‘చికాకుగా అనిపిస్తే కొంచెందూరం నడవండి. అయినా చికాకుగానే ఉంటే ఇంకొంత దూరం నడవండి’ అంటారు వైద్యశాస్త్ర పిత హిపోక్రేట్స్. నడక ప్రాధాన్యం ప్రచారానికి యూనివర్సిటీ ఆఫ్ సౌత్ కాలిఫోర్నియా విద్యార్థి మియా లిండ్ 2020లో ‘హాట్‌గర్ల్ వాక్’ అనే వెబ్సైట్ సృష్టించింది. ప్రతికూల ఆలోచనల నుంచి బయటపడేందుకు, సానుకూల ఆలోచనలు గుండెల్లో నింపుకొనేందుకు లిండా రోజుకు ఆరు కిలోమీటర్లు నడిచేది. దీంతో తనలో ఆత్మవిశ్వాసం పెరిగింది. బోనస్‌గా ఆనందమూ పెరిగింది. 2021లో కుటుంబసభ్యులు, స్నేహితుల ప్రోత్సాహంతో కొత్తరకం వాకింగ్ స్టయిల్ ప్రారంభించింది. నచ్చిన స్పోర్ట్స్ డ్రెస్ వేసుకుని, ఇష్టమైన సంగీతమో, ప్రసంగాలనో వింటూ నడక సాగించడమే ఈ టెక్నిక్.
ప్రతికూల ఆలోచనలకు విరుగుడు నడకే. ఫిట్‌గా ఉన్నవారైనా, లేనివారైనా చేయగలిగే వ్యాయామం ఇదొక్కటే. నడక మనల్ని జాగరూకుల్ని చేస్తుంది. చురుగ్గా ఉంచుతుంది. మన ప్రతి కదలిక పట్లా ఎరుక ఉండేలా, అనుభూతి చెందేలా చేస్తుంది. అన్నట్టు, నడకలోనూ కొత్తకొత్త విధానాలు వచ్చాయి.
నానా రకాలు
ఈ ఏడాది మరో రకం వాకింగ్ ట్రెండ్ ప్రచారంలోకి వచ్చింది. దీనిని ‘వియర్డ్ వాక్’ అంటారు. మనకు భయం కలిగించే, మనం సహించలేని దృశ్యమేదో కంటపడే వరకూ నడవడం. దీనివల్ల రోజువారీ లక్ష్యమైన 10,000 అడుగులు వేయడంతోపాటు, పరిసరాల పట్ల ఎరుక కూడా పెరుగుతుంది. ఈ సాధన మనల్ని వర్తమానంలో బతికేలా చేస్తుంది.
లాలీగాగ్ వాకింగ్
ఎలాంటి లక్ష్యాలూ, ఆలోచనలూ లేకుండా నడవటమే లాలీగాగ్ వాకింగ్. ఈ నడకలో సంగీతం వింటూ పార్కు చుట్టూ రౌండ్లు వేస్తారు. కొన్నిసార్లు ప్రత్యేకించి ఓ గమ్యం అంటూ లేకుండా నడుస్తూనే ఉంటారు. దారిలో చెట్లు, జంతువులు, పక్షులను చూస్తూ మైమరిచిపోతారు. నగర వాసులైతే అపార్ట్మెంట్ పరిసరాల్లోనే పదివేల అడుగులు పూర్తి కానిచ్చేస్తారు.
జబ్బుల ముప్పు తగ్గుతుంది
రోజుకు పదివేల అడుగులు వేయడం అంటే… గుండెజబ్బులు, డెమెన్షియా, 13 రకాల క్యాన్సర్ల ముప్పును తగ్గించుకోవడమే అని వెల్లడించింది జామా న్యూరాలజీ అనే మెడికల్ జర్నల్. అంతేకాదు నడక రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. బాడీ మాస్ ఇండెక్స్‌ను అదుపులో ఉంచుతుంది.
ఉత్త కాళ్లతో
చెప్పులు, షూస్ లేకుండా నడవడం కూడా మంచిదే అంటున్నారు వ్యాయామ నిపుణులు. దీనివల్ల ఒత్తిడి నుంచి బయటపడతాం. ఏదో ఒక విషయం గురించి తీవ్రంగా ఆలోచించే జాడ్యం నుంచి బయటపడతాం. కొత్త ఐడియాల తలుపులు తెరుచుకుంటాయి.
రిస్క్ తగ్గించే బ్రిస్క్ వాకింగ్
వ్యాయామం అసలే చేయనివారు, ఏదో ఒక శారీరక కసరత్తు చేయాలనుకునేవారు పరిమితవేగంతో బ్రిస్క్ వాక్ చేస్తే మంచిదని నిపుణుల సూచన. బ్రిస్క్ వాకింగ్ గుండెకు మేలు చేయడంతోపాటు మన శరీరం మొత్తాన్నీ ఆరోగ్యవంతం చేస్తుంది. జీవితంలో నాణ్యత పెంచుతుంది. నిపుణుల అభిప్రాయంలో నడక అనేది ‘మితమైన వ్యాయామం’. ఒత్తిడి నుంచి బయటపడేస్తుంది. ప్రతికూల ఆలోచనలనుంచి సానుకూల దృక్పథం వైపు నడిపిస్తుంది.