చేల గట్ల పక్కన, పండ్ల తోటల కంచెలాగా విరివిగా పెరిగే చెట్టు వావిలి. నీటి ప్రవాహాలున్న గట్ల మీద అతి సులభంగా పెరుగుతుంది. గుబురుగా, పది అడుగుల ఎత్తు వరకు పెరుగుతుంది. దీని ఆకులు మామిడి ఆకుల ఆకారంలో ఉంటాయి. కానీ, మామిడి కంటే కొంత మృదువుగా ఉంటాయి. మంచి సువాసన కలిగి ఉంటాయి. ముందువైపు ఆకుపచ్చ రంగులోను, వెనుకవైపు తెల్లగానూ ఉంటాయి. పూలు గుత్తులు గుత్తులుగా తెల్లగా పూస్తాయి. నల్ల వావిలాకు కూడా ఉంటుందట.
వావిలి ఆయుర్వేద వనమూలిక. దీన్ని సంస్కృతంలో నిర్గుండి అంటారు. గజ్జి, తామర, సయాటికాతో బాధపడే రోగులకు, ముక్కు నుంచి రక్తం కారే వారికి, కీళ్ల వాతంతో బాధపడేవారికి, పార్కిన్సన్ వ్యాధిగ్రస్తులకు వావిలాకు ఆయుర్వేదంలో దివ్యమైన ఔషధం అంటారు. జలుబు, దగ్గు, జ్వరం వచ్చిన వాళ్లు వావిలాకు మరిగించిన నీటి ఆవిరి పడితే ఉపశమనం కలుగుతుంది. నిలువ చేసుకున్న ధాన్యానికి పురుగు పట్టకుండా ఉండేందుకు రైతులు ధాన్యంలో వావిలాకును కలిపి నిల్వ ఉంచుతారు.
ఇది వాపులను తగ్గిస్తుంది. నొప్పులను తగ్గిస్తుంది. వాతం వల్ల కలిగే నొప్పిని కూడా తగ్గిస్తుంది. పచ్చి బాలింతకు వావిలాకుతో స్నానం చేయిస్తారు. వావిలాకుని మరిగించిన నీళ్లను చన్నీటిలో కలిపి నవజాత శిశువుకు మొదటి స్నానం చేయిస్తారు. ఆ తర్వాత అదే నీళ్లతో ఆ బిడ్డను కన్న బాలింతనూ స్నానం చేయిస్తారు. వావిలాకు వేసిన నీళ్లు స్నానం ఒళ్లు నొప్పులు, అలసటను పోగొట్టి హాయి నిద్రనిస్తుంది.
– ఎమ్మెల్సీ సురభి వాణీదేవి, పీవీ కూతురు