రేంజ్ రోవర్, రోల్స్ రాయిస్, పోర్షె, వోల్వో, బెంజ్… భూమ్మీద ఖరీదైనవిగా పేరున్న కార్లన్నీ వరుస కట్టి ఉన్నాయి. గుచ్చి, ప్రాదా, వసాచె, డియో, లూయీస్ విట్టన్, కార్టియర్… ప్రపంచ ప్రసిద్ధి చెందిన లగ్జరీ బ్రాండ్ల దుకాణాలన్నీ ఒకదాని పక్కన మరొకటి నిలుచున్నాయి. ఈ రెంటికీ వేదిక, ఇటలీలోని ‘వయా మాంటె నెపోలియోనె’ వీధి. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వీధిగా ఇటీవల రికార్డు సాధించింది. అక్కడ ఒక్క గజానికి ఏడాది అద్దె రూ.18 లక్షలకు పైచిలుకే మరి!
అబ్బో అది చాలా కాస్ట్లీ ఏరియా… అని ఓ ప్రాంతాన్ని చెప్పుకోవడం పరిపాటే. నివాస స్థలాలకన్నా, వాణిజ్య కేంద్రాల్లో భూమి ధరలు అధికంగా ఉండటం తెలిసిందే. అయితే అవి ఉన్న చోటు, అక్కడికి వచ్చే వాళ్ల వెయిటును బట్టి అక్కడి నిర్మాణాల రేటు ఆధారపడుతుంది. అచ్చంగా ఇదే సూత్రం వర్తించింది మిలాన్‌లోని ‘వరల్డ్స్ కాస్ట్లీయెస్ట్ స్ట్రీట్’ విషయంలో! వయా మాంటె నెపోలియోనెగా పిలిచే ఇది 350 మీటర్ల పొడవైన ఓ వీధి. ముఖ్యంగా ఒక షాపింగ్ స్ట్రీట్. దుస్తులు, నగలు, యాక్సెసరీలకు సంబంధించిన లగ్జరీ బ్రాండ్ల దుకాణాలు ఉంటాయక్కడ.
ప్రపంచంలోనే సంపన్నులైన చాలామంది షాపింగ్ చేసేందుకు ఇక్కడికి వస్తుంటారు. అక్కడ సగటు బిల్లు రూ.2,25,000 పైచిలుకే. అంటే ఒకరు ఎక్కువ కొన్నా, ఒకరు కాస్త తక్కువ కొన్నా మొత్తంగా చూసుకుంటే ఒక్కొక్క బిల్లూ 2 లక్షల రూపాయలపైనే కడతారన్నమాట ఇక్కడ షాపింగ్ చేసిన వాళ్లు. బిల్లుల్లో ఇదే ప్రపంచంలోనే అతి ఎక్కువ సగటు. అమెరికా స్థిరాస్తి సంస్థ కుష్మన్ అండ్ వేక్ ఫీల్డ్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన షాపింగ్ ఏరియాల జాబితాను ఏటా విడుదల చేస్తుంది. ఈ ఏడాది 138 స్థలాలు ఉండగా అందులో ఇటలీలోని ఈ వీధి తొలి స్థానంలో నిలిచింది.
వయా మాంటె నెపోలియన్ వీధిలో ఇటీవల జరిగిన ఓ కొనుగోలు కూడా ప్రపంచ రియల్ ఎస్టేట్‌లో చర్చకు వచ్చింది. గతేడాది ఇక్కడ ఓ భవంతిని బ్లాక్‌స్టోన్ కంపెనీ నుంచి గుచ్చి మాతృ సంస్థ కొనుక్కుంది. దాని ఖరీదు 12 వేల 40 కోట్ల రూపాయలు. ఈ వీధిలో ఒక చదరపు గజం చోటుకు అద్దె లెక్కగడితే, మన లెక్కలో అయితే సుమారు ఓ చదరపు గజం స్థలానికి ఏడాదికి 18 లక్షలు చెల్లిస్తున్నారు.
ప్రపంచంలోనే విలాసవంతమైన బ్రాండ్లకు పేరెన్నికగన్న ఈ వీధిని చూసేందుకు ఎక్కువగా జనం వచ్చినా, ఇక్కడ కొనేవారూ ఆ రేంజ్‌లోనే ఉంటారట. మిలాన్ నగరంలో జరిగే ఫ్యాషన్ వీక్ (దుస్తులు), డిజైన్ వీక్ (ఇంటీరియర్ వస్తువులు)లకు వివిధ దేశాల నుంచి పెద్ద సంఖ్యలో సంపన్నులను ఆకర్షిస్తుంటాయి. అంతేకాదు, ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఇక్కడ ట్యాక్సులు తక్కువగా ఉండటం వల్ల కోటీశ్వరులు ఇక్కడ శాశ్వత నివాసాలూ ఏర్పరచుకుంటున్నారట.
ఇక, మరింత విస్తరించేందుకు వీలు లేకుండా తక్కువ స్థలం ఉండటం, భవంతులను అమ్మేవారు లేకపోవడం లాంటివీ ఈ వీధిని ఖరీదైనదిగా మార్చేశాయి. డాలర్‌తో పోల్చుకుంటే ఐరోపా కరెన్సీ యూరో బలపడటమూ ఇది టాప్‌లో ఉండటానికి కారణం. న్యూయార్క్‌లోని అప్పర్ ఫిఫ్త్ ఎవెన్యూ అన్నది ఇప్పటిదాకా ఖరీదైన వీధుల్లో నెంబర్ వన్‌గా ఉంది. 34 ఏండ్ల తర్వాత తొలిసారి ఒక ఐరోపా దేశపు వీధి ఖరీదైనదిగా పేరు పొందడానికి, గడచిన రెండేండ్లలోనే 30 శాతానికిపైగా పెరిగిన అద్దెలూ కారణమేనట. ఇదండీ సంగతి, ఆకాశాన్నంటే ధరలకు అడ్రెస్ కావాలంటే ఇక మిలాన్ ముచ్చట చెప్పాలేమో!