కొత్తచీరలు, కోలగర్రలు ఒక్కచోట కలిసే బతుకమ్మ పండుగంటే తెలంగాణ నేలకు తోబుట్టువును చూసినంత సంతోషం. పిల్లాజెల్లలతోటి ఆడబిడ్డలంతా చేరి ఆట ఆడే ఈ సమయం ఆ ఏడాదికే ప్రత్యేకం. అందుకే సంవత్సరమంతా ఏం కట్టినా, ఏం పెట్టినా సరే, బతుకమ్మ పండుగంటే మాత్రం జోర్దార్ కనబడాల్సిందేనని కోరుకుంటారు మగువలు. రంగురంగుల పూలను కూర్చి బతుకమ్మను పేర్చిన రీతిలోనే, తామూ చుక్కల్లాగా చక్కగా ముస్తాబవ్వాలని ఉవ్విళ్లూరుతారు. అలాంటి బంగారు బొమ్మల కోసం ఈ ఏడాది ప్రత్యేకంగా వచ్చిన బంగారమంటి ఫ్యాషన్లేంటో చూసేద్దాం!
సద్దుల బతుకమ్మకు చీరకంటే ముందు రవికే సిద్ధమవుతుంది. మరి దానికెన్ని సోకులద్దాలి. పూసలు, చమ్కీలు, కుందన్లు, రంగుల దారాలు… ఇలా ఎన్నింటినో పొదవుకునే వర్కులన్నీ దాని సొంతమే. అందులోనూ ఇటీవల ఆడపిల్లలు చీర ఎలా ఉన్నా సరే, రవిక మాత్రం ధూంధాం ఉండాలనే కోరుకుంటున్నారు. అదే కోవలో కొత్త సోకుతో వచ్చి చేరినవే ‘జువెలరీ బ్లౌజ్’లు. అనంత్ అంబానీ పెండ్లి వేడుకలో ముఖేశ్ అంబానీ కూతురు ఈశా తొడుక్కున్న ప్రత్యేకమైన నగల జాకెట్ స్ఫూర్తితో వీటిని తయారు చేస్తున్నారు. రకరకాల రత్నాలు, ముత్యాలు పొదిగిన బంగారు దుద్దులు, లాకెట్లలాంటివి జతచేసి ఆ రవికను రూపొందించారు ప్రముఖ డిజైనర్లు. ఇప్పుడు అదే రీతిలో కుందన్లు, రాళ్లు, పూసలు కలిగిన రంగుల్లో మెరిసే రకరకాల ఫ్యాన్సీ బిళ్లలు, లాకెట్లను కుట్టి రవికలను రూపొందిస్తున్నారు. కావాలంటే జాకెట్ మొత్తం ఇలా నగలు కనిపించేలా, లేదంటే సింపుల్‌గా మెడ చేతుల వరకు మాత్రమే ఆ నగిషీలు వచ్చేలా… వీటిని డిజైన్ చేస్తున్నారు. వర్క్‌లోనే వెరైటీని కోరుకునే వాళ్లకు ఈ నగల రవిక సూపర్ ఎంపిక!
పండుగనాడు నఖ సౌందర్యానికి నగిషీలద్దాలనుకుంటే బంగారు జిలుగుల్ని ప్రయత్నించొచ్చు. అదేనండీ ’నెయిల్ జువెలరీ ఆర్ట్’ ట్రై చేయొచ్చు. రకరకాల ఆకృతుల్లో బంగారు రంగులో నాజూగ్గా తయారు చేసిన బిళ్లలను గోళ్లకు అతికించుకోవడం ఇందులో ఒక రకం. లేదంటే రాళ్లు, పూసలు పొదిగిన ఫేక్ నెయిల్స్నే నేరుగా గోళ్లకు పెట్టుకోవచ్చు. కోలలాడినా, చప్పట్టు కొట్టినా ఘల్లుమనే గాజుల చప్పుళ్లకు తోడుగా, జిగేలుమనే గోళ్ల అలంకరణనూ జోడించొచ్చు. విభిన్నంగా కనిపించి… నలుగురితో నీ గోళ్లు బంగారం కానూ అనిపించుకోవచ్చు!
నాగరం బిళ్లల్లాగే రకరకాల జడ నగలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. అయితే ఇప్పుడు బుట్టలు, చెంప సరాలు, దుద్దుల్లాంటి వాటిని కూడా జడలో అలంకరించేస్తున్నారు. జడవేసి దానికో నగ పెట్టి వదిలేయడం కాదు, అల్లిక మొత్తం అందమైన ముస్తాబుతో నింపేస్తున్నారు. హెయిర్ ైస్టెలింగ్లో నయా నగల్ని చొప్పించడమే నేటి ట్రెండ్. సిగలో రెండు మూడు జతల చెంప సరాలను పై నుంచి కింది దాకా వరుసల్లో అలంకరించడం, జడ నిండా చిన్ని చిన్ని దుద్దుల్లాంటి వాటిని అందంగా అమర్చడం ఇందులో ప్రత్యేకత. కాబట్టి బతుకమ్మ పండక్కి వెరైటీ హెయిర్ ైస్టెల్ ప్రయత్నించాలనుకుంటే ఈ ట్రెండు
వైపు ఓ లుక్కేస్తే సరి!