సోనాదా గ్రామం డార్జిలింగ్ నుంచి పదహారు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. పర్యటకులకు స్వర్గధామంగా కనిపించే ఈ ప్రాంతం స్థానికులకు మాత్రం డంపింగ్ యార్డులా కనిపిస్తున్నది. యాత్రికుల్లో క్రమశిక్షణ లోపించడమే దీనికి కారణం. ఈ నిర్లక్ష్యం సోనాదా గ్రామానికి చెందిన ఉత్సోవ్ ప్రధాన్‌కు నచ్చలేదు. తన చిన్నప్పుడు పచ్చని ప్రకృతికి ఆలవాలంగా ఉన్న తమ ప్రాంతానికి పూర్వ వైభవం తెచ్చిపెట్టాలనుకున్నాడు. డార్జిలింగ్ చుట్టుపక్కల గ్రామాల్లో, గిరుల్లో, లోయల్లో, పిల్ల కాల్వల్లో, నదీ పాయల్లో పేరుకుపోయిన చెత్తను ఏరివేయాలని సంకల్పించాడు. జీరో వేస్టేజ్ గ్రామాలుగా తీర్చిదిద్దాలని భావించాడు. ఇందుకోసం Tieedi (టేక్ ఇట్ ఈజీ, ఈజీ డస్ ఇట్) సంస్థను నెలకొల్పాడు.
ఇందుకోసం తను చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేశాడు. 2015లో టీడీ ఆర్గనైజేషన్ మొదలుపెట్టి.. తొమ్మిదేండ్లుగా డార్జిలింగ్ పరిసరాలను ప్రక్షాళన చేయడమే ధ్యేయంగా పనిచేస్తున్నాడు. రకరకాల మాధ్యమాల ద్వారా చెత్తను పోగు చేసి, తడి-పొడిగా వేరు చేసి.. కంపోస్ట్ ఎరువును తయారు చేస్తున్నాడు. ఇందుకోసం స్థానికులతో ఓ వ్యవస్థనే ఏర్పాటు చేశాడు ఉత్సోవ్. హిమాలయ పర్యావరణ వ్యవస్థను పునరుద్ధరించడానికి అహరహం శ్రమిస్తున్నాడు. వేల మొక్కలను నాటాడు. పర్యాటక వ్యూ పాయింట్లలో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని ఏరివేయడమే పనిగా పెట్టుకున్నాడు. ఉత్సోవ్ కృషి ఫలితంగా సోనాదా పరిసర గ్రామాల్లో ప్లాస్టిక్ వినియోగం దాదాపు ఆగిపోయింది.
మరిన్ని గ్రామాలను జీరో-వేస్ట్ దిశగా నడిపిస్తున్నాడు ఉత్సోవ్. ‘గ్రీన్ మైల్’ ప్రాజెక్టు కింద ఆయా ప్రాంతాల నుంచి వ్యర్థాల సేకరణ నిరంతరాయంగా కొనసాగిస్తున్నాడు. ఆయన సంకల్పానికి డీసీబీ (డెవలప్మెంట్ క్రెడిట్ బ్యాంకు) సీఎస్సార్ భాగస్వామిగా చేదోడువాదోడుగా నిలుస్తున్నది. ‘మనిషి జీవనానికి ప్రకృతిని విధ్వంసం చేయాల్సిన పనిలేదు. ప్రకృతిని సంరక్షిస్తే.. అది మనకు మరింత మహోన్నతమైన జీవితాన్ని అందిస్తుంది’ అంటాడు ఉత్సోవ్. సోనాదా పొలిమేరల్లో ఓ అందమైన కుటీరం వేసుకొని జీవనం సాగిస్తున్నాడు ఆయన. చుట్టుపక్కల కూడా చిన్నచిన్న కుటీరాలు నిర్మించాడు. ఇప్పుడు ఈ ప్రాంతానికి వచ్చిన పర్యాటకులు కొందరు ఉత్సోవ్ను కూడా కలుస్తున్నారు. ఆయన కథంతా విని స్ఫూర్తి పొందుతున్నారు. వెళ్తూ వెళ్తూ.. దారిలో ఎక్కడైనా ప్లాస్టిక్ వ్యర్థాలు కనిపిస్తే ఏరివేసి.. డంపింగ్ యార్డుకు చేరవేస్తున్నారు.