అది మారుమూల ఊరు కాదు… మహానగరం. నిర్మానుష్యపు సందు కాదు ప్రధాన రహదారి. అర్ధరాత్రి కాదు మిట్ట మధ్యాహ్న సమయం. అందరూ చూస్తుండగా అక్కడ ఓ వ్యక్తి మరొకరిని కత్తితో కసితీరా పొడిచాడు. ఇదేదో క్షణికంగా జరిగింది కాదు. కాసేపు పెనుగులాటతో సాగింది. చుట్టూ గుమిగూడిన డజన్ల కొద్దీ మనుషులు వేడుక చూశారు. జరిగేదంతా ఫొటోలు తీసుకున్నారు. మర్నాడు వార్తాపత్రికల్లో ఈ విషయం గురించి చాలా బాధగా, ఖండనగా శీర్షికలు వచ్చాయి. నిజానికి ఇలా జరగడం మొదటిసారి కాదు. అరుదు కూడా కాదు. అడపాదడపా ఇలాంటి సంఘటనలు వినవస్తూనే ఉన్నాయి. అలాంటి ప్రతీసారీ మానవత్వం ఎలా మంటకలిసిపోతున్నదో అంటూ విశ్లేషణలూ జరుగుతున్నాయి. నిజంగానే మానవత్వం పలచబడిపోతున్నదా! ఫొటోలు తీసుకునే సమయంలో పోలీసులకు ఫోన్ చేసేంత మానవత్వమూ మిగల్లేదా? అన్న ప్రశ్నలకు కొన్ని ఆసక్తికరమైన జవాబులు వినిపిస్తున్నాయి. ఇవి సమాజాన్ని అర్థం చేసుకునేందుకే కాదు… అలాంటి సందర్భంలో మనం ఉన్నప్పుడు ఏం చేయాలో కూడా ఉపయోగపడతాయి.
ఓ 60 ఏళ్ల క్రితం సంగతి. న్యూయార్క్‌లో జెనోవీస్ అనే అమ్మాయి ఉండేది. భర్త నుంచి విడిపోయిన తర్వాత ఓ బార్లో పనిచేస్తూ పొట్ట నింపుకొంటున్నది. ఈ నేపథ్యంలో ఓ మధ్యాహ్నం వేళ జెనోవీస్ తన ఇంటికి చేరుకునేసరికి… ఓ ఆగంతకుడు ఆమెను వెంబడిస్తూ వచ్చాడు. తనను కత్తితో పొడిచి, అత్యాచారం చేసి, చనిపోయేదాకా పొడిచి వెళ్లాడు. జెనోవీస్ను మొదటిసారి పొడిచినప్పుడే తను గట్టిగా అరిచింది. కానీ, ఎవరూ ఆమె ఆర్తనాదాలను పట్టించుకోలేదు. దాదాపు అరగంటపాటు ఈ నేరం కొనసాగింది. చుట్టుపక్కల చాలామంది ఈ అరుపులను విన్నారనీ, కొంతమంది నేరాన్ని చూశారని మర్నాడు న్యూయార్క్ టైమ్స్‌లో కథనం వచ్చింది. అయితే ఈ కథనం మరీ అతిశయోక్తులతో నిండిందనీ, మరీ అంతమంది సాక్షులు లేరనీ, కొంతమంది పోలీసులకు ఫోన్ చేసే ప్రయత్నం చేశారనీ తెలిసినా… ‘జెనోవీస్ హత్య’ నేరాల పట్ల సామాజిక స్తబ్ధతకు ఓ నిదర్శనంగా నిలిచిపోయింది.
జెనోవీస్ హత్యోదంతం చాలా సంచలనంగా మారింది. దాని ఆధారంగా ఎన్నో వ్యాసాలు, పుస్తకాలు వెలువడ్డాయి. సహజంగానే వీటిలో మానవత్వం గురించి ప్రశ్నలు లేవనెత్తారు. ఈ చర్చ అంతా కూడా శాస్త్రవేత్తల దృష్టిని ఆకర్షించింది. జాన్ డార్లే, బిబ్ లెటెన్ అనే సామాజిక శాస్త్రవేత్తలు ఈ విషయమై కొన్ని పరిశోధనలకు పూనుకున్నారు. వాటిలో ఓ ప్రయోగంలో అభ్యర్థులను మూడు పరిస్థితుల్లో కూర్చోబెట్టారు. మొదటి సందర్భంలో గదిలో వాళ్లు ఒంటరిగా ఉన్నారు. రెండో పరిస్థితిలో మరో ఇద్దరితో కలిసి కూర్చోబెట్టారు. మూడో నేపథ్యంలో తాము చెప్పినట్టు చేసే ఓ ఇద్దరు వ్యక్తులతో కలిపి కూర్చోబెట్టారు. ఇక ఆ తర్వాత ప్రయోగం మొదలైంది. ఆ గదిలోకి సన్నగా పొగను వదిలారు. ఒంటరిగా ఉన్న అభ్యర్థుల్లో ఏకంగా 75 శాతం మంది ఆ పొగ గురించి రిపోర్ట్ చేశారు. మరో ఇద్దరితో కూర్చున్నవారిలో దాదాపు మూడో వంతు మాత్రమే పొగ గురించి హెచ్చరించేందుకు సిద్ధపడ్డారు. ఇక మూడో పరిస్థితిలో శాస్త్రవేత్తలు సూచించినట్టుగా మిగతా ఇద్దరూ నిశ్శబ్దంగా ఉండిపోయినప్పుడు… పొగ గురించి చెప్పేవారి సంఖ్య ఏకంగా పదోవంతుకు తగ్గిపోయింది. ఈ తరహా సామాజిక స్తబ్ధతకు ‘బైస్టాండర్ ఎఫెక్ట్’ అని పేరు పెట్టారు ఆ ఇద్దరు శాస్త్రవేత్తలు. ఆ తర్వాత కూడా ఎన్నో పరిశోధనలు పదేపదే ప్రమాదంలో ‘ప్రేక్షకపాత్ర ప్రభావాన్ని’ రుజువుచేశాయి. కేవలం అనూహ్యమైన పరిస్థితుల్లో మాత్రమే కాదు… సాటి మనిషి ప్రమాదంలో ఉన్నప్పుడు కూడా చుట్టూ ఉండే గుంపులో స్తబ్ధత ఉన్నట్టు గ్రహించారు.
బైస్టాండర్ ఎఫెక్ట్‌ను కనుగొని యాభై ఏళ్లకు పైనే అయ్యింది. కాబట్టి ఇప్పటికిప్పుడు అకస్మాత్తుగా మానవత్వం కనుమరుగైపోయింది అనుకోవడానికి లేదు. అయితే ఈ ప్రభావానికి కారణాలేంటో తెలుసుకోవడం కాస్త ఆసక్తిగానే ఉంటుంది.
ఇంతమంది చూస్తుండగా జరుగుతున్నది కదా! నేనే ఎందుకు బాధ్యత తీసుకోవాలి అనే ఆలోచనే ఈ ప్రేక్షక ప్రభావానికి అతి ముఖ్య కారణం అంటారు. దీనికి ‘Diffusion of responsibility’ అని పేరు. గుంపు పెరిగే కొద్దీ ఈ ఆలోచన మరింత బలంగా అడ్డుపడుతుందట. అంతేకాదు! అక్కడ ఎవరన్నా నిపుణులు (ఉదా॥ అగ్నిమాపక సిబ్బంది, వైద్యులు, పోలీసులు…) ఉంటే ఆ భరోసాతో మరింత స్తబ్ధుగా ఉంటారని తేలింది. ఈ Diffusion of responsibility కేవలం ప్రమాదాలకు మాత్రమే పరిమితం కాదు. ఇతరుల పట్ల అణచివేత జరుగుతున్నప్పుడు, తప్పు చేయమని అధికారులు సూచించినప్పుడు… అది తమ నిర్ణయం కాదు, తప్పు కాదు కాబట్టి ఫర్వాలేదులే అనే భావనే స్తబ్ధతకు దారితీస్తుంది. ఇదే యుద్ధ నేరాలకు, వివక్షకు దారితీస్తుంది. ఆఫీసుల్లోనో, స్కూళ్లలోనో ఎవరో ఒకరిని లక్ష్యంగా చేసుకుని ఏడిపించినప్పుడు… మిగతావారి మౌనానికి కారణం కూడా ఇదే!
ఏదన్నా నేరం లేదా తప్పు జరుగుతున్నప్పుడు అక్కడి గుంపులో ప్రతి ఒక్కరూ కీలకంగా మారతారు. ఆ అనిశ్చితిలో ఒకరిని చూసి మరొకరు ప్రేరణ పొందుతారు. ఎవరూ ఏమీ మాట్లాడకపోతే.. తాము కూడా నిశ్శబ్దంగా ఉండిపోతే పోలా అనే భావన బలపడుతుంది. దీనికే Pluralistic ignorance అని పేరు.
పరిస్థితి ఎంత తీవ్రంగా ఉంటే… దాన్ని ఎదుర్కొనే ప్రయత్నం కూడా అంతే బలహీనంగా ఉంటుంది. ఇద్దరు గొడవపడుతున్నప్పుడు, ఒకరి చేతిలో కత్తి ఉంటే మధ్యలోకి వెళ్తే, మనకేం ప్రమాదమో అనే భయం సహజం. రోడ్డు ప్రమాదాల్లో చాలామంది క్షతగాత్రుల జోలికి పోకుండా ఉండటానికి ఇది కూడా ఓ కారణం. తనను రక్షించే ప్రయత్నంలో అనవసరంగా కోర్టులు, కేసుల చుట్టూ తిరగాల్సి వస్తుందనే అనుమానంతో చాలామంది చోద్యం చూస్తుంటారు.
తను అక్కడ నిలబడిన సమయంలో చుట్టూ ఉన్న సామాజిక పరిస్థితులు ఎలా ఉన్నాయన్న విషయం కూడా కొంత ప్రభావం చూపిస్తుంది. ఎవరున్నారు, ఎవరు ఏమనుకుంటారు అనే విశ్లేషణది కీలకపాత్ర. ఉదాహరణకు అంతా ఒకే సమూహానికి చెందిన వ్యక్తులైతే కలిసికట్టుగా ఎదుర్కోవాలనే ధైర్యం రావచ్చు!
అసలు ఈ బైస్టాండర్ ఎఫెక్ట్ అనే సిద్ధాంతం ఒకటి ఉంది. మన సాయానికి అడ్డుగా నిలుస్తున్నది అనే ఎరుకే చాలా ముఖ్యమంటున్నారు సామాజికవేత్తలు. అది తెలిసినప్పుడు, మనలో ఏర్పడిన స్తబ్ధతను, దాని పర్యవసానాన్నీ గుర్తించగలుగుతామట. కాబట్టి ఈసారి అలాంటి పరిస్థితి ఏదైనా ఎదురైనప్పుడు, దాన్ని ఓ వినోదంగానో ప్రమాదంగానో కాకుండా సాయం చేసే సందర్భంగా మార్చుకుందాం.
సీపీఆర్ (కార్డియోపల్మనరీ రిససిటేషన్) కృత్రిమ శ్వాసను అందించే ఓ పద్ధతి. గట్టిగా కూర్చుంటే ఓ గంటలో దీని మీద పట్టు సాధించవచ్చు. కానీ మనదేశంలో కేవలం రెండు శాతం మందికే దీని గురించి అవగాహన ఉన్నట్టు ఓ నివేదిక చెబుతున్నది. బహుశా అందులోనూ వైద్య సిబ్బందో లేక స్వచ్ఛంద కార్యకర్తలో ఉండి ఉంటారు. కళ్ల ముందు ఎవరికన్నా స్పృహ తప్పడం, విద్యుదాఘాతం, నీళ్లలో మునగడం… లాంటి పరిస్థితుల్లో ఊపిరి ఆగిపోతే ఈ చిన్నపాటి నైపుణ్యంతో వారి ప్రాణాలు కాపాడవచ్చు. అంతేకాదు. యాభై శాతం గుండెపోట్లు రోజువారీ దినచర్యలో అకస్మాత్తుగా వస్తాయని ఓ గణాంకం చెబుతున్నది. మనవారైనా, తెలియనివారైనా… కళ్ల ముందే గుండె పట్టుకుని కూలిపోయే సందర్భంలో సీపీఆర్ తెలిసి ఉంటే ప్రాణాలు కాపాడే అవకాశం ఉంటుంది. కేవలం సీపీఆర్ మాత్రమే కాదు… ఈ తరహా ప్రథమ చికిత్సల పట్ల ఎలాంటి అవగాహన లేకపోవడంతో ఏటా లక్షన్నర మంది మన కళ్ల ముందే చనిపోతున్నారని ‘ద గార్డియన్’ పత్రిక పేర్కొంది. ‘ఏ చికిత్స చేయాలో నాకు తెలియదు కదా!’ అనే అవగాహన లోపం బైస్టాండర్ ఎఫెక్ట్‌కి ఒకానొక కారణంగా మారుతున్నది.
సీసీటీవీ కెమెరాలు వచ్చిన తర్వాత ప్రమాదాలు జరిగిన స్థలం దగ్గర పరిస్థితులు కళ్లకు కట్టినట్టు కనిపిస్తున్నాయి. ఇవన్నీ కూడా ‘బైస్టాండర్ ఎఫెక్ట్’ను పదేపదే రుజువు చేస్తున్నాయి. చైనాలోనూ ఇలాంటి ఓ సంఘటన జరిగింది. ఓ రెండేళ్ల పిల్ల మీదినుంచి వ్యాన్ వెళ్లిపోయినా, చుట్టుపక్కల వాళ్లు పట్టనట్టున్న సందర్భం తీవ్రమైన విమర్శలకు దారితీసింది. ఇదే సమయంలో అదే చైనాలో ఓ విదేశీయుడు స్పృహ తప్పి పడిపోతే, తనను కాపాడేందుకు అందరూ ముందుకు రావడం కనిపించింది. ఈ రెండు ఘటనల మధ్యా స్పందనల్లో వ్యత్యాసానికి కారణం ఏమిటా అని ఆలోచించినప్పుడు… అతిథులకు లోటు రాకుండా చూసుకోవాలనే సామాజిక విలువలే కారణం అని స్పష్టమైంది. తరాలుగా మనకు ఏదైతే మంచి అని చెబుతూ పెంచుతారో, ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తారో… ఆ విలువల తాలూకు ప్రభావం ‘బైస్టాండర్ ఎఫెక్ట్’ మీద కచ్చితంగా ఉంటుందని అంటున్నారు. ఒకప్పుడు మనకు నీతి శతకాలు ఉండేవి, పెద్దల మాటలు వినిపించేవి, రోజువారీ మాటల్లో సూక్తులూ సామెతలూ దొర్లేవి, మోరల్ క్లాసెస్ పేరిట ప్రత్యేక తరగతులు ఉండేవి. కానీ ఇప్పుడు! కుటుంబాలు చిన్నబోయాయి, సంపాదనే సామర్థ్యానికి గీటురాయిగా మారింది, భౌతిక సంపదే విజయంగా భావిస్తున్నారు, సామాజిక విలువల్ని అసమర్థతగా అనుమానిస్తున్నారు. సాటి మనిషి ప్రమాదాన్ని ఓ చోద్యంగానో, సెల్ఫీ తీసుకునే సందర్భంగానో భావించడం వెనుక ఇవన్నీ ముఖ్య కారణాలే అంటున్నారు సామాజిక శాస్త్రవేత్తలు.
మనం ఫేస్బుక్లో ఏదో పోస్టు చూస్తున్నాం. ఇంతలో ఆ పోస్టు పెట్టిన వ్యక్తిని తిడుతూనో, బెదిరిస్తూనో కొన్ని సందేశాలు కనిపించాయి. లేదా సదరు వ్యక్తే నాకు ప్రమాదం పొంచి ఉందంటూ వాపోయాడు. ఇలాంటప్పుడు కూడా బైస్టాండర్ ఎఫెక్ట్ పనిచేయడం ఆశ్చర్యం. మనకు నేరుగా ప్రమాదం లేదని తెలిసినా కూడా అది తప్పని చెప్పేందుకు, ధైర్యాన్ని అందించేందుకు ఎవరూ ఆన్లైన్లో కూడా ముందుకు రాకపోవడాన్ని గమనించారు పరిశోధకులు.
రోడ్డు మీద కళ్ల ముందే ఓ ప్రమాదం జరిగింది. కానీ కాపాడదాం అనుకుంటే మనం చిక్కుల్లో పడతామేమో కదా! అనే అనుమానం లక్షల ప్రాణాలను బలిగొంటున్నది. సాక్షాత్తు భారత ప్రభుత్వ అంచనా ప్రకారమే ఓ పదేళ్ల వ్యవధిలో 13 లక్షల మంది రోడ్డు ప్రమాదాల్లో చనిపోతే… వీరిలో కనీసం సగం మంది అయినా సకాలంలో చికిత్స అందితే బతికేవారు. పోలీసుల ప్రశ్నలు, ఆసుపత్రిలో
నిబంధనలు, కోర్టుల చుట్టూ తిరగడం… లాంటి ఎన్నో అంశాలు సాటి మనిషిని కాపాడేందుకు అడ్డుపడుతున్నాయని అందరూ గ్రహించారు. అందుకే ‘గుడ్ సమారిటన్ లా’ పేరిట సాయం చేయాలని పౌరులను ప్రోత్సహించే ప్రయత్నం జరిగింది. Motor Vehicle (Amendment) Act 2019 లో 134A ప్రకారం ప్రమాద విషయంలో వీరి గోప్యతకు, సాయానికి, వ్యక్తిగత వివరాలకు భంగం వాటిల్లకుండా చూసుకోవాల్సిన బాధ్యత అన్ని వ్యవస్థలది అని స్పష్టం చేశారు.
రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి సాయం చేసిన వ్యక్తులకు ప్రభుత్వం ప్రోత్సాహకాలనూ అందిస్తున్నది. క్షతగాత్రులను గోల్డెన్ అవర్‌లోపు ఆస్పత్రికి తరలిస్తే రూ.25 వేలు నగదు బహుమతి అందుకోవచ్చని ఇటీవల కేంద్రం ప్రకటించింది. ఇలా ఎక్కువ మంది బాధితులకు ప్రాణదానం చేసిన వారు రూ.లక్ష దాకా ప్రోత్సాహకం పొందొచ్చు. ఈ తరహా చట్టాలు చాలా దేశాల్లోనే అమలులో ఉన్నాయి. కానీ ఓ నివేదిక ప్రకారం ఇలాంటి చట్టాలు ఉన్నట్టు 84 శాతం మందికి తెలియదు. 59 శాతం మందిని ఇప్పటికీ పోలీసులు తమ అదుపులోకి తీసుకుంటున్నారు. అందుకే గుడ్ సమారిటన్ చట్టాల గురించి అవగాహన కల్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మన దేశంలో ఏటా మార్చి 30న Good Samaritan Law Day నిర్వహిస్తున్నారు.
మొదట్లోనే చెప్పుకొన్నట్టు ప్రమాదంలో ప్రేక్షకపాత్ర గురించి పత్రికల్లో తరచూ వార్తలు వస్తూనే ఉంటాయి. కానీ కొన్ని సందర్భాలు మాత్రం… సమాజంలో స్తబ్ధత ఈ స్థాయిలో ఉందా అనేంత బాధ కలిగిస్తాయి.
– కె.సహస్ర