సినారె మార్గం, కవిత్వం, ప్రయాణమంతా ప్రగతిశీల మానవతా వాదం. విద్యార్థి దశ నుంచి చివరి వరకు తను నమ్మిన విలువలకు కట్టుబడి కలాన్ని నడిపిన మహాకవి ఆయన. తొలినాళ్లలోనే ‘విజయంబు సాధించినావా విద్యార్థి/ నీ వీర భావాలు నింగి వ్యాపించగా’, ‘మారాలి మారాలిరా/ కరడుగట్టిన నేటి/ కరకు సంఘపు/ రంగు మారాలి మారాలి మారాలిరా’ అని రాశారు. విప్లవోద్యమాల పట్ల ‘తమ్మునితో గొంతు కలపకున్నా దమ్మును మాత్రం మెచ్చుకుంటున్న’ అన్న ఆయన సమన్వయ దృక్పథాన్ని తన కవితా పథంగా చేసుకున్నారు. సినారె గజల్ రాసినా, గీతం కూర్చినా, కవిత చెప్పినా అందులో మానవీయత, ప్రగతిశీలత, సమసమాజ ఆశయ అనుకూలతలు ప్రత్యక్షరంగా కనిపిస్తాయి.
‘వందేమాతరం’ చిత్రం కోసం సినారె రాసిన గీతం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ గీతం గురించి ఆయన చెబుతూ “వందేమాతరం’ గీతంలో బంకించంద్ర చిత్రించిన ఆ దేశపటం స్వార్థశక్తుల దుశ్చర్యల వల్ల ఏ రకంగా వికృతమై పోయిందో. 1985కు కొన్నేళ్ల ముందుగానే నేను గీత రూపంలో చిత్రించాను. బంకించంద్ర గీతాన్ని యథాతథంగా స్వీకరిస్తూనే.. తరం మారుతున్న కొద్దీ ఆ స్వరం ఎలా మూరుతున్నదో, ఆ శబ్దాల వరుస ఎలా మారుతున్నదో ఈ గీతంలో వివరించాను’ అని పేర్కొన్నారు. అంతేకాదు, ‘ప్రజా నాట్య మండలి స్వరపరిచిన ఈ గీతాన్ని శ్రీనివాస్ అనే యువకుడు అనేక సభల్లో పాడి జనామోదం అందుకున్నాడు’ అంటూ ప్రశంసించారు కూడా. ‘వందేమాతరం’ గీతం అన్నికాలాలకు, పరిస్థితులకు అన్వయం అవుతుంది.
పల్లవి: వందేమాతరం వందే మాతరం ॥2॥
వందేమాతర గీతం వరస మారుతున్నది ॥2॥
తరం మారుతున్నది ఆ స్వరం మారుతున్నది ॥2॥
బంకించంద్ర చటర్జీ ‘ఆనంద్ మఠ్’లోని ఈ ‘వందేమారతం’ గీతం భారత జాతీయోద్యమ సమయంలో యావత్ జాతినీ ఏకతాటిపైకి తీసుకువచ్చింది. భారతమాత దాస్య శృంఖలాల విముక్తి పోరాటంలో ప్రధాన నినాదమై నిలిచింది. స్వాతంత్య్రం సిద్ధించిన ఐదు దశాబ్దాల తరువాతి పరిస్థితికి కలత చెందిన సినారె అదే గీతంలోని పల్లవి, ఇతర పంక్తులలోని భాగాలను
తీసుకుని నేటి పరిస్థితికి అన్వయిస్తూ రాసిన గీతమిది. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలి, సినారె ఈ సినిమా కోసం గీతాన్ని రాయడానికి ముందే దీని
పల్లవిని కూర్చుకున్నారు.
చరణం 1
సుజల విమల కీర్తనలో సుఫలాశయ వర్తనలో
జలం లేక బలం లేక జనం ఎండుతున్నది
మలయజ శీతల పదకోమల భావన బాగున్నా..
కంటి కంటిలో తెలియని మంట రగులుతున్నది
మంట రగులుతున్నది..
తరం మారుతున్నది ఆ స్వరం మారుతున్నది
పై చరణంలో ‘సుజలాం, సుఫలాం, మలయజ శీతలాం సస్యశ్యామలాం మాతరం వందేమాతరం’ అన్న పంక్తులను ప్రస్తావిస్తూ తన భావనను వెలిబుచ్చారు కవి. బకించంద్ర నిర్మల జలాల గురించి కీర్తిస్తే, సమకాలీన పరిస్థితులను వాఖ్యానిస్తూ సినారె అందుకు భిన్నంగా కనిపిస్తున్న చిత్రాలను అక్షర చిత్రాలుగా చూపిస్తారు. దేశ ప్రజలు నీళ్లు లేక, ఫలం లేక ఎండిపోతున్నారని చెబుతారు. కేవలం భానవలు, ఆలోచనలే కాదు ఆచరణలో అవి అమలుకావాలన్న విషయాన్ని మరింత విఫులంగా చెబుతూ ‘మలయజ శీతల కోమల భావన బాగున్నా’ ప్రతివారి కంటిలో ఏదో తెలియని మంట రగులుతుందని ఖుల్లంఖుల్లాగా చెబుతారు.
నారాయణరెడ్డి 1947కు ముందునాటి నిజాం రాజ్యంలో పుట్టి పెరిగారు. అటు తరువాత హైదరాబాద్ రాష్ర్టంలో విద్యార్థిగా ఉన్నారు. విశాలాంధ్ర నినాదంతో ఏర్పడిన సమైక్య రాష్ర్టంతో పాటు, స్వరాష్ర్టమై వర్ధిల్లిన తెలంగాణను చూశారు. ఆనాటి సమకాలీన స్థితులకు అద్దంగా ఆయన ఈ గీతాన్ని కూర్చారు. రెండో చరణంలో మనం నిత్యం ‘సస్యశ్యామలాం’ అని కీర్తిస్తూ పాడుకుంటున్నాం. కానీ, నిజానికి నీళ్లు లేక బీళ్లు నోళ్లు తెరుస్తున్నాయన్న నిజాన్ని నీటి ఎద్దడి గురించి చెబుతారు. తరువాతి రెండు చరణాలు… మరింత విస్తృతంగా సాగిన సినారె పరిశీలన, అవేదనలకు అద్దం పడతాయి.
చరణం 2: సస్యశ్యామల విభవస్తవ గీతాలాపనలో
పైరు నోచుకోని బీళ్లు నోళ్లు తెరుస్తున్నవి
శుభ్రజ్యోత్స్నా పులకిత సురుచిర యామినులలోనా
రంగు రంగు చీకట్ల గిరాకి పెరుగుతున్నది..
గిరాకి పెరుగుతున్నది
తరం మారుతున్నది ఆ స్వరం మారుతున్నది
చరణం 3: పుల్లకు సుమిత ధ్రుమదళ వల్లికామ తల్లి కలకూ
చిదిమివేసినా వదలని చీడ అంటుకున్నది
సుహాస సంపదలకేమి సుమధుర భాషణలకేమీ
ముసి ముసి నవ్వుల మాటున విషం మరుగుతున్నది
ప్రజా సుఖమె తమ సుఖమని వరదానాలిస్తున్నా..
ఎక్కడ వేసిన గొంగళి అక్కడనే ఉన్నది..
చివరి చరణం ఒకరకంగా ఈ గీతానికి పతాక. ఇందులో వందేమాతరం లోని ‘పుల్లకు సుమితా ధ్రుమదళ శోభినీం’ అనే వాక్యాన్ని స్వీకరించారు. అందమైన, చక్కనైన పచ్చని చెట్టుకు ‘చీడ’ అంటుకున్నదని ఆవేదన చెందుతారు. సినీ సందర్భంలో అవినీతిని చీడగా చెప్పొచ్చు. ఇంకా సంపదల లాంటివి ఎలా ఉన్నా ముసిముసి నవ్వుల మాటున విషం దాగి ఉందని, దేశాభివృద్ధి ‘ఎక్కడ వేసిన గొంగళి అక్కడనే వున్నది’ అన్న చందంగా ఉందని చెబుతారు. బంకీంచంద్రుని గీతాన్ని, దానిలోని విస్తృతార్థాన్ని చెబుతూనే ‘స్వరం మారుతున్న’ విధానాన్ని ఈ గీతంలో చిత్రించారు. ఒక విషయం మాత్రం నిజం నారాయణరెడ్డి తన కవిత్వంలో ఏ ఏ మూలాలను అన్వేషించారో, సినీ గీతాల్లోనూ వాటన్నింటినీ నిక్షిప్తం చేశారు. ఆయన ప్రతీ రచన ప్రయోగాత్మకం మాత్రమే కాదు.. ప్రయోజన పతాకం కూడా!
…? పత్తిపాక మోహన్