అప్పుడెప్పుడో ఓ సినిమాలో ‘తూనీగా.. తూనీగా..’ అంటూ ఇద్దరు పిల్లలు ప్రేమ గీతం పాడుకుంటే ఇష్టంగా చూశాం. సినిమాని హిట్ చేసేశాం. దాని గురించి మరిచిపోయాం. పిల్లలు మాత్రం మర్చిపోలేదు. వయసుతో సంబంధం లేకుండా ప్రేమించేయొచ్చు అని నేర్చుకున్నారు. ఏడో క్లాస్ నుంచే లవ్‌లో పడటం స్టార్ట్ చేసేశారు. ఈ తొందరపాటు అనేక సమస్యలను తెచ్చి పెట్టడం చూస్తూనే ఉన్నాం. ఈ ప్రేమల వల్ల కలిగే నష్టాలు అన్నీ ఇన్నీ కావు!
మారుతున్న జీవనశైలి, సోషల్ మీడియా ప్రభావం, పిల్లల జీవితాలపై బలంగా పడుతున్నది. పాత కాలంలో టీనేజ్ (13-19 సంవత్సరాలు) దాటిన తర్వాత ప్రేమ, ఆకర్షణ వంటి భావనలు మొదలయ్యేవి. కానీ ప్రస్తుత తరంలో కౌమార దశకు చేరుకోకముందే, అంటే 10 నుంచి 12 సంవత్సరాల వయసులోనే పిల్లలు ఒకరిపై ఒకరు ఆకర్షణ పెంచుకోవడం, ‘ప్రేమ’ అనే పదాన్ని ఉపయోగించడం మనం చూస్తున్నాం. ఇది సమాజంలో ఆందోళన కలిగించే అంశంగా మారుతున్నది.
కౌమారదశలో ప్రేమ, ఆకర్షణ వంటి భావాలు మెదడుపై తీవ్రమైన రసాయన, నిర్మాణపరమైన మార్పులను కలిగిస్తాయి. ఈ వయసులో మెదడు ఇంకా పూర్తిగా అభివృద్ధి చెందుతూ ఉంటుంది కాబట్టి, ఈ అనుభవాలు పిల్లల ఆలోచనలు, నిర్ణయాలు, భావోద్వేగాలపై లోతైన ముద్ర వేస్తాయి.
ప్రేమలో పడినప్పుడు, ముఖ్యంగా టీనేజ్‌లో, మెదడులో డోపమైన్ అనే రసాయనం అధికంగా విడుదలవుతుంది. ఇది మెదడులోని ‘రివార్డ్ సిస్టమ్’ను ఉత్తేజపరుస్తుంది. డోపమైన్ విడుదల వల్ల పిల్లలు అమితమైన ఆనందం, ఉత్సాహం అనుభవిస్తారు. ఈ అనుభూతి చాలా శక్తిమంతంగా ఉంటుంది, కొన్నిసార్లు ఇది డ్రగ్స్ వాడినప్పుడు కలిగే అనుభూతితో సమానంగా ఉంటుంది. దీనివల్ల వారు తమ భాగస్వామి గురించి పదేపదే ఆలోచించడం, వారితోనే ఎక్కువ సమయం గడపాలని కోరుకోవడం వంటి అబ్సేసివ్ ప్రవర్తన చూపవచ్చు. బంధంలో సమస్యలు వచ్చినప్పుడు లేదా విఫలమైనప్పుడు, కార్టిసాల్ వంటి ఒత్తిడి హార్మోన్లు విడుదలవుతాయి. ఇది తీవ్రమైన బాధ, నిరాశ, ఆందోళనకు దారితీస్తుంది.
టీనేజ్‌లో మెదడులోని రెండు ముఖ్యమైన భాగాలు వేర్వేరు వేగంతో అభివృద్ధి చెందుతాయి. లింబిక్ సిస్టమ్ భావోద్వేగాలు, ప్రేరణ, రివార్డ్లకు సంబంధించిన భాగం. ఇది కౌమారదశ ప్రారంభంలోనే చురుకుగా మారుతుంది. అందువల్లే, టీనేజర్లు త్వరగా, తీవ్రమైన భావోద్వేగాలకు లోనవుతారు.
ప్రీఫ్రాంటల్ కార్టెక్స్ తార్కిక ఆలోచన, నిర్ణయం తీసుకోవడం, ప్రేరణ నియంత్రణ వంటి ఉన్నత స్థాయి ఆలోచనా సామర్థ్యాలకు బాధ్యత వహిస్తుంది. ఈ భాగం సుమారు 25-30 సంవత్సరాల వయసు వరకు పూర్తిగా అభివృద్ధి చెందదు. ప్రేమలో ఉన్నప్పుడు, మెదడులోని ప్రీఫ్రాంటల్ కార్టెక్స్ కంటే లింబిక్ సిస్టమ్ ఆధిపత్యం వహిస్తుంది. అందువల్ల పిల్లలు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం, భావోద్వేగాల ఆధారంగా పనిచేయడం, మంచి-చెడులను సరిగా అంచనా వేయలేకపోవడం జరుగుతుంది. మెదడు ఇంకా పరిపక్వం చెందకపోవడం వల్ల బంధాలలో వచ్చే చిన్న మార్పులు కూడా వారి మానసిక ఆరోగ్యంపై పెద్ద ప్రభావాన్ని చూపుతాయి. విపరీతమైన ఆనందం నుంచి తీవ్రమైన నిరాశకు త్వరగా మారే అవకాశం ఉంటుంది.
లేత ప్రేమలకు పిల్లలను నిందించడం కాదు, వారిని అర్థం చేసుకోవడం మాత్రమే సమస్య మూలాలను మారుస్తుంది.
1. స్నేహపూర్వక సంభాషణ పిల్లలతో నిత్యం మాట్లాడాలి. వారి జీవితంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. శిక్షించడం లేదా విమర్శించడం కాకుండా, వారికి ఏమైనా సమస్య ఉంటే మీతో చెప్పుకునేంత నమ్మకాన్ని పెంచాలి.
2. అవగాహన చిన్న వయసులో కలిగే ఆకర్షణ అనేది సహజమని, కానీ అది ఇప్పుడే రిలేషన్‌షిప్‌గా మారాల్సిన అవసరం లేదని వారికి వివరించాలి. ‘స్వయం-ప్రేమ’, లక్ష్యాల ప్రాముఖ్యతను బోధించాలి.
3. స్క్రీన్ టైమ్‌పై నియంత్రణ పిల్లలు చూసే కంటెంట్‌ను గమనించాలి. సోషల్ మీడియా, ఇంటర్నెట్ వాడకానికి ఒక సమయ పరిమితిని విధించాలి.
4. ఆసక్తికరమైన కార్యకలాపాలు పిల్లలను ఆటలు, సంగీతం లేదా ఏదైనా కొత్త నైపుణ్యాన్ని నేర్చుకునేలా ప్రోత్సహించాలి. దీనివల్ల వారి శక్తి నిర్మాణాత్మకమైన పనుల వైపు మళ్లుతుంది.
5. లైంగిక విద్య తల్లిదండ్రులు లైంగిక విద్య గురించి మాట్లాడటానికి సంకోచించకూడదు. లైంగిక ఆరోగ్యానికి సంబంధించిన సరైన సమాచారాన్ని వారికే అందించాలి, అప్పుడే వారు తప్పుడు సమాచారం నుంచి రక్షణ పొందుతారు.