మాది స్పిన్నింగ్ మిల్లు. దక్షిణం – ఉత్తరం స్థలం వదిలి మధ్యలో కట్టాం. మంచిదేనా? దక్షిణం పెద్ద రోడ్డు.
– జి. జలంధర్, మాల్.
మీరు పంపిన ప్లాన్ చూశాను. ఒక పరిశ్రమ కట్టేముందు స్థలాన్ని శుద్ధి చేసుకోవాలి. అంటే దానిని అన్ని రకాలుగా చూసి, హెచ్చు తగ్గులు సరిచేయాలి. మీది దాదాపు పదిహేడు ఎకరాల స్థలం. కానీ, ఒక పతంగి ఆకారంలో ఏ మూలా సరిగ్గా లేకుండా ఉన్న స్థలం అది. పైగా దక్షిణం పెద్ద హైవే. పేరుకు రోడ్డుకు ఉందికానీ, మీ వక్రతల స్థలమే.. మీ మిల్లుకు ఇబ్బంది కలిగిస్తుంది. దక్షిణం – నైరుతి కోణంగా పెరిగి, పశ్చిమ నైరుతి తెగిపోయి ఉంది. మీరు దానికి తూర్పు రోడ్డు వేశారు కానీ, అది డెడ్ ఎండ్ రోడ్డు. పశ్చిమ నైరుతి వదిలి ఆ చోట క్వార్టర్స్ కట్టారు. కేవలం మిల్లు మాత్రం దీర్ఘచతురస్రంగా నిర్మించి, దానిని నైరుతి నుంచి గేటు పెట్టి.. పత్తి బ్లేడులు బయటికి తీస్తున్నారు. ఇవన్నీ పెద్ద దోషాలు. మొత్తం మీ స్థలానికి ఉన్న చుట్టుపక్కల స్థలం కట్‌చేసి.. ఆ ప్రధాన దీర్ఘచతురస్రపు నిర్మాణానికే నాలుగు వైపులా కాంపౌండ్ కట్టండి. పశ్చిమ నైరుతిలో క్వార్టర్స్ తొలగించి మీ ఆఫీస్ కట్టుకోండి. మీ మిల్లులోకి దక్షిణం ఆగ్నేయం నుంచి ఒక దారి తీసుకొని, దక్షిణం ఆగ్నేయంలో గేటు పెట్టి వాడండి. దక్షిణం రోడ్డుకు ఉన్నప్పుడు దక్షిణంలో ఎంట్రీ తప్పకుండా రావాలి. ఈశాన్యం కోణం తెగిపోయి ఉంది. దానిని వాయవ్యం తెంపు చేసి ఈశాన్యం మూల నిలబడేలా ఉత్తరం కాంపౌండు కట్టండి. చుట్టుపక్కల స్థలాలు వదిలివేయండి. వాటిని మిగతా వ్యాపార పనులకు వాడండి. ప్రధానమైన మిల్లును సరిచేసినట్లయితే.. అది శుభఫలితాలు ఇస్తుంది. మధ్యలో మిల్లు కట్టడం తప్పు. ఉత్తరం కన్నా దక్షిణం అధికమైన ఖాళీవచ్చి.. ఆర్థిక ఇబ్బందులు తెస్తుంది. పేరుకు మిల్లు కానీ, రాబడి నిల్లు. అన్నీ సరిగ్గా, శాస్త్రబద్ధంగా సవరించుకోండి.
ద్వారం మీద బీము రావచ్చా? వస్తే ఎలా సరిచేయాలి?
– వి. సుజాత, షాద్‌నగర్.
ఇంటి ప్రధాన ద్వారం నెత్తిమీద ఎప్పుడు కూడా భిన్నంగా బీము రాకూడదు. తప్పకుండా ద్వారం స్థానం మార్చాలి. బీము మారదు కాబట్టి. మీరు ఇంటి నిర్మాణం సరిగ్గా ప్లాను చేయలేదు. ద్వారం వచ్చేచోట అసలు బీములు ఎదురురావు. మీరు ఉన్న ద్వారం ఎటువైపో రాయలేదు. తూర్పు – ఈశాన్యం ద్వారం నెత్తిమీద బీము వస్తే.. దానిని తొలగించి తూర్పు మధ్యలో ద్వారం పెట్టండి. లేదా ద్వారాన్ని ఈశాన్యం భాగంలోనే కుడి – ఎడమలకు జరిపినా ఆ నిలువు బీము పడదు అనుకుంటే.. జరపండి. అయితే, ప్రధాన ద్వారం మార్చేటట్లయితే.. తిరిగి మంచి ముహూర్తం చూసుకొని ఇల్లు కట్టేటప్పుడు ఎలా పూజచేసి సంప్రదాయబద్ధంగా పెట్టారో.. అలాగే ఆ కార్యం చేయాలి. ద్వారం సరిగ్గా కూర్చోనప్పుడు మార్చడం తప్పుకాదు. సరిచేసుకోండి. అలాగే ఇంటి లోపల ఫాల్స్ సీలింగ్ చేయించండి.
ఇంటికి బాల్కనీలు ఎన్ని ఉండాలి? ఇంటి చుట్టూ కూడా ఉండొచ్చా?
– కె.వి.ఆర్. మధు, బొందుగుల.
ఇంటికి బాల్కనీలు ఎన్ని ఉండాలి అనే లెక్క కాదు.. తూర్పు వైపు, ఉత్తరం వైపు ఖాళీ ఉండేలా మేడకు స్థలం కావాలి. అలాగే దక్షిణ పశ్చిమాలకు కూడా బాల్కనీలు వేసుకోవడం దోషంకాదు. మన గృహం గాలి వెలుతురు వచ్చేదిగా ఉండాలి. అంటే, ఇంటి చుట్టూ ఖాళీ ప్రదేశం వదలాలి. కేవలం నేలమీదే కాదు.. అన్ని అంతస్తులకూ చుట్టూ ఖాళీ ప్రదేశం నడకలతో ఉండాలి. అంటే బాల్కనీలు అవసరం. పైన కాకుండా కేవలం కింద ఇవ్వడం కాదు. అన్ని అంతస్తులకూ ఇంటి చుట్టూ ఖాళీ ఉండాలి. అదే గొప్ప నిర్మాణం. ఇంటి చుట్టూ ప్రదక్షిణ స్థలం అనేది ఎంతో ప్రాముఖ్యం కలది. కానీ, మనం దానికి అంతస్తులకు పెట్టించుకోవడం లేదు. పైన వచ్చే బాల్కనీ కలుపుకొని కింద ఖాళీలు వదలాల్సి ఉంటుంది. అప్పుడు అన్ని మేడలూ శుభంగా ఉంటాయి.
మా పాత ఇల్లు చాలా పెద్దది. అందరం కలిసి ఉంటాం. కానీ, పెద్దవాళ్లు వయసు పైబడక ముందే మరణిస్తున్నారు. ఏదైనా వాస్తు దోషమా?
– కె. సౌభాగ్య, మన్నెగూడ.
అకాల మరణాలు జరుగుతున్నాయి అంటే.. తప్పక ఆ ఇంటిలో పెద్ద దోషాలు ఉంటాయి. మీరు ఇంటి ప్లాను పంపి ఉంటే చక్కగా చెప్పేవాణ్ని. ఓరల్‌గా అడిగారు. నైరుతి దోషం.. మరణహేతువు అవుతుంది. అంటే నైరుతిలో.. అది దక్షిణం – పశ్చిమం ఎటుదిక్కు అయినా వీధిపోటు పడుతూ ఉంటే.. అలాగే ఇంటిలో నైరుతి మూలకానీ లేదా దక్షిణం – పడమరలో బావి ఉంటే (మీది పాత ఇల్లు అంటున్నారు కదా!) కూడా వరుస మరణాలు సంభవిస్తాయి. అంటే.. యాక్సిడెంట్లు అయ్యే అవకాశం ఉంది. కొన్నిసార్లు టాయిలెట్ల కోసం సెప్టిక్ ట్యాంక్‌ను కడుతుంటారు. అదికూడా హేతువే! ముఖ్యంగా నైరుతికి మరో తోడువచ్చే మూల ఈశాన్యం. ఈ రెండూ మీ గృహంలో దోషపూరితంగా ఉంటాయి. ఈశాన్యంలో రాతిమెట్లు, ఈశాన్యం తెంపు, ఈశాన్యం మూలమీద గది.. ఇలా ఉన్నా ప్రమాదాలు తప్పవు. ఏది ఏమైనా మీరు క్షుణ్నంగా చూపించుకొని, నిర్ధారణకు రండి. సందేహం వస్తే.. దానిని ప్రాక్టికల్‌గా నివారించుకోవాలి.
– సుద్దాల సుధాకర్ తేజ
suddalavasthu@gmail.com
Cell: 98492 78143