హిమగిరుల్లో దౌళాధర్ పర్వశ్రేణులు ప్రత్యేకంగా ఆకర్షిస్తాయి. ధవళ వర్ణంలో మెరిసిపోయే పర్వతాలు.. ఉభయ సంధ్యల్లో అరుణ కాంతులీనుతూ దర్శనమిస్తాయి. ఈ పర్వతాల చెంతనున్న కాంగ్డా లోయ మరో అద్భుతం. కాంగ్డా జిల్లా కేంద్రమైన ధర్మశాలలో అడుగడుగునా సంప్రదాయం పలకరిస్తుంది. అక్కడక్కడా ఆధునికత తొంగిచూస్తుంది. ఇక్కడికి వచ్చే పర్యాటకులు కాసేపు ఆరామాల్లో ధ్యానం చేస్తారు. జలపాతాల్లో కేరింతలు కొడతారు. సరస్సుల్లో బోటు షికారు చేస్తారు. తేయాకు తోటల్లో విహరిస్తారు. కొండల్లో సాహసయాత్రకు పూనుకుంటారు.
ధర్మశాలలో బౌద్ధమతం వేళ్లూనుకున్నా.. ఇతర మతాల అనవాళ్లూ కనిపిస్తాయి. కాంగ్డా కోటలో, ధర్మశాల పరిసర ప్రాంతాల్లో హిందూ దేవాలయాలు కోకొల్లలు. పురాతమైన చర్చి అపురూప నిర్మాణం అందరినీ అలరిస్తుంది. ధర్మశాల రెండు భాగాలుగా ఉంటుంది. దిగువ ధర్మశాల వాణిజ్య కేంద్రాలు, అంగళ్లతో అతిథులకు తీరిక లేకుండా చేస్తుంది. ఎగువ ధర్మశాల ఆరామాలతో, పర్యాటక విశేషాలతో స్వాగతిస్తుంది. ధర్మశాలను అభివృద్ధి చేసిన పంజాబ్ గవర్నర్ సర్ డొనాల్డ్ మెక్డ్ పేరిట ఏర్పడిన ‘మెక్డ్ గంజ్’ హస్తకళలకు కేరాఫ్‌గా నిలుస్తుంది.
ధర్మశాల వచ్చే పర్యాటకులు తప్పకుండా సందర్శించే ప్రాంతం త్సుగ్లఖంగ్ కాంప్లెక్స్. బౌద్ధ ఆరామాల సమూహమిది. ఇక్కడే దలైలామా ఆవాసం ఉంటుంది. కాలచక్ర ఆలయాన్ని, టిబెటన్ మ్యూజియం కూడా సందర్శించవచ్చు. వందల మంది బౌద్ధ భిక్షువులు కనిపిస్తారు. ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే దలైలామాను చూసే అవకాశం కలుగుతుంది.
ధర్మశాలకు 46 కిలోమీటర్ల దూరంలో కాంగ్డా లోయ సమీపంలో ఉన్న అందమైన గుహాలయం మస్రూర్. కోనేటి ఒడ్డున.. అద్భుతమైన శిల్ప సంపదతో అలారారుతున్న ఈ ఆలయం ఎల్లోరా అందాలను మరిపిస్తుంది. దీనిని ఎనిమిదో శతాబ్దంలో నిర్మించినట్టు చెబుతారు. ఇలా ధర్మశాలతో పాటు పరిసరాల్లో ఎన్నెన్నో అద్భుత విహార కేంద్రాలు ఉన్నాయి. వేసవి విడిదిగా పేరున్న ధర్మశాల.. శీతాకాలంలో మరింత మనోహరంగా దర్శనమిస్తుంది.