‘నమస్తే తెలంగాణ, ముల్కనూరు ప్రజాగ్రంథాలయం’ సంయుక్తంగా నిర్వహించిన ‘కథల పోటీ-2021’లో రూ.2 వేల బహుమతి పొందిన కథ.
ఆఫీసులో తన హెడ్ రమణమూర్తి అనుమతి తీసుకోకుండానే చనిపోయాడు వినయ్ బాబు. ఆత్మ ఇంకా ఇల్లు దాటలేదు. దాదాపు అరగంటపాటు.. పడరాని పాట్లు పడ్డాక, తను చనిపోయానన్న నిర్ణయానికి వచ్చాడు. విషయం తెలియగానే బాధతో గట్టిగా అరిచి ఏడ్చాడు.. చచ్చిన వినయ్. ఓదార్చే వాళ్లు ఎవరూ లేరని తెలిసి, ఏడుపు త్వరగానే విరమించుకున్నాడు. గడియారం వైపు చూశాడు. సమయం ఒంటిగంట అయ్యింది. గడియారంలో ముల్లు కదులుతున్న కొద్దీ తనలో భయం పెరిగిపోతున్నది. దానికి కారణం.. ప్రతిరోజూ సరిగ్గా 8.30 గంటలకు తను ఆఫీసులో వేలిముద్రతో హాజరు వేయాలి. లేదంటే ఆలస్యానికి కారణం చెబుతూ లెటర్ రాసి, హెచ్ఆర్కు సంజాయిషీ ఇచ్చుకోవాలి. ఇదంతా ఒకెత్తయితే ఆ లెటర్ మీద కచ్చితంగా తన హెడ్ సంతకం ఉండాలి. ఆ సంతకం పెట్టేముందు ఒక తిట్టో లేదా ఒక చిరాకైన చూపో హెడ్ రమణమూర్తి నుంచి బహుమతిగా తీసుకోవాల్సి ఉంటుంది. సంస్థ తెచ్చిన కొత్త పాలసీ మూలాన తన సెలవులన్నీ ఎగిరి
పోయాయి. ఇప్పుడు తను పెట్టే ప్రతీ సెలవు.. ‘లాస్ ఆఫ్ పే’నే అవుతుంది. ఈ చావు మూలాన తను ఈరోజు నుంచి ఆఫీసుకు వెళ్లలేడు. ఈ విషయం తనను ఎంతో బాధకు గురిచేసింది.
తన చావు గురించి తెలిసి బయటికి బాధ నటించినా.. ఆఫీసుకు అటెండ్ కానందుకు మనసులో తనను రమణమూర్తి తప్పక తిట్టుకుంటాడని వినయ్ బాబుకు తెలుసు. ఆ విషయం గురించి తలుచుకుని మళ్లీ కుమిలిపోయాడు. ఆపిల్ పండు తింటూనో, కాసేపు గురకపెట్టి నిద్రపోతూనో, అందరిచేత పని చేయించగల సమర్థుడు రమణమూర్తి. తాను పని చేయకపోయినా సంస్థమీద, చైర్మన్ గారి మీద భక్తి చూపించడంలో మూర్తి తనకు తానే సాటి. తన భక్తిని అంటురోగంలా కింది ఉద్యోగులకూ అంటిస్తుంటాడు. వినయ్ కూడా సంస్థాగ్రస్తుడే. సంస్థలో పనిచేసే ప్రతీ మేనేజర్.. చైర్మన్ గారి లీలల్ని అవకాశం దొరికినప్పుడల్లా కిందిస్థాయి ఉద్యోగులకు వినిపించి మురిసిపోతుంటారు.
‘ఛీ! అన్నం పెట్టిన సంస్థకు ఎంత అన్యాయం చేశాను? నా కష్టానికి ఇవ్వాల్సిన జీతం కన్నా తక్కువే ఇస్తుండొచ్చు. ప్రతీ సంవత్సరం ఐదు లీటర్లు పెట్రోల్ కొనగలిగేంత జీతమే పెంచుతుండొచ్చు. నాకంటూ సొంత గౌరవం గట్రాలాంటివి ఇవ్వకపోయినా.. నాకు ఉద్యోగి హోదా కల్పించింది నా సంస్థ. నేను ఛాతీని పెద్దగా చేసుకుని సమాజంలో తిరుగ గలుగుతున్నానంటే అందుకు కారణం ఎవరు? మా సంస్థే కదా! నా చావు విషయం చైర్మన్ గారికి తెలిస్తే.. ‘చెప్పా పెట్టకుండా చనిపోయేవాణ్ని పనిలో ఎందుకు పెట్టుకున్నారయ్యా!?’ అని హెచ్ఆర్ని, తనను ఇంటర్వ్యూ చేసిన రమణమూర్తిని ఎన్ని చీవాట్లు పెడతాడో?! దానికి తోడు నేను పూర్తిచేయాల్సిన పని అంతా అలానే ఉంది. కనీసం ఆ పని పూర్తిచేసైనా చావకపోయానే!’ అని వినయ్ బాబు ఆత్మ.. ఆత్మన్యూనతకు లోనయ్యింది.
ఇంతలో బాబుకు తన పక్క డెస్కు అమ్మాయి.. కామ్రేడ్ శ్రీవాణి గుర్తుకు వచ్చింది. ఆ అమ్మాయి ఈ మధ్యనే ఆఫీసులో చేరింది. తెలివైన అమ్మాయి. ఇటీవలే చదువు పూర్తిచేసుకుంది. చదువుతోపాటు కాస్త కమ్యూనిజం కూడా అబ్బింది. మాట్లాడిన ప్రతీసారి లెనిన్నో, మార్క్స్‌నో స్మరిస్తూనే ఉంటుంది. ఆ పదాలు విన్న ప్రతీసారి.. డెస్క్‌లో అందరూ ఉలిక్కిపడి, ఆ అమ్మాయి వైపు చూసేవాళ్లు. వినయ్ బాబుకు ఆ అమ్మాయంటే ఎనలేని అసహ్యం. తమలో కలవని వారంటే గుంపునకు ఎప్పుడూ అసహ్యమే కదా! అవకాశం దొరికినప్పుడల్లా ఆ అమ్మాయి పనిలో లేని తప్పులు వెతికి రమణమూర్తి దగ్గర ఆ అమ్మాయికి పనిరాదని నిరూపించేవాడు. ఈ టెక్నిక్ తన సీనియర్ రాజమల్లు దగ్గర ఒంట పట్టించుకున్నాడు.
ఒకరోజు ఆ అమ్మాయి అంతుచూడాలని.. “చైర్మన్ గారు గొప్పవారా? లెనిన్ గొప్పవాడా?” అని ప్రశ్నించాడు వినయ్.క్షణం కూడా ఆలోచించకుండా ఆ అమ్మాయి.. “లెనినే గొప్ప!” అన్నది.ఈ విషయం నేరుగా అప్పుడే నిద్రలోకి జారుకుంటున్న రమణమూర్తి డెస్కు మీద వాలింది. నిద్రమత్తు విదిలించుకుని కళ్లజోడు పెట్టుకుంటూ.. “అమ్మాయీ.. ‘చైర్మన్ సార్ కన్నా లెనిన్ గొప్ప!’ అన్నావా?” అని అడిగాడు రమణమూర్తి.“అవును!” అన్నది శ్రీవాణి.“మరైతే ఇక్కణ్నుంచి వెళ్లిపోమ్మా! ఉద్యోగం వేరేచోట చూసుకో పో! అన్నం పెట్టేవాణ్ని కాకుండా ఎక్కడో పుట్టిన పరదేశీయుణ్ని గొప్ప వాడంటావా! సిగ్గులేదూ?!” గట్టిగా అరిచాడు మూర్తి.వినయ్ లోపల్లోపల భలే నవ్వుకున్నాడు. ఆ అమ్మాయి ఏం మాట్లాకుండా కూర్చుంది.
“ఇంకా కుర్చున్నావేంటి అమ్మాయ్? రష్యాకెళ్లిపో ఇక్కడెందుకున్నావ్!? అయినా నీలాంటోళ్లను ఇంటర్వ్యూ చేసి తీసుకున్నందుకు నాకుండాలి బుద్ధి. పాపం.. పేదపిల్ల. బుద్ధిగా పని చేసుకుంటుందని ఉద్యోగం ఇస్తే.. చైర్మన్ సార్నే తక్కువచేసి మాట్లాడతావా?! వెళ్లు” అన్నాడు కోపంగా. ఇంటి పరిస్థితి, ఉద్యోగం అవసరం గుర్తుకొచ్చి, తనలోని విప్లవం పోయి.. ఏడుపు వచ్చింది శ్రీవాణికి.“సారీ సార్! నన్ను క్షమించండి”.. కన్నీళ్లు పెట్టుకుంది వాణి.“ఇప్పుడు చెప్పు.. ఎవరు గొప్ప?” అడిగాడు రమణమూర్తి.ఆ క్షణం ఉద్యోగదాత చైర్మన్ గారి ముందు.. ప్రపంచ కార్మిక సంక్షేమం కోసం పోరాడిన లెనిన్.. పరాయి దేశం వాడై ఓడిపోయాడు. ఆ సంఘటన తరువాత కామ్రేడ్ శ్రీవాణి.. ఉత్తి శ్రీవాణి అయింది. ‘ఇప్పుడు నేను చనిపోయాను గనుక.. నా పనికూడా శ్రీవాణే చేసి, రమణమూర్తి దగ్గర మంచి మార్కులు కొట్టేస్తుంది. కొన్నాళ్ల తర్వాత రమణమూర్తి గారు.. వినయ్ బాబు కన్నా నువ్వే చాలా నయం అమ్మాయ్! అని అన్నా అంటాడేమో!’.. ఈ ఆలోచన వినయ్ బాబు ఆత్మను మరింత అలజడికి గురిచేసింది.
సంస్థలో చేరి ఐడీ కార్డు మెడలో పడగానే ఎలాంటి వారినైనా సరే.. వారి సొంత భావాలను వదిలిపెట్టేలా చేసి, సంపూర్ణ ఉద్యోగిగా మార్చడమే అందులోని మేనేజర్ల పని. అవును.. నిరుద్యోగం తాండవిస్తున్న ఈ భారతావనిలో తమ ఆత్మాభిమానం, వ్యక్తిత్వం కోసం ఎంతమంది నిలబడగలరు!? ఈ స్వతంత్ర భారతంలో చైర్మన్ గారిలాంటి వారు బానిసత్వాన్ని చక్కగా సాగు చేస్తున్నారు. ఈ సంస్థలో ఉద్యోగుల ఎంపిక విధానం భలే చిత్రంగా ఉంటుంది. పళ్లు ఎన్నున్నాయి? కాళ్లు, చేతులు ఏమైనా విరిగాయా? కండపుష్టి ఎలా ఉంది? అని పరీక్షించి.. పూర్వం బానిసల్ని కొనేవాళ్లు చూడండి.. దాదాపు అలానే ఉంటుంది. ఈ సంస్థలో ఉద్యోగి ఎంపికలో ప్రధాన అంశాలు.. అతడు పేదవాడై ఉండాలి, అతనికి ఈ ఉద్యోగం అత్యవసరమై ఉండాలి, ఎంతో సున్నితస్తుడు, మంచివాడై ఉండాలి. స్పష్టంగా చెప్పాలంటే ఎన్ని ఇబ్బందులు ఎదురైనా చచ్చినట్టు ఇక్కడే పనిచేసే పరిస్థితిలో ఆ వ్యక్తి ఉండాలి. ఈ విధానమే చైర్మన్ గారి విజయ రహస్యం. పై పరీక్షలన్నీ పాసై పదేళ్లనుంచి సంస్థకు విశ్వాసంగా ఉన్నవాడే.. మన వినయ్ బాబు.
ఇంతలో ఉరుములాంటి శబ్దం విని తల పైకెత్తాడు ఎవరికీ కనిపించని బాబు. ఎలాంటి దిగులూ లేకుండా హాయిగా నిద్రపోతున్న భార్య రజిత కనిపించింది. భార్యను చూడగానే వినయ్‌కి ఎక్కడలేని కోపం వచ్చింది.
“వద్దే! మా మేనేజర్‌గారి ఇంట్లోనే చిన్న సైజ్ టీవీ ఉంది. మనకెందుకే ఇంత పెద్దది! అని ఎంత చెప్పినా వినకుండా నన్ను సతాయించి మరీ కొనిపించావ్ కదే! ఈ పలక టీవీ. ఇప్పుడు దానికి ఈఎంఐలు ఎలా కట్టాలి? నేను బతికుంటేనే కదా ఉద్యోగం చేయగలను, జీతం తీసుకోగలను, ఈఎంఐలు కట్టగలను” అని గట్టిగట్టిగా అరుస్తూ, నిట్టూర్పు విడిచాడు బాబు. ఇంతలో తన వెనకాల ఉన్న గూడులో వినయ్ బాబుకు కరెంటు బిల్లు కనిపించింది. తరువాత గ్యాస్ బిల్లు, ఇతరత్రా బిల్లులన్నీ వరసకట్టి వినయ్ ఆత్మ అంతరంగంలో మెదిలాయి. ఇంతలో భార్య పక్కనే ముడుచుకుని పడుకున్న కొడుకు కనిపించాడు. అంతే! గోడకానుకుని కూలిపోయి కూర్చుండి పోయాడు. ‘సార్!’ అంటూనే తనకు క్షవరం చేసే కొడుకు స్కూలు, దానికి కట్టాల్సిన ఫీజు గుర్తుకొచ్చింది మరి. ఈ దేశంలో బిల్లులు కట్టడానికి, ప్రభుత్వానికి పన్నులు కట్టడానికే బతికే చాలామందిలో ఒకడిలాంటోడే.. వినయ్. సమయం రెండు గంటలైంది. ఇంతలో వినయ్ బాబు ఆత్మకు ధర్మసందేహం బయలుదేరింది.
‘చచ్చి గంట దాటినా నన్ను స్వర్గానికో, నరకానికో ఎక్కడికో ఏదో ఓ చోటికి తీసుకెళ్లిపోవాలిగా!? అంటే అలాంటివేం లేవా? మరి ఎందుకని ఎవరూ నాకోసం రాలేదు?’ అని తనలో తాను మదనపడుతుండగా.. అచ్చం సినిమాల్లోలాగానే ఒక కిరణం వినయ్ బాబును చేరుకుంది. అంతే కళ్లు తెరిచి చూసేసరికి ఏదో ఒక కొత్త ప్రపంచంలో ఉన్నాడు. నూనెలో వేపుళ్లు, శూలదండనలు ఏమీ కనిపించలేదు. రాక్షసుల వంటి అందవికారమైన ఆకారాలు కూడాలేవు. కాబట్టి నరకమైతే కాదు. అంటే అది కచ్చితంగా స్వర్గమై ఉండాలన్న నిర్ణయానికి వచ్చాడు. చిన్నప్పుడు వినయ్ బాబుకు స్వర్గం గురించి తన అవ్వ చెప్పినట్టు.. పాల సెలయేర్లు, వెన్నకొండలు గట్రాలాంటివి ఏమీ కనిపించలేదు గానీ, పచ్చని కొండలు, జలపాతాలు, అక్కడక్కడా అందమైన కట్టడాలు, సువాసన నిచ్చే గాలులతో ఓ మంచి విహారయాత్రా స్థలంలానే ఉంది. అక్కడక్కడా ఉన్న మనుషుల ముందు అందమైన అమ్మాయిలైతే నాట్యం చేస్తున్నారు. ‘అప్సరసలు అయ్యుంటారు!’ అనుకున్నాడు. కనిపించిన మనుషులందరూ తాగి తూగుతూ ఆనందంగా గడుపుతున్నారు. వాళ్లను చూసి ‘ఛీ తాగుబోతు వెధవలు’ అని మనసులోనే తిట్టుకున్నాడు వినయ్ బాబు. ఇంకా చిత్రచిత్రమైన జీవరాశులు ఎన్నో ఉన్నాయి. వాటిలో కొన్ని తను భూమ్మీద చూడను కూడా చూడలేదు. ‘బహుశా గ్రహాంతర జీవులై ఉంటాయి’ అనుకున్నాడు. చూడటానికి ఆహ్లాదంగా ఉన్నా ఆ వాతావరణం అంతా వినయ్ బాబుకు గందరగోళంగా అనిపిస్తున్నది. పండ్ల చెట్లు చాలా ఉన్నాయి. ఒక మామిడిపండు తెంచుకుని తిందామనుకున్నాడు. ఇంతలో ఓ సారి ఇలానే ఆఫీసులో తను మామిడిపండు తెంపడం చూసిన రాజమల్లు.. రమణమూర్తికి చెప్పి చీవాట్లు పెట్టించిన విషయం గుర్తుకువచ్చి ఆగిపోయాడు.
అంతలోనే తన భుజం మీద ఎవరో వెనక నుంచి చెయ్యి వేశారు. తిరిగి చూస్తే ఓ అందమైన అమ్మాయి. తన చేతిని వినయ్ బాబు ముఖం మీద వేసి సుతారంగా నిమురుతున్నది. వినయ్ ఉక్కిరి బిక్కిరై పోతున్నాడు. కౌగిలించుకోబోయింది. వెంటనే ఆ అమ్మాయిని విదిలించుకుని.. “పాపిష్ఠిదానా! నేను పద్ధతిగల కుటుంబం నుంచి వచ్చాను ఏమనుకున్నావో. నేను నీలా బరితెగించలేదు. ఇంకోసారి ఇలా ప్రవర్తించావంటే.. మీ పై ఆఫీసర్‌కి చెప్పి నిన్ను ఉద్యోగంలోంచి పీకేయిస్తా ఏమనుకున్నావో” అని గద్దించాడు. ఆ మాటలకు ఆ అప్సరస నోరు పెగలక బెదిరిపోయి నిలుచుని..
“సురాపానం!” అని గ్లాసు అందించబోయింది.“ఏం! నన్ను తాగుబోతు వెధవ అనుకున్నావా!? ఈ విషయం గనుక మా హెడ్‌కు తెలిస్తే నా సంగతంతే.. వెళ్లు వెళ్లమ్మా మహాతల్లి!” అని కసురుకున్నాడు. వెంటనే ఆ అమ్మాయి అక్కడినుంచి పారిపోయింది. చుట్టూ అంత ఆనందం ఉన్నా వినయ్ బాబుకు మాత్రం మనసు నిండా దిగులు నిండుకుంది. ఇంతలో కాస్త దూరంలో ఉన్న లోయ, దాని గట్టునే ఓ చెట్టు కనిపించింది. అక్కడికి వెళ్లి దానికింద ఒంటరిగా కూర్చున్నాడు. తనకు ఏడుపు పొంగుకొస్తున్నది. కుటుంబం, ఉద్యోగం తప్ప వినయ్ బాబుకు వేరే లోకం తెలీదు. తను ఉద్యోగంలో చేరిన రెండు సంవత్సరాలకే విసుగెత్తి ఊరు వెళ్లిపోవాలనుకున్నాడు. కానీ, తన సీనియర్లు ఇక్కడినుంచి వెళ్లిన వాళ్లు బయటెక్కడా బతకలేరని భయపెట్టేవాళ్లు. సంస్థ నుంచి వెళ్లి ఉద్యోగాలు దొరక్క ఇబ్బందులు పడుతున్న వాళ్లను, ఆత్మహత్య చేసుకున్న వాళ్లను ఉదాహరణగా చూపించేవాళ్లు. సంవత్సరాలు గడిచేకొద్దీ ఆ సంస్థకు, భయపెట్టే ఆ వ్యవస్థకు.. చచ్చినా తను వేరే లోకంలో బతకలేనంతగా అలవాటు పడిపోయాడు. తనకు అర్థం కానీ, అలవాటులేని ఈ ప్రపంచం స్వర్గమే అయినా.. తనకు అక్కరలేదని అనిపిస్తున్నది. తల పైకెత్తి దూరంగా ఆకాశంలోకి చూశాడు. గిరగిరా తిరుగుతూ నీలిరంగులో భూగోళం వినయ్ బాబు కంటపడింది. పట్టరాని ఆనందంతో బుగ్గల మీద కారిన కన్నీళ్లు తుడుచుకున్నాడు. కానీ, అది చాలా దూరంగా ఉంది.
‘కాస్త దగ్గరగా అయినా లేదు. ఉండుంటే దూకి ఎలాగైనా ఇంటికి చేరుకుని.. ఈ రోజే ఈ నెల టీవీ ఈఎంఐ కట్టేద్దును. లేదంటే రేపటికి ఫైన్ పడుతుంది. నా భార్యకు కోరికలు కోరడమే తప్ప.. ఇలాంటి విషయాలు అస్సలు తెలీవు. నేను లేకుండా ఎలా బతుకీడుస్తుందో ఏమో!?’ అనుకున్నాడు. ఆ ఆలోచనలతో తనకు పిచ్చి పట్టినట్టు అవుతున్నది. వినయ్ బాబు ఆత్మకు.. ఆత్మహత్య చేసుకోవాలనే ఆశ కలిగింది. గట్టు మీదినుంచి లోయలోకి దూకాలని రెండు మూడు సార్లు ప్రయత్నించి, ధైర్యం చాలక భయపడి వెనక్కి వచ్చాడు. స్వర్గంలో ఆ చెట్టుకింద చిరాకు పడుతూ కూర్చున్నాడు.
“ఏంటీ.. ఆత్మహత్య చేసుకోడానికి ధైర్యం చాల్లేదు కదూ!”.. వినయ్ బాబుకు ఓ గొంతు వినిపించింది.“అలా ఏంలేదు! లోతెంతుందో చూడటానికే చివరికి వెళ్లాను. అయినా దాక్కుని మాట్లాడుతున్నావ్.. నువ్వెవరూ?” అడిగాడు.“నా గురించి ఎందుకులే గానీ.. అందరూ అక్కడ హాయిగా ఆడుతూ పాడుతూ ఆనందంగా ఉంటే, నువ్వు ఇక్కడ ఒంటరిగా కూర్చున్నావు ఎందుకు?”. “నాకు ఈ లోకం నచ్చలేదు. ఇక్కడినుంచి వెళ్లడానికి నువ్వు సాయం చేయగలవా?”.. క్షణం వ్యవధి ఇవ్వకుండా సమాధానం చెప్పాడు వినయ్ బాబు. “తప్పకుండా! అయినా ఈ లోకానికేమైంది. ఇక్కడ నీకు నచ్చినట్టు ఉండొచ్చు. అందమైన, ఆహ్లాదకరమైన వాతావరణం. సమానత్వం, గౌరవం, హద్దులే లేని ఆనందం.. ఇంతకన్నా నీకు ఏం కావాలి? ఇక్కడ నువ్వు ఎవరికీ విశ్వాసం చూపించాల్సిన అవసరం ఉండదు. నీకు పూర్తి స్వేచ్ఛ దొరుకుతుంది” అని ఆ గొంతు చెప్పింది. “నాకు నువ్వు చెప్పినవేవీ వద్దు! అయినా స్వేచ్ఛ నేనేం చేసుకోను..” కోపంగా అన్నాడు వినయ్ బాబు.
కొన్ని క్షణాల నిశబ్దం తరువాత..“నిజమే! సొంత నిర్ణయాలు తీసుకోలేని వాడికి స్వేచ్ఛ భారంగా, బానిసత్వం కన్నా దారుణంగానే ఉంటుంది. కానీ, దాని విలువ, అది ఇచ్చే ఆనందం అర్థమైతే.. నువ్వు ఇక్కడినుంచి వెళ్లమన్నా వెళ్లవు. ఒక్కసారి ఆలోచించుకో! మొదట్లో మీ మనుషులందరూ ఇలానే అన్నారు. తరువాత అలవాటు చేసుకుని ఇక్కడే ఆనందంగా ఉంటున్నారు” అన్నది ఆ గొంతు.“నాకు అర్థంకాని విషయాలను చెప్పి నన్ను ఇబ్బంది పెట్టకు. దయచేసి నేను అడిగేది మాత్రం నాకు ఇవ్వు” బతిమిలాడాడు వినయ్ బాబు.“నేను సాయం చేస్తానని మాటిచ్చానుగా.. సరే మరి. నీకేంకావాలో చెప్పు”. “నాకు నా పాత జీవితం కావాలి!” అడిగాడు వినయ్ బాబు. ఆ గొంతు.. “తథాస్తు!” అన్నది.
వినయ్ బాబు ఆత్మ తిరిగి తన శరీరంలోకి చేరుకుంది. “ఆఫీసుకు టైమయ్యింది! లేవండి..” అని భార్య పిలిచిన పిలుపునకు ఉలిక్కిపడి లేచాడు.సమయం 7.30 అయ్యింది. ఈ రోజు అరగంట ఆలస్యంగా నిద్రలేచాడు. వినయ్ బాబుకు రాత్రి జరిగిందేదీ గుర్తులేదు. చకచకా ఆఫీసుకు తయారయ్యాడు. క్యారేజీ సంచి చేతిలో పట్టుకుని బస్టాండ్‌కు పరుగుతీశాడు. అప్పటికే తన ఆఫీసు బస్సు వెళ్లిపోయింది. సిటీ సర్వీస్ బస్సులో ఎక్కి కూర్చున్నాడు. మనసు మొత్తం భయంతో నిండుకుంది. ఈమధ్య కాలంలో ఒక్కరోజు కూడా తను ఆఫీసుకు ఆలస్యంగా వెళ్లలేదు. ఈ రోజు ఆలస్యం అయితే మూర్తిగారికి ఏం కారణం చెబితే బాగుండునని ఆలోచిస్తూ కూర్చున్నాడు. తరువాత కారణాలు ఎన్ని చెప్పినా తిట్లయితే తప్పేవి కాదనిపించింది. ఈ రోజు శ్రీవాణి ముందు తన పరువుపోవడం ఖాయం అనుకున్నాడు. ‘అయినా ఎందుకింత బండ నిద్రపోయాను.. నాకు కావాల్సిందేలే!’ అని తనను తాను తిట్టుకున్నాడు. ఆలోచనల్లో ఉండగానే దిగాల్సిన స్టాప్ వచ్చింది. వాచీ చూసుకున్నాడు. సమయం 8.26.. ఇక వేలిముద్ర వేయడానికి నాలుగు నిమిషాలే ఉంది. ఆఫీసుగేటు దగ్గరికి వెళ్లాలంటే ఇంకా రెండువందల మీటర్ల దాకా నడవాలి. పరుగు మొదలెట్టాడు. గేటు దగ్గరికి చేరేసరికి సమయం.. 8.28! గేటు దగ్గర సెక్యూరిటీ వాడికి తన ఐడీ కార్డు చూపించి, తన సంచిలో క్యారేజీ తప్ప మారణాయుధాలేవీ లేవని నిరూపించుకుని లోపలికి రావడానికి కనీసం ఒకటిన్నర నిమిషం పట్టింది. ఆగమేఘాల మీద వేలిముద్ర తీసుకునే మిషిన్ దగ్గరికి చేరుకున్నాడు. క్యూలో ఇద్దరి వెనుక నిలుచుకున్నాడు. ఇంకా ఇరవై సెకన్లు మాత్రమే ఉన్నాయి. ఎదురు ఉన్న వాళ్లలో మొదటి వ్యక్తి తన పని పూర్తిచేసుకుని వెళ్లాడు. వినయ్ బాబు ముందు ఉన్న వ్యక్తి వేలిముద్రను మిషిన్ తీసుకోవడం లేదు. వినయ్ బాబుకు గుండె గుభేలుమన్నట్టయింది. ఇంకా నాలుగు సెకన్లే ఉన్నాయి. ఎదుటి వ్యక్తి వేలిముద్రను స్వీకరిస్తూ.. ఆ మిషిన్ ‘బీప్’ అంటూ శబ్దం చేసింది. చివరి సెకన్ పూర్తయ్యేలోపు.. వినయ్ బాబు తన హాజరు వేసుకున్నాడు. వినయ్ బాబు.. విజయం సాధించాడు. ఆ విజయ గర్వంతో చెక్కిళ్లను వెడల్పు చేసుకుని చిన్నగా నవ్వాడు. ముఖానికి పట్టిన చెమటను చేతిగుడ్డతో తుడుచుకున్నాడు. గుండెల నిండా గాలి పీల్చి.. ఛాతీని మరింత విచ్చుకునేలా చేసి, హుందాగా ఆఫీసులో తన డెస్కు వైపు అడుగులు వేశాడు వినయ్ బాబు.
వై.ఎల్.వి. ప్రసాద్
వై.ఎల్.వి. ప్రసాద్ స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా యాడికి గ్రామం. ఎమ్మెస్సీ ఎలక్ట్రానిక్స్ చేశారు. 2018లో చదువు పూర్తయ్యాక, ‘విపుల’ పత్రికలో సబ్ ఎడిటర్‌గా రెండేండ్లపాటు పనిచేశారు. చిన్నతనం నుంచే పుస్తకాలు చదివే అలవాటు ఉన్న ప్రసాద్.. క్రమంగా రచనల వైపు మళ్లారు. ‘నేనెందుకు ఏడ్వాలి?’, ‘ఏటీఎం’, ‘తొండచెప్పే ప్రేమ కథ’.. విపుల, తెలుగు వెలుగు పత్రికలలో ప్రచురితం అయ్యాయి. ‘హంతకి’ కథ ఈనాడు ఎఫ్ఎంలో ప్రసారమైంది. ‘ఇది రాక్షసుడు రావాల్సిన సమయం’, ‘అసమర్థుడు’ పేర్లతో తెలుగు వెలుగు పత్రికలలో రెండు గల్పికలు ప్రచురితం అయ్యాయి.
-వై.ఎల్.వి. ప్రసాద్