్తారు.
ఆశ్రమ విద్యా విధానంలో చతుర్వేదాలను అభ్యసిస్తూనే.. సాధారణ పాఠాలనూ ఆపోశన పడుతుంటారు. భిన్నమైన విద్యాలక్ష్యాలు కలిగిన పాఠశాల విద్యారణ్యమ్. ఇక్కడ చదువుకుంటున్న పిల్లలకు మార్గదర్శకులు తప్ప సేవకులు ఉండరు. ఎదిగే వయసులో బౌద్ధిక వికాసాన్నేకాదు తమకాళ్లపై తాము నిలబడేలా పిల్లల్ని తీర్చిదిద్దుతున్నారు ఇక్కడి గురువులు. విద్యారణ్యమ్లో బోధన, నిర్వహణ, పాఠ్యాంశాలు అన్నీ ప్రత్యేకమే!
ఏపాఠశాలకు వెళ్లినా కార్యాలయంలో అడుగుపెట్టగానే ఉపాధ్యాయుడో, ఉద్యోగో పలకరిస్తాడు. వచ్చిన పని మాట్లాడేందుకు ప్రిన్సిపాల్ దగ్గరకు పంపిస్తాడు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం చిప్పలపల్లి గ్రామంలోని విద్యారణ్యమ్ అందుకు భిన్నంగా ఉంటుంది. ఎవరైనా ‘ఇక్కడ మా పిల్లల్ని చదివించాలి’ అని అడుగుపెట్టిన వాళ్లకు నమస్కరిస్తూ ‘స్వాగత్ ప్రముఖ్’ పలకరిస్తాడు. ఇతను పాఠశాలలోని వేద విద్యార్థే. పిల్లలే దీని నిర్వాహకులు.
ఒక్కొక్కరికి ఒక్కో బాధ్యత ఉంటుంది. వచ్చిన వాళ్లతో వ్యవహరాలు నడపడానికి స్వాగత్ ప్రముఖ్ ఉన్నట్టే, ప్రతి పనికీ ఓ ప్రముఖ్ ఉంటాడు. ఆయనకు ఇద్దరు సహ ప్రముఖ్లు చేదోడు వాదోడుగా ఉంటారు. వీళ్లు తమకు కేటాయించిన పనిని పర్యవేక్షిస్తారు. కార్యనిర్వహణకు ‘టోరి’అనే నలుగురు సభ్యులు ఉంటారు. ఆశ్రమంలోని విద్యార్థులందరినీ పర్యవేక్షక్ ఉదయం నాలుగు గంటలకు నిద్ర లేపుతాడు. ఆ తర్వాత అందరూ కాలకృత్యాలు తీర్చుకుని, స్నానం చేసేలా శుచి ప్రముఖ్ బాధ్యత తీసుకుంటాడు. విద్యారణ్యమ్ నిర్వహణ కోసం వ్యవస్థ ప్రముఖ్ ఉంటాడు.
తన సహ ప్రముఖ్లు, టోరీలతో కలిసి ఏ రోజు విద్యార్థులు ఏం చేయాలి? ఏ బృందం ఎక్కడ కూర్చోవాలో ప్రణాళిక రూపొందిస్తారు. ఆ ప్రణాళిక ప్రకారం విద్యార్థులు వేదాధ్యయనం, శాస్త్ర అధ్యయనం, సంగీత సాధన, వ్యాయామ విద్యలు సాధన చేస్తారు. విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలను పెంపొందించాలని ఇలా స్వయం పాలన విధానాన్ని ప్రోత్సహిస్తున్నారు. విద్యార్థులెవరూ టీవీ చూసే అవకాశం లేదు. ఫోన్లు వాళ్లకు అందుబాటులో ఉండవు. సమయసారిణిని బట్టి వేద సాధన, శాస్త్ర సాధన చేస్తూ బౌద్ధిక వికాసం కోసం జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటారు.
ప్రతి తరగతిలో పదిహేను మంది విద్యార్థులు ఉంటారు. ధోవతి కట్టుకుని, బాసింపట్టు వేసుకున్న విద్యార్థులు శ్రావ్యంగా వేదాన్ని పఠిస్తుంటారు. వేద పఠనంలో శ్రుతి ప్రధానమైనది. ఈ శ్రావ్యమైన పఠనంతో విద్యారణ్యమ్ ప్రాంగణం ఆహ్లాదకరంగా ఉంటుంది. శ్రవణ, మనన, నిధి, ధ్యాన పద్ధతుల్లో విద్యార్థులు వేదాలను అధ్యయనం చేస్తుంటారు. ప్రతిరోజూ 8 గంటలు ఇది కొనసాగుతుంది. పదేండ్ల వ్యవధిలో ఐదు అంచెల్లో (మూలము, పదము, క్రమము, జట, ఘన) విద్యార్థులు అధ్యయనం పూర్తి చేసేలా పాఠ్య ప్రణాళిక ఉంటుంది. సంస్కృత మాధ్యమంలో సాగే వేదాధ్యయనం కోసం సంస్కృత భాషాధ్యయనం కూడా చేయాలి. సంస్కృత శబ్దమంజరి, ధాతు మంజరి, వ్యాకరణ శాస్త్రం బోధిస్తారు. ప్రతి శనివారం సాయంత్రం ప్రత్యేకంగా వేద గణితం నేర్పిస్తారు.
వేద జ్ఞానంతోపాటు బౌద్ధిక వికాసం కోసం విద్యార్థులు ప్రతిరోజూ అర్ధ గంట సమయం కేటాయిస్తారు. ఈ సమయంలో ‘బౌద్ధిక కాలాంశం’ పేరుతో దేవ చరిత్ర, సంస్కృతి, మహనీయుల జీవితాల గురించి చర్చిస్తారు. ఆలోచనలకు పదునుపెట్టేందుకు పిల్లలకు ఇష్టమైన కథలు చెబుతారు. విద్యార్థులకు సుభాషితాలు, పాటలు నేర్పించి, వాటి భావం వివరిస్తారు. ఇలా శ్లోకాలు, పాటల ద్వారా ఆధ్యాత్మిక సారాన్ని అందిస్తారు. ప్రతి నెలా ఒక పాటను సాధన చేయడం ప్రతి విద్యార్థి కర్తవ్యం. విద్యార్థులు వేద, శాస్త్ర అధ్యయనాలతోపాటు కర్ణాటక గాత్ర, వాద్య సంగీతాలను కూడా తప్పకుండా సాధన చేయాలి. వీణ, వేణువు, మృదంగం వాద్యాలలో ఇష్టమైనదానిని ఎంచుకుని సాదన చేయవచ్చు.
వీటితోపాటే సాధారణ పాఠశాలల్లో బోధించే గణితం, సామాన్యశాస్త్రం, సాంఘిక శాస్త్ర పాఠాలు బోధిస్తారు. సాధారణ పాఠ్యాంశాలను ఆంగ్ల మాధ్యమంలో బోధిస్తారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ ద్వారా పదో తరగతి, ఇంటర్మీడియెట్ పరీక్షలు రాయిస్తున్నారు. వేద విద్యార్థులు ప్రతి రోజూ శారీరక దృఢత్వం కోసం వ్యాయామ విద్యలు, ఆత్మ రక్షణకు దోహదపడే యుద్ధ విద్యలు సాధన చేస్తారు. వీటితోపాటు మానసిక ఉల్లాసం కలిగించే ఆటలూ ఆడతారు. ప్రతివారం కలరియపట్టులో రెండు క్లాసులు ఉంటాయి. ప్రతిరోజూ అరగంట కర్రసాము చేస్తారు. ఓ అరగంట కబడ్డి, కోకో వంటి దేశీయ ఆటలు ఆడుతూ విద్యారణ్య వేద విద్యార్థులు ఆనందంగా గడుపుతున్నారు.
ఇంటికి దూరంగా పెరిగే వేద విద్యార్థులను పక్షానికి ఒకసారి తల్లిదండ్రులు కలుసుకునే అవకాశం ఉంది. ప్రతి పాడ్యమి రోజు సాయంత్రం రెండు గంటలపాటు తల్లిదండ్రులు పిల్లలతో గడపవచ్చు. వేసవిలో ఒక పక్షం (15) రోజులు సెలువులు ఉంటాయి. దీపావళికి నాలుగు రోజులు సెలవులు ఉంటాయి. ఇక మిగిలిన ఏడాదంతా వేదాధ్యయనం, శాస్త్ర అధ్యయనంలో మునిగిపోవాల్సిందే. విద్యారణ్యమ్లో ప్రస్తుతం వంద మంది విద్యార్థులు వేద అధ్యయనం చేస్తున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ర్టాల నుంచి వచ్చి ఇక్కడ అధ్యయనం చేస్తున్నారు. ఏడు సంవత్సరాలు నిండి, ఉపనయనం చేసుకున్న యజు శాఖ, రుక్ శాఖకు చెందిన బ్రాహ్మణ బాలురు మాత్రమే ఈ పాఠశాలలో అడ్మిషన్ ఇస్తారు. వేద పాఠశాలలో పదేండ్ల పాటు ఉచితంగా విద్యాబోధనతోపాటు వసతి కల్పిస్తున్నారు.
త్రికాల సంధ్యావందనం, శుశ్రూష, నియమబద్దమైన అధ్యయనం, చరిత్ర, సంస్కృతి, వైదిక ధర్మ అవగాహన కల్పించడం విద్యారణ్యమ్లోని విద్యాబోధన ప్రత్యేకత. వేదం, శాస్త్రం అధ్యయనంతోపాటు విద్యార్థులందరూ తప్పనిసరిగా సంగీత సాధన, వ్యాయామ విద్యలు సాధన చేయాలి. వ్యక్తిగత శుభ్రత నుంచి పాఠశాల నిర్వహణ వరకు అన్నీ పిల్లలే బాధ్యత తీసుకుంటారు.
ఒకప్పుడు పౌరోహిత్యం, అర్చకత్వం, సామాజికసేవా కార్యక్రమాలు చేస్తూ ఉండేవాడిని. వాటికంటే ఉన్నతమైన సామాజిక ప్రయోజనం కోసం 2015లో విద్యారణ్య వైదిక ట్రస్ట్ నెలకొల్పాను. ఏడు ఎకరాల సొంత భూమిలో ‘విద్యారణ్యమ్’ వేద పాఠశాలను ప్రారంభించాను. ‘ధర్మం తెలిసిన (వేదం చదివిన) వాళ్లు భిన్న రంగాల్లో విధాన నిర్ణేతలు (పాలసీ మేకర్స్)గా ఎదగాలన్నది సంస్థ అభిలాష’! భవిష్యత్లో ప్రతి కులానికీ ఒక గురుకులం నెలకొల్పాలన్నది మా సంస్థ లక్ష్యం. విద్యారణ్యమ్ నిర్వహణ కోసం ‘జీవనాడి’ అనే ప్రకల్పం నిర్వహిస్తున్నాం. దీని ద్వారా దాతల నుంచి విరాళాలు స్వీకరిస్తాం. దాతల గోత్ర నామాలతో చండీ యాగం, రుద్ర యాగం, సుదర్శన యాగం, గణపతి హోమం నిర్వహిస్తున్నాం. ప్రతినెలా నిర్వహించే ప్రకల్పం ద్వారా సమకూరిన ద్రవ్యంతో విద్యారణ్యమ్ నిర్వహిస్తున్నాం.
-మాడుగుల శశిభూషణ సోమయాజి విద్యారణ్య వైదిక ట్రస్ట్ వ్యవస్థాపకుడు