సమస్త జీవరాశికి చెట్లే జీవనాధారం. ఒక్క విత్తనం నాటితే అది వృక్షంగా మారి తీయని ఫలాలను మనకు ఇస్తుంది. ఆకలి తీర్చి, ఔషధంగా మేలు చేస్తుంది! అలాంటి ఔషధ తరువులకు ఆలవాలం ‘పీవీ నరసింహారావు ఔషధ వనం’. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం తోల్కట్ట గ్రామంలో ఉన్న ఈ వనంలోని ఔషధ వృక్షాల విశేషాలు ఇక వారం వారం.
చేదు మాను.. చేసేది మేలు..
మండు వేసవిలో వేపచెట్టు కింద సేదతీరితే చల్లగా ఉంటుంది. ప్రతి తెలుగు ఇంటి ముందూ వేపచెట్టు ఉంటుంది. వేపచెట్టు లేని వీధి ఏ ఊరిలోనూ ఉండదు. వేపచెట్టు శాస్త్రీయనామం ‘అజాడిరక్టా ఇండికా’. సామాన్యుల భాషలో ‘శ్రీ మహాలక్ష్మి స్వరూపం’. మా స్వగ్రామం వంగరలో మా ఇంటిముందు వందేండ్లకు పైబడ్డ పెద్ద వేపచెట్టు ఉండేది.
వేపచెట్టు ఔషధ గని. వేపలో యాంటి బ్యాక్టీరియల్, యాంటి ఫంగల్ లక్షణాలు ఉంటాయి. అందుకే దీన్ని సర్వరోగ నివారిణిగా పేర్కొంటారు. వేపగింజలు, పండ్లు, ఆకులు, పువ్వులు, బెరడు .. ఇలా అన్ని రకాల శాఖీయ భాగాలూ ఓషధులకు నెలవే. ఉదయమే వేపపుల్లతో దంత ధావనం అలవాటు ఇప్పటికీ కనిపిస్తుంది. పరగడుపున రెండు లేత వేపాకులు తింటే జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుందని పెద్దలమాట. మశూచి సోకినప్పుడు వేప ఆకులు దగ్గర ఉంచేవారు.
ఈ ఆకుల గాలితో చర్మం మీద పొక్కులు, మంట ఉపశమిస్తుంది. మశూచి తగ్గిన తర్వాత చర్మ సంరక్షణ కోసం నూరిన వేపాకులో పసుపు కలిపి ఒళ్లంతా పులిమి స్నానం చేయించేవారు. ఇలా చేయడం వల్ల చర్మం మీద పొక్కులు, మచ్చలు ఏర్పడవు. చర్మం పూర్వంలా కాంతిమంతంగా ఉంటుంది. యాంటి బ్యాక్టీరియల్
లక్షణాలు పుష్కలంగా ఉన్నందువల్ల చాలా రోగాల నివారణకు వేప ఆకు రసం తాగుతారు. చర్మవ్యాధులు, ఊబకాయానికి ఇది దివ్యమైన ఔషధం.
సాగులో చీడపీడల నివారణకు ఉపయోగించే రసాయనిక పురుగుమందుల వల్ల పర్యావరణానికి, అలా పండిన ఆహారం తినేవాళ్లకు, సాగు చేసే రైతులకు హాని జరుగుతున్నది. ఈ ప్రమాదాన్ని నివారించాలంటే సేంద్రియ సాగువైపు మళ్లాలని అందరూ చెబుతున్నారు. సేంద్రియ పద్ధతిలో సాగు చేసే రైతుకు చీడల నివారణకు ఉన్న మొదటి దారి వేపగింజలతో తీసిన నూనె, వేపాకులతో చేసిన రసాలే. వేపచెట్టు బెరడు, పండ్లతో తయారుచేసిన వేప కేక్, వేపనూనె.. పంటలపై చీడపీడల నివారణకు ఉపయోగిస్తారు. ఇక పండుగల విషయానికి వస్తే.. ఉగాది పచ్చడిలో వేప చేదు కూడా రుచిగానే అనిపిస్తుంది. ఆషాఢమాసం బోనాల్లో వేపకొమ్మలు తప్పనిసరి. ఈ విధంగా మన సంప్రదాయంలో వేప విడదీయరాని భాగమైపోయింది.
– ఎమ్మెల్సీ సురభి వాణీదేవి, పీవీ కూతురు