మానవాళి దైనందిన జీవితం అంతా సూర్య గమనం మీదే ఆధారపడి ఉంది. తూర్పు కనుమల్లో సూర్యుడు ఉదయించింది మొదలు… పడమటి కోనలోకి జారుకునే వరకు మానవాళి జాగృతమై ఉంటుంది. అయితే సూర్యోదయం, అస్తమయం, రాత్రి, పగటి వేళలు ఒక్కోదేశంలో ఒక్కోరకంగా ఉంటాయి. ప్రాంతాలను బట్టి వీటిల్లో హెచ్చుతగ్గులు ఉంటాయి. సూర్యుడి శక్తిని సంపూర్ణంగా వినియోగించుకోవాలనే లక్ష్యంతో కొన్ని దేశాల్లో గడియారంలో కాలాన్ని ముందుకీ, వెనక్కీ మార్చేస్తుంటాయి. దాన్నే ‘డే లైట్ సేవింగ్ టైమ్’ అని పిలుస్తుంటారు.
అమెరికాతోపాటు ప్రపంచవ్యాప్తంగా సుమారు 72 దేశాలు ఈ ‘డే లైట్ సేవింగ్ టైమ్’ విధానాన్ని అనుసరిస్తున్నాయి. ప్రతి సంవత్సరం వేసవిలో ఈ దేశాల వాళ్లు గంట ముందుంటారు. మళ్లీ శీతకాలం ప్రారంభంలో మళ్లీ యథాప్రకారం కాలాన్ని సెట్ చేసుకుంటారు. అమెరికాలో మార్చి నెల రెండో ఆదివారం అర్ధరాత్రి 1.59.59 గంటల తర్వాత రెండు గంటలు కాకుండా గడియారంలో సమయాన్ని 3 గంటలుగా మారుస్తారు. అలా ఒక గంట సమయాన్ని ముందుకు జరుపుతారు. మళ్లీ నవంబర్ మాసం మొదటి ఆదివారం 1.59.59 గంటల తర్వాత సమయాన్ని మళ్లీ ఒంటిగంటకు సెట్ చేస్తారు. డే లైట్ సేవింగ్ టైమ్ విధానాన్ని అనుసరిస్తున్న దేశాలన్నీ కాస్త అటూఇటూగా ఇదే నెలల్లో సమయాన్ని ముందుకీ, వెనక్కీ జరుపుతుంటాయి.
గడియారాల్లో మాన్యువల్‌గా సమయాన్ని మారుస్తారు. కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, మొబైల్స్ లాంటి పరికరాల్లో టైమ్ ఆటోమేటిక్‌గా మారిపోతుంది.
ప్రజలు పగటి సమయాన్ని, సూర్యకాంతిని విస్తృతంగా ఉపయోగించుకోవాలని ఆయాదేశాలు ఈ విధానాన్ని పాటిస్తున్నాయి. సాధారణంగా ఉద్యోగులు, కార్మికులు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పనిచేస్తారు. వేసవిలో సమయాన్ని గంట ముందుకు జరపడం వల్ల ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల మధ్య పని చేసి తొందరగా ఇంటికి వెళ్తారు (గడియారం పరంగా ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు). సాయంత్రం ఇంకా వెలుగు ఉంటుంది కాబట్టి కుటుంబంతో బయటికి విహారానికి వెళ్తారు. తద్వారా ఇండ్లలో విద్యుత్ వినియోగం తగ్గుతుంది. అలాగే సాయంత్రం వేళ విహారానికి వెళ్లే కుటుంబాల వల్ల మార్కెట్లో కొనుగోళ్లు పెరుగుతాయి. అలా ఆర్థిక వ్యవస్థ కూడా మెరుగవుతుంది. ఈ ఉద్దేశంతోనే పలు దేశాలు ఈ విధానాన్ని అమలు చేస్తున్నాయి.
1895 సంవత్సరంలో జార్జ్ హడ్సన్ అనే శాస్త్రవేత్త ఈ విధానాన్ని ప్రతిపాదించాడు. వేటకు వెళ్లడం ఆయన అభిరుచి. ల్యాబ్‌లో పనిముగిసే సమయానికి చీకటి పడుతుండటం ఆయనకు విసుగు తెప్పించింది. దీంతో గడియారంలో సమయాన్ని ఓ గంట ముందుకు జరిపితే.. సాయంత్రం పెందరాలే పని ముగించుకొని వెలుతురు ఉన్నప్పుడే వేటకు వెళ్లొచ్చని భావించాడట. అలా ‘డే లైట్ సేవింగ్ టైమ్’కు శ్రీకారం చుట్టాడు. 1784 ప్రాంతంలో అమెరికాకు చెందిన శాస్త్రవేత్త, రాజకీయ నాయకుడు ‘డే లైట్ సేవింగ్ టైమ్’ను ప్రతిపాదించాడని కొందరు చెబుతారు.
‘డే లైట్ సేవింగ్ టైమ్’ విధానాన్ని తొలిగా అమలుపరిచిన దేశం జర్మనీ అని చెబుతారు. 1916లో మొదటిసారి ఈ సమయ మార్పులను అమలుచేసింది. తర్వాత ఆస్ట్రియా, అమెరికా, యూరప్ దేశాలు కూడా ఈ పాలసీని పాటించడం మొదలుపెట్టాయి. ఇప్పటికీ మార్చి, నవంబర్ నెలల్లో టైమ్ అడ్జెస్ట్మెంట్ చేస్తున్నాయి. ఇండియా సహా ఆసియా, ఆఫ్రికా దేశాలేవీ దీన్ని పాటించడం లేదు. అమెరికాలోని ఆరిజోనా, హవాయి రాష్ర్టాలు కూడా ఈ ‘డే లైట్ సేవింగ్ టైమ్’ను పాటించడం లేదు.