చింతలేని మనిషి, చింత చెట్టు లేని ఊరు ఉండదు. గూగుల్ మ్యాప్ లేని రోజుల్లో చింతల తోపు, చింత చెట్టే చిరునామాలు. ఆ చింత చెట్ల కింద కూర్చుని చేసే ముచ్చట్లలో చింతలెన్నో చెప్పుకొనేవారు జనాలు. నిజానికి పేరులో ‘చింత’ ఉన్నా చింతలెన్నో తీర్చే చెట్టు ఇది. మా ఇంట్లో పెద్ద చింతచెట్టు ఉంది. ఆ చింతకొమ్మలు పెట్టుకుని ఉయ్యాల ఊగేవాళ్లం. చింతకాయలకు ఉప్పద్దుకుని తింటూ బడికి పోయేవాళ్లం. నాన్న (పూర్వ ప్రధాని పీవీ నరసింహారావు) గారికి చింతపండు తొక్కు ఎంతో ఇష్టమైన వంటకం. ఎర్రని మిరపపండుతో చింతకాయను కలిపి దంచితే చింతకాయ తొక్కు తయారవుతుంది.
ఇది తెలంగాణ ప్రత్యేక వంటకం. వృక్ష శాస్త్రంలో చింతచెట్టుని ‘టామరిండస్ ఇండికా’ అని పిలుస్తారు. ఈ పదం తమర్-ఐ-హింద్ అనే పర్షియా పదం నుంచి వచ్చింది. దీనికి అర్ధం ‘డేట్ ఆఫ్ ఇండియా’ అని. దీని పండ్లు ఖర్జూరపు పండ్లను పోలి ఉంటాయి కాబట్టి ఇలా పిలిచారన్నమాట. ఆసియా ప్రాంతంలో ఉండే చింతకాయలు పొడవుగా అంటే 6 నుంచి 12 గింజలతో ఉంటే, ఆఫ్రికా జాతికి చెందినవి కాస్త పొట్టిగా 1 నుంచి 6 గింజలతో కాస్తాయి. ఈ చెట్టు సగటున 200 సంవత్సరాలు బతుకుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ చెట్లు పెరుగుతాయి. గింజలు తీసిన చింతపండుని వంటల్లో వాడతారు.
అదొక్కటే కాదు… చింత చిగురు, చింతపువ్వు, లేత చింతకాయలు, కండపట్టిన పచ్చి చింతకాయలనూ అనేక రకాల ఆహార పదార్థాల తయారీకి ఉపయోగిస్తున్నారు. చింత వేర్లు, ఆకులు, పండ్లు, గింజలు, బెరడులన్నింటినీ ఔషధాల తయారీలో ఉపయోగిస్తారు. పురుగు మందులు, విషంలాంటివి తాగిన వారికి విరుగుడుగా గ్రామాల్లో చింతపండు రసాన్ని పోస్తారు. చింతపండు జీర్ణశక్తిని పెంచుతుంది. కడుపు ఉబ్బరం, పచ్చ కామెర్లు, మశూచి రోగ చికిత్సలోనూ ఉపయోగపడుతున్నది. చికెన్ పాక్స్ వచ్చిన వారికి మచ్చలు తగ్గేందుకని ఒంటినిండా చింతపండు పులిమి స్నానం చేయిస్తుంటారు. చింతపండు ఆకలిని పుట్టిస్తుంది. పీవీ ఔషధ వనంలో నాలుగు చింతచెట్లు ఉన్నాయి.
-ఎమ్మెల్సీ సురభి వాణీదేవి, పీవీ కూతురు