సంధ్యవేళకు అమ్మదకణ్ణ విజయనగరానికి వెళ్ళటానికి సిద్ధమయ్యాడు. అతని గుర్రంతోపాటు హంపమ్మ చాలా దూరం నడిచింది. జవారి నది ఒడ్డు వరకూ ఆమె అతణ్ని సాగనంపటానికి వచ్చింది. ఆ నదిని దాటిన తర్వాత గుర్రం మీద విజయనగరం వరకూ భూమార్గంలో వెళ్ళవచ్చు.
“అన్ని ఏర్పాట్లు చేశాను. క్రిస్టావో అయ్యగారు నీ బాగోగులు చూసుకుంటారు” అని పదే పదే అమ్మదకణ్ణ హెచ్చరించాడు. అతని మాటలకు హంపమ్మ తలూపుతూనే ఉంది. పడవ ఎక్కటానికి ముందు ఇద్దరూ మాట్లాడకుండా ఒకరి ముఖాలు ఒకరు చూస్తూ చాలాసేపు నిలబడిపోయారు. హంపమ్మ భావావేశాన్ని ఆపుకోలేకపోయింది. అతణ్ని కౌగిలించుకుంది. “వదిలి వెళ్ళకు కణ్ణా” అని రోదిస్తూ అర్థించింది. ఆమె వీపును నిమురుతూ, ఆమె జుత్తులో వేళ్ళు కదిలిస్తూ అమ్మదకణ్ణ “ఈ తొందరపాటు నిర్ణయానికి రావద్దు హంపమ్మా… చెవి ముక్కు లేని వ్యక్తి నీకు కొద్దికాలంలోనే విసుగు పుట్టిస్తాడు. వికారంగా అనిపిస్తాడు” అని స్పష్టంగా చెప్పాడు.
“చెవులు, ముక్కులు ఉన్నవారినంతా చూశాను, అవన్నీ మనిషికి ముఖ్యమని నాకు అనిపించలేదు కణ్ణా. మనిషి అనేవాడికి కావలసింది హృదయమొక్కటే!” అని అంది.
అయినా ఈ సంబంధానికి అమ్మదకణ్ణ సిద్ధంగా లేడు.
“నేనొక దేశస్థుడిని. నువు మరొక దేశస్థురాలివి. ఒకదానికొకటి సంబంధం లేని సంస్కృతిలో పెరిగినవాళ్ళం. ఇద్దరికీ పొందిక కుదరదు హంపమ్మా” అన్నాడు.
“కణ్ణా, అనేక రకాల కుళ్ళాయిలను కుట్టినదాన్ని నేను. చైనాదేశపు పట్టు, మన ప్రాంతపు నూలుగుడ్డ, అరబ్బుల మస్లిన్, పర్షియన్ల డమాస్క్ బట్టలను చేర్చి కుళ్ళాయిలను అందంగా కుట్టాను. రంగులను సరిగ్గా చేర్చితే అంతా అందంగా అమరిపోతాయి. ఇక మీ దేశపు ఉన్నిబట్టలను వాడటం కష్టమా?”
మధ్యాహ్నమంతా మండిపడిన సూర్యుడు దూరంగా జవారి నది చివరలో కనిపించే అరేబియా సముద్రంలో మునిగి చల్లబడుతున్నాడు.
– వసుధేంద్ర రాసిన కన్నడ నవల ‘తేజో తుంగభద్ర’ నుంచి
అనువాదం: రంగనాథ రామచంద్రరావు