షాపింగ్ మాల్స్.. కిరాణా దుకాణం.. బడ్డీకొట్టు.. చివరికి అగ్గిపెట్టె కొన్నా పేమెంట్ కోసం అందరం ఒకటి వెతుకుతున్నాం. క్యూఆర్ కోడ్ కనిపించగానే టపీమని మనీ ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. మరైతే, మనం రోజూ స్కాన్ చేస్తున్న ఈ గజిబిజి గీతల క్యూఆర్ కోడ్ వెనుక హ్యాకర్లు పొంచి ఉన్నారంటే నమ్ముతారా?! ‘అదెలా సాధ్యం’ అని తేలిగ్గా తీసుకుంటే మీరు ‘క్విషింగ్’ వలకు చిక్కినట్టే. ఫిషింగ్‌తో సామాన్యులను టార్గెట్ చేసిన హ్యాకర్లు ఇప్పుడు క్విషింగ్ ఎర విసురుతున్నారు. క్యూఆర్ కోడ్లు కేవలం పేమెంట్ కి మాత్రమే కాదు.. కాంటాక్ట్‌ల షేరింగ్‌కి వాడేస్తున్నారు. అంతేకాదు.. అదనపు సమాచారం కోసం కూడా క్యూఆర్ కోడ్ వినియోగిస్తున్నారు. రోజురోజుకూ క్విషింగ్ దాడులు పెరుగుతున్నాయి. అందుకే సెక్యూరిటీ నిపుణులు ఈ క్విషింగ్పై అవగాహన పెంచుకోవాలని సూచిస్తున్నారు.
Quishing | కంప్యూటర్లు, ల్యాపీలు, స్మార్ట్ఫోన్ల వాడకంలో ఎప్పటి నుంచో ఎదుర్కొంటున్న ఫిషింగ్ ఎటాక్స్ లాంటిదే ఈ క్విషింగ్ కూడా. ఎటాకర్స్ నకిలీ క్యూఆర్ కోడ్స్ వాడుతూ యూజర్ల వ్యక్తిగత సమాచారాన్ని తస్కరిస్తున్నారు. మరోవైపు ఈ కోడ్లతో ప్రమాదకరమైన మాల్వేర్ను కూడా ఫోన్, ట్యాబ్లెట్లలో ఇన్స్టాల్ చేస్తున్నారు. ఎప్పుడైతే యూజర్ ఈ క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేస్తాడో.. వెంటనే మాలిషియస్ వెబ్సైట్లోకి డైరెక్ట్ చేస్తుంది. అది గమనించకుండా యూజర్లు ఏవైనా లాగిన్ వివరాల్ని ఎంటర్ చేస్తే.. వెంటనే మాల్వేర్ ముఖ్యమైన లాగిన్స్ని హ్యాకర్‌కి సెండ్ చేస్తుంది. ఒకవేళ ఆ లాగిన్స్ బ్యాంకింగ్ వివరాలైతే? మరుక్షణమే.. అకౌంట్ ఖాళీ అయిపోతుంది. యూఆర్ఎల్ లింక్‌లకు ప్రత్యామ్నాయంగా.. ప్రొఫెషనల్‌గా పుట్టుకొచ్చిన ఈ క్యూఆర్ కోడ్లతో జరుగుతున్న దాడుల్ని గుర్తించడం కాస్త కష్టమైన వ్యవహారంగానే మారుతున్నది.
ఏదైనా హోటల్‌కి వెళ్లారు అనుకుందాం. అక్కడ మెనూ తీసి చూశారు. నోరూరించే ఐటమ్స్ పేర్లు, ధరలు ఉన్నాయి. వాటి కిందే వంటలకు సంబంధించిన వీడియోలు, రివ్యూస్ కోసం క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండని రాసి ఉంది. వెంటనే మీరు క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తారు. ఇంటర్నెట్ బ్రౌజర్లో హోటల్ వెబ్సైట్ లింక్ కనిపిస్తుంది. ట్యాప్ చేసి.. బ్రౌజర్ ద్వారా సైట్లోకి వెళ్లారు. వీడియోలు, రివ్యూలు చూస్తారు. ఫుడ్ ఐటమ్స్ ఆర్డర్ చేస్తారు. క్యూఆర్ కోడ్ సేఫ్ అయితే ఫర్వాలేదు. ఒకవేళ ఓపెన్ అయిన లింక్ హ్యాకర్లు ప్రయోగించిన నకిలీదైతే.. దాంట్లో మీరు క్లిక్ చేసిన మెనూలు మాల్వేర్ ఫైల్స్ లింక్‌లు అయితే.. మీ ఫోన్ మొత్తం హ్యాకర్ కంట్రోల్లోకి వెళ్లిపోతుంది. మీకు సంబంధించిన పర్సనల్ డేటా కూడా తెలిసిపోతుంది. సో.. ఈ క్విషింగ్ దాడులకు ముందు హ్యాకర్లు ఇలా ఫిషింగ్ కోడ్స్‌ని తయారు చేస్తారన్నమాట. అవి ఎలాగైనా మీ ముందు తారసపడొచ్చు. మీరు వెళ్లున్నప్పుడు రోడ్డుపై ఎవరైనా బంపర్ ఆఫర్లు అంటూ బ్రోచర్ ఇచ్చి వెళ్లొచ్చు. దాంట్లోని క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేసేలా మిమ్మల్ని టెంప్ట్ చేసి ట్రాప్ చేయొచ్చు. లేదంటే.. సోషల్ మీడియా వాల్‌పై.. ఆన్లైన్ సూపర్ సేల్ అని కనిపించొచ్చు. ఊరించే ఆఫర్ల కింద ‘కోడ్ స్కాన్ చేయండి.. సూపర్ సేల్‌లో పాల్గొనండి’ అని ఉండొచ్చు. తొందరపడి స్కాన్ చేస్తే హ్యాకర్‌కి చిక్కినట్టే! ఈ క్విషింగ్ కోడ్లు.. రెగ్యులర్ క్యూఆర్ కోడ్లానే ఉంటాయి. దానిని స్కాన్ చేయగానే కథ కంచికి.. మనం హ్యాకర్ కంట్రోల్ లోకి!!
కొందరు సైబర్ మోసగాళ్లు పలు హోటళ్లు, దుకాణాల్లోని క్యూఆర్ కోడ్స్‌ను ట్యాంపర్ చేశారు. ఆయా హోటళ్లు, దుకాణాల్లో చెల్లింపులు చేసిన వారందరి బ్యాంకు ఖాతాల నుంచి డబ్బులు మాయమయ్యాయి. ఇదే మాదిరిగా బెంగళూరులోనూ పేమెంట్ స్కామ్‌లు జరిగాయి.
దేశంలో పలు చోట్ల క్యూఆర్ కోడ్‌తో పలు పేమెంట్ స్కామ్స్ చోటు చేసుకున్నాయి. ముంబాయి పేమెంట్ స్కామ్ ఈ తరహాదే! కొందరు సైబర్ మోసగాళ్లు పలు హోటళ్లు, దుకాణాల్లోని క్యూఆర్ కోడ్స్‌ను ట్యాంపర్ చేశారు. ఆయా హోటళ్లు, దుకాణాల్లో చెల్లింపులు చేసిన వారందరి బ్యాంకు ఖాతాల నుంచి డబ్బులు మాయమయ్యాయి. ఇదే మాదిరిగా బెంగళూరులోనూ పేమెంట్ స్కామ్‌లు జరిగాయి. పెయిడ్ పార్కింగ్‌లో నిర్వాహకుడు ఏర్పాటు చేసిన క్యూఆర్ కోడ్‌ను ఓ హ్యాకర్ ఫేక్ చేశాడు. పలు ఫేక్ క్యూఆర్ కోడ్స్‌ని పార్కింగ్‌లో ఏర్పాటు చేశాడు. వాటి ద్వారా చేసిన పేమెంట్స్ అన్నీ సరాసరి హ్యాకర్ అకౌంట్‌కి వెళ్లిపోయాయి. ఇలా పలు రకాలుగా ఈ క్విషింగ్ దాడులు జరుగుతున్నాయి. మరైతే.. ఈ క్విషింగ్ వలకు చిక్కకుండా ఉండాలంటే ఏం చేయాలి? కచ్చితంగా కొన్ని సెక్యూరిటీ చిట్కాల్ని ఫాలో అవ్వాల్సిందే. అవేంటో వచ్చే వారం తెలుసుకుని.. ఫాలో అయిపోండి.