– కె.ఎన్. బిందు, నారాయణగూడ.
మంచి ఇల్లు ఉంటేనే.. ఆలయాలకు, తీర్థయాత్రలకు వెళ్లగలుగుతాం. భగవంతుని పట్ల మనసు మళ్లింది అంటేనే.. ప్రకృతి ప్రసన్నత మనకు ఉన్నట్టు. నిత్యం ఆర్థిక, అనారోగ్య సమస్యలతో పరుగులు తీసేవాళ్లకు పరమాత్మను పూజించే సమయం ఎక్కడ దొరుకుతుంది? ఇల్లు వేరు.. దేవుళ్ల దర్శనం వేరు. మనిషి తరించడానికి, తనకు కావాల్సిన ఆనందం పొందడానికి ఆధ్యాత్మిక శక్తి అవసరం. అందుకు ముందుగా మనకు చిత్తశుద్ధి కావాలి. మన శక్తిని పెంచుకోవడానికి నిత్యం ప్రకృతి శక్తులమీద ఆధారపడాల్సి వస్తున్నది. అలాంటి శక్తులు క్షేత్రాలలో, ఆలయాలలో అధికంగా ఉంటాయి. తద్వారా మనలో శక్తి ద్విగుణీకృతం అవుతుంది. దైవశక్తిని కేంద్రీకృతం చేసి ఉంచేవి క్షేత్రాలు, ఆలయాలు. శక్తి అంతటా ఉంటుంది కానీ, వ్యక్తం అయ్యే చోట్లు తక్కువ. కరెంటు అంతటా ఉన్నా బల్బులో వెలిగినట్టు.. అలా దేవాలయాలు నిర్మించి ఇచ్చారు. కాబట్టి, మంచి ఇంట్లోంచి ఆలయాల దర్శనం.. మనల్ని విజయుల్ని చేస్తుంది.
– బి. కిరణ్, వైరా.
స్థలం కట్ అయి ఉండటం అనేది శాస్త్ర అంశంకాదు. స్థలం దిశకు ఉండాలి. చతురస్రంగా ఉండాలి. లేదా దీర్ఘచతురస్రంగా ఉండాలి. ఒకవేళ వంకరలు కలిగి ఉన్నా.. ఏదైనా మూల కట్ అయి ఉన్నా.. ఆ స్థలాన్ని సరిగ్గా చేసుకోవాలి. అప్పుడే ఆ చోట మంచి ఇల్లు కట్టుకోగలం. కొన్ని స్థలాలు తప్పనిస్థితిలో ఏదో మూల కట్ అయి ఉంటాయి. అలాంటి స్థితిలో ఇల్లు కట్టాలి అంటే.. కట్ అయిన మూల ఏది అనేది జాగ్రత్తగా చూసుకోవాలి. ఎలాంటి పరిస్థితుల్లోనూ నైరుతి, ఈశాన్యాలు కట్ అయిన స్థలాన్ని ఇంటికి ఎంచుకోవద్దు. ఆగ్నేయం లేదా వాయవ్యం ఏదో ఒక మూల మాత్రమే కట్ అయినట్లు అయితే.. ఆ స్థలంలో ఏ మూలా కట్ కాకుండా గృహ నిర్మాణం చేసుకోవాలి. దోషం ఉండదు. ఇవి చిన్నచిన్న స్థలాల్లో వచ్చే సమస్యలు. కాబట్టి జాగ్రత్తగా కట్టుకోవాలి.
స్థలం ఉంది అని ఈశాన్యం పెంచి కట్టడం. ఇష్టం ఉంది.. చాటుగా ఉంటుంది అని ఇంటి ప్రహరీలు ఎత్తుగా కట్టడం మంచిదికాదు. అన్నిటికీ ఓ లెక్క ఉంటుంది. ఇంటిచుట్టూ వదిలే ఖాళీ స్థలాన్ని బట్టి ఇంటి ప్రహరీల ఎత్తు కట్టాల్సి వస్తుంది. కేవలం రెండు లేదా మూడు అడుగుల స్థలం ఇంటి చుట్టూ వదిలి.. ప్రహరీలను ఇష్టం వచ్చిన ఎత్తు పెంచకూడదు. అప్పుడు ఆ ఇల్లు సమాధి అవుతుంది. సాధారణంగా అవసరాన్ని బట్టి దక్షిణం- పడమర దిశల్లో కిటికీలు కనిపించకుండా ఎత్తు కట్టడాలు చేయకూడదు. తూర్పు- ఉత్తరం, దక్షిణం- పడమరల కన్నా తక్కువ ఎత్తు ఉండాలి. ఇంటి బయటి ఫ్లోరింగ్ లెవెల్‌నుంచి ఐదున్నర అడుగులు, ఉత్తరం- తూర్పుల్లో కాంపౌండ్లు కట్టి.. దక్షిణం- పడమరల్లో ఆరు అడుగుల ఎత్తు కడితే సరిపోతుంది.
తూర్పు మధ్యలో కానీ, తూర్పు- ఈశాన్యంలో కానీ లిఫ్ట్ పెట్టుకోవద్దు. ఇంటి లోపల లిఫ్ట్ వేరు.. ఇంటి బయట లిఫ్ట్ పెట్టడం వేరు. మీరు ఉన్న బాల్కనీకే లిఫ్ట్ ఆనించి పెడితే.. డైరెక్టుగా అందులోకి రావచ్చు అని ఆలోచిస్తున్నారు. అది మంచి పద్ధతికాదు. ఇంటికి ఆగ్నేయంలో లేదా ఉత్తర- వాయవ్యంలో ఉన్న బాల్కనీని ఓపెన్ చేసి, ఆ బాల్కనీలో లిఫ్ట్ పెట్టుకొని.. దానికి తూర్పు లేదా ఉత్తరం ద్వారం వచ్చేలా లిఫ్ట్‌ను వాడుకోవచ్చు. బాల్కనీ అవతల లిఫ్ట్ పెడితే.. లిఫ్ట్ ఎంత వెడల్పు ఉందో అంత వెడల్పు బాల్కనీని మళ్లీ పెంచుకోవాలి. అప్పుడు ఇంటికి ఆగ్నేయం పెరగకుండా ఉంటుంది. మెట్లు- లిఫ్ట్ ఒకేచోట పెట్టాల్సి వస్తే.. ఆ మెట్ల వెడల్పు, ఈ లిఫ్ట్ వెడల్పు రెండూ కలిసి పెద్ద బాల్కనీ వేసుకొని, దానిగుండా ఈశాన్య ద్వారాలలోంచి ఇంట్లోకి వెళ్లాలి. అలాగే, లిఫ్ట్ ఎత్తుకు తగిన నిర్మాణం నైరుతిలో తిరిగి సవరించుకోవాల్సి ఉంటుంది.