రామాయణ, మహాభారత ఇతిహాసాలు సంస్కృతంలో పుట్టాయి. రకరకాల భాషల్లోకి అనువాదం అయ్యాయి. అందరినీ అలరించాయి. ఈ ఇతిహాసాల సారాన్ని అడవి బిడ్డలకూ అందించాలని సంకల్పించారు ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఉపాధ్యాయుడు తొడసం కైలాస్. మహాభారతాన్ని గోండి భాషలో అనువదించి శభాష్ అనిపించుకున్నారు. అక్కడితో ఆగలేదు ‘సోభత ఖడి’ పేరుతో రామాయణంలోని సుందరకాండనూ గోండి భాషలో గీతాలుగా అందించారు. ఇటీవల తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ చేతుల మీదుగా ఈ పుస్తకం ఆవిష్కృతం అయింది. ఈ సందర్భంగా తొడసం కైలాస్ పంచుకున్న ముచ్చట్లు ఇవి..

మాది ఆదిలాబాద్ జిల్లాలోని మావల మండలం వాఘాపూర్ గ్రామం. మా చిన్నతనంలో వీధి నాటకాలకు మంచి క్రేజ్ ఉండేది. టీవీలు, సెల్ఫోన్ల గోల లేకుండా రాత్రయిందంటే చాలు రామాయణం, మహాభారతాలకు సంబంధించిన నాటికలు వేసేవాళ్లు. అవంటే నాకు చిన్నప్పటి నుంచే తెలియని ఇష్టం ఏర్పడింది. కొన్ని రోజులకు టీవీలు వచ్చినా అందులో కూడా ఇతిహాస కథలకు సంబంధించిన సీరియల్సే చూసేవాణ్ని. 2001లో స్పెషల్ డీఎస్సీలో టీచర్ కొలువు సాధించాను. స్థానిక భాషలో చదివితే విద్యార్థులకు తొందరగా అర్థమవుతుందన్న ఆలోచనతో పాఠశాలలోని పలు పాఠ్యాంశాలను గోండి భాషలోకి అనువదించి చిన్నారులకు బోధించేవాణ్ని. ఇలా చిన్న చిన్న అనువాదాలు చేస్తున్న తరుణంలో రామాయణ, మహాభారతం లాంటి ఇతిహాసాలను గోండి ప్రజలకు అందించాలనే కోరిక కలిగింది.
రామాయణ, మహాభారతాలను గోండి భాషలోకి అనువదించడానికి చాలా కసరత్తు చేశాను. ఇంతలో కరోనా రావడంతో.. వాటిని రాయడంలో విఫలమయ్యాను. కొన్నాళ్లకు ఆ ప్రతులు కూడా చినిగిపోయాయి. 2024లో నా భార్య క్యాన్సర్ సోకి ఆస్పత్రి పాలైంది. ఆ సమయంలో ఎంతో కుంగిపోయాను. నేను బాధపడితే పిల్లలు తట్టుకోలేరని లేని ధైర్యం తెచ్చుకున్నా. ఈ బాధలకు ఉపశమనంగా ఉంటుందని మహాభారతాన్ని గోండి భాషలోకి అనువదించడం మొదలుపెట్టాను. నా భార్యకు చికిత్స అందిస్తూనే నా ప్రయత్నం కొనసాగించాను. పెన్ను, పేపర్ వాడలేదు. మొత్తం మొబైల్‌ఫోన్‌లోనే టైప్ చేశాను. చిన్నప్పటి నుంచి మహాభారతం కథలు ఎన్నోసార్లు విన్నాను, చదివాను. ఆ అనుభవంతో నాలుగు నెలల్లోనే మహాభారతంలోని పద్దెనిమిది పర్వాలను ‘పండోక్న మహాభారత్ కథ’ పేరుతో అనువదించాను. నా సొంత ఖర్చులతో పుస్తక రూపంలోకి తెచ్చాను. దేవుడి దయతో నా భార్య ఆరోగ్యంతో తిరిగొచ్చింది. నాకు కూడా గొప్ప రచన చేసిన ఆనందం కలిగింది. 2024 వేసవి సెలవుల్లో దీనిని పూర్తి చేశాను.
గోండి, కొలామి భాషల పరిరక్షణకు నా వంతు కృషి చేస్తున్నా. పుస్తక రచనతోపాటు కృత్రిమ మేధతో యాంకర్‌ను సృష్టించి గోండి భాషలోనే వార్తలు చదివిస్తున్నా. ఇతర భాషల్లోని వందలాది పాటలను గోండి భాషలోనే పాడిస్తున్నా. ప్రారంభంలో ఏఐ వాడకం కాస్త ఇబ్బంది అనిపించింది. ప్రతి రోజూ కసరత్తు చేయడం వల్ల ఇప్పుడు అలవాటైంది.
మామూలుగా ప్రతి ఉదయం తొందరగా స్నానం చేసి, దేవుడికి పూజ చేస్తుంటాను. తర్వాత కాసేపు పియానో వాయిస్తుంటాను. ఓ మంగళవారం అలా పియానో వాయిస్తుంటే.. నా కూతురు గంగోత్రి.. టీవీలో ఎమ్మెస్ రామారావు గారి సుందరకాండ పెట్టింది. నా మనసు దానిపైకి మళ్లింది. ఆ అద్భుతమైన పారాయణం గోండి భాషలో ఉంటే బాగుంటుంది కదా అనిపించింది. కానీ, అందులోని కఠినమైన పదాలను ఎలా అర్థం చేసుకోవాలో తెలియలేదు. అందులోని గ్రాంథిక పదాల అర్థం కోసం శబ్ద రత్నావళి నిఘంటువును ఆశ్రయించా. గూగుల్‌లో సెర్చ్ చేశా. ఏదైతేనేం.. 45 రోజుల్లో ‘సోభత ఖడి’ పేరుతో సుందరకాండను గోండి భాషలో అనువదించి, పుస్తకంగా తీసుకొచ్చా. ప్రతిరోజూ స్కూల్ నుంచి రాగానే.. ఈ పనిమీదే ఉండేవాణ్ని. నేను రాసిన ‘సోభత ఖడి’ గీతాలకు మా అబ్బాయి సృజన్‌రామ్ కృతిమ మేధను ఉపయోగించి స్వర రచన చేశాడు.
మహాభారతాన్ని గోండిలోకి అనువాదం చేసిన సందర్భంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు భాషను బతికిస్తున్నందుకు అభినందించారు. ‘మన్ కీ బాత్’లో ప్రధాని ప్రశంసించడం మర్చిపోలేని అనుభూతి. రాష్ట్రపతిని కలవడంతో మరింత ప్రోత్సాహం కలిగింది. అదే ఉత్సాహంతో ముందుకు సాగుతున్నా. ప్రస్తుతం ఇంద్రవెల్లి మండలంలోని గౌరాపూర్ ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో సాంఘిక శాస్త్రం ఉపాధ్యాయుడిగా చేస్తున్నాను. నా ప్రయాణం ఇప్పుడే మొదలైందేమో అనిపిస్తుంది. మరిన్ని కావ్యాలను గోండి భాషలోకి అనువదించేలా నా ప్రయత్నం కొనసాగిస్తా. గోండి భాషను భారత రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో చేర్చాలన్నదే నా లక్ష్యం.
– రాజు పిల్లనగోయిన