అనగనగా ఓ తెగ. అందులోని వాళ్లకు నీళ్లంటే అస్సలు భయం లేదు. ఆక్సిజన్ సిలిండర్ లేకుండానే సముద్రపు అట్టడుగులు చూడగలరు. లోతైన ప్రాంతాల్లోని ముత్యాలను ఒక్క దుంకులో తీసుకురాగలరు. తోపు స్విమ్మర్లకన్నా నాలుగు అయిదు రెట్లు ఎక్కువసేపు ఇక్కడి సాధారణ వ్యక్తులూ నీళ్లలో గడపగలరు. వీళ్ల ఇళ్లూ నీళ్ల మీదే. తిండీ నిద్రా అంతా సాగరం పైనే. అక్కడి పిల్లలకు నడకకన్నా ఈతే బాగా వచ్చు. ఏదో సినిమా కథలా ఉన్నా… ఇదంతా అచ్చంగా నిజం. బజావు అని పిలిచే ఒక రకం తెగది నీళ్లతో ఆర్డినరీ అనుబంధం కాదు మరి!
Bajau Tribe | ‘ఈత నువ్వు నేర్చుకుంటే వచ్చిందేమో… నాకు బ్లడ్‌లోనే ఉందీ…’ అంటూ బాలయ్య బాబు తరహాలో డైలాగ్ చెప్పొచ్చు బజావు ప్రజలు. నిజంగానే వాళ్ల అవయవాలు, జన్యువులు నీటిలో బతకడానికి అనువుగా ఎన్నో మార్పులు చెందాయి. రక్తాన్ని నిల్వ చేసే ప్లీహం (స్లీన్) వీళ్లలో పెద్దదిగా ఉంటుంది. కళ్ల నుంచి మెదడు దాకా అవయవాలన్నీ అవసరాలకు తగ్గట్టు పనితీరును మార్చుకున్నాయి. ఇలాంటి మరిన్ని సంగతులు తెలుసుకునే ముందు అసలు వీళ్లు ఎక్కడుంటారో చూద్దాం. ఆగ్నేయ ఆసియాలోని మలేషియా, ఫిలిప్పీన్స్, ఇండోనేషియా, థాయ్‌లాండ్ దేశాల్లోని సముద్ర ప్రాంతంలో వీళ్లు నివసిస్తారు.
బజావు తెగ వారిని సమా-బజావులనీ అంటారు. సముద్రంపై కర్రల సాయంతో పడవల్ని నిలబెట్టి దాని ఆధారంగా ఇళ్లు నిర్మించుకుంటారు. లాన్సా హౌస్ బోట్లుగా వీటిని పిలుస్తారు. వందల ఇండ్లను ఒకేచోట నిర్మించుకుంటారు. ఈ కాలనీలో ఒక ఇంటి నుంచి మరో ఇంటికి చిన్న చిన్న బ్రిడ్జిలాంటి నిర్మాణాలుంటాయి. కొన్నిసార్లు విడివిడిగానూ ఈ ఇండ్లు ఉంటాయి. బోటులో వచ్చి ఇంటిని చేరేందుకు నిచ్చెనలాంటి నిర్మాణాలూ ఉంటాయి. వీళ్లు అరుదుగానే నేల మీదకు వస్తారు. కాలాన్ని బట్టి సముద్రం మీదే ఒక్కోచోటికి మకాం మారుస్తుంటారు. అందుకే వీళ్లని ‘సీ నొమాడ్స్’ (సముద్రపు సంచారులు), ‘సీ జిప్సీ’లుగా పిలుస్తారు. చేపలు, ఇతర సముద్ర జంతువుల వేట వీళ్ల ప్రధాన వృత్తి. సాంస్కృతికంగా వీళ్లకు వెయ్యేళ్లకు పైగా చరిత్ర ఉంది. తరాల నుంచీ సముద్రంలోని లోతైన ప్రాంతాల్లో చేపలు పట్టడం, నీటి అడుగులకు వెళ్లి ముత్యాలను తీసుకురావడంలాంటి పనులు చేసేవారు. దీంతో నీళ్లలో బతికేందుకు కావలసిన శారీరక, జన్యుపరమైన మార్పులు వీరిలో చోటు చేసుకున్నాయి. వీళ్లు ఇప్పటికీ రోజులో ఎనిమిది గంటలు సముద్రం అడుగునే గడుపుతారంటే నీళ్లతో వాళ్ల అనుబంధం ఎంతటిదో అర్థం చేసుకోవచ్చు.
మామూలు మనుషులకు కష్టసాధ్యమైన ఎన్నో పనులు బజావు తెగ ప్రజలు చేయగలరు. వీళ్లు సముద్రంలో 200 అడుగులకు పైగా లోతుకు ఆక్సిజన్ సిలిండర్కానీ, కాళ్ల తొడుగులు కానీ లేకుండానే వెళ్లిపోగలరు. అంతేకాదు, అక్కడ దాదాపు 13 నిమిషాల పాటు అటూ ఇటూ తిరగగలరు కూడా. సీ కుకుంబర్లుగా పిలిచే జీవులు… పందిరి దోసకాయల ఆకృతిలో సముద్రపు నేల మీద ఉంటాయి. స్వయంగా వెళ్లి వాటిని ఆహారం కోసం తెచ్చుకుంటారు. అంతేకాదు, ఆల్చిప్పలతో పాటు రకరకాల సముద్ర జీవుల్ని పట్టి తెస్తుంటారు. ఇలా తరాల నుంచీ సముద్రపు అడుగున గడపడం వల్ల ఈ జాతి ప్రజల్లో ప్లీహం పెద్దదిగా మారింది. సాధారణంగా ప్లీహం ఎర్ర రక్త కణాలను ఉత్పత్తి చేయడం, సరఫరా చేయడం, నిల్వ చేయడంలాంటి పనుల్ని చేస్తుంది. మనం ఏదైనా షాక్‌కి గురైనప్పుడు శ్వాస తీసుకోవడం ఆపేస్తాం. ఆ సమయంలో శరీరంలోని అవయవాలకు ఆక్సిజన్‌ను అందించేలా ఈ ఎర్ర రక్తకణాలను సరఫరా చేస్తుంది.
నీళ్లలోకి వెళ్లినప్పుడు శ్వాస తీసుకోం కాబట్టి దీని అవసరం ఎక్కువ ఉంటుంది. అందుకే ఈ తెగ ప్రజల్లో ప్లీహం పెద్దదిగా ఉంటుంది. అచ్చం నీళ్లలోనూ బయటా తిరిగే సీల్స్‌లో మాదిరిగానే ఇది పరిణామం చెందిందని చెబుతారు సైంటిస్టులు. కాబట్టి, మామూలు వాళ్లలో కన్నా ఎక్కువ మోతాదులో ఎర్ర రక్తకణాలను ఇది ఉత్పత్తి చేస్తుంది. కండరాల్లో ఆక్సిజన్‌ను నిల్వ ఉంచే మయోగ్లోబిన్ అనే ప్రొటీన్ వీళ్లలో అధికంగా ఉంటుంది. నీటి ఒత్తిడిని, చల్లదనాన్ని తట్టుకునేలా చర్మం మందంగా ఉంటుంది. నీళ్లలోనూ చూడగలిగేలా కళ్లు పదునుదేరితే, ఊపిరితిత్తులు శ్వాసను బంధించడంలో మరింత బలంగా తయారయ్యాయట. అంతేకాదు, నీళ్లలోకి వెళ్లినప్పుడు వీళ్ల గుండెకొట్టుకునే వేగం గణనీయంగా తగ్గుతుంది. తద్వారా ప్రాణవాయువు నెమ్మదిగా ఖర్చవుతుంది. మెదడు, కండరాలు కూడా ఆక్సిజన్‌ను అత్యంత సమర్థంగా వినియోగించుకునేలా పనిచేస్తాయి. మొత్తంగా చెప్పాలంటే, వీళ్ల శరీరం సముద్ర జీవనానికి తగ్గట్టు అనేక పరిణామాలు చెందింది. క్లిష్టమైన వాతావరణ పరిస్థితులను తట్టుకుంటూ మనిషి ఎలా మనుగడ సాగించగలడు అన్నదానికి చక్కని నిదర్శనం ఈ తెగ మనుషులు.