పల్లెల్లో సంప్రదాయాలు పల్లవిస్తాయి. కొన్ని ఆచారాలు ఆశ్చర్యపరుస్తాయి. ఒక్కో ఊరికీ ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. మహారాష్ట్రలోని చౌండాలా గ్రామంలో లెక్కకు మించి వింతలు కనిపిస్తాయి. ఈ గ్రామంలో పెండ్లి బాజాలు మోగవు. కల్యాణ మంత్రాలు వినిపించవు. అంతేనా, ఊళ్లో రెండంతస్తుల ఇల్లు కనిపించదు. ఉన్నవాడు, లేనివాడు అందరి ఇండ్లూ ఒకే అంతస్తులో కనిపిస్తాయి. అప్పుడే అయిపోలేదు, ఈ ఊళ్లో మంచాలు కనిపించవు, కుర్చీలు, బల్లలు ఉండవు. ఇన్ని వింతల వెనుక బలమైన కారణం ఊరి నడిబొడ్డున కొలువుదీరిన రేణుకాదేవి అని చెబుతారు గ్రామస్తులు. ఆసక్తిగొలిపే చౌండాలా కథాకమామిషు ఏంటంటే…
మ హారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్ జిల్లా పైఠాన్ తాలూకాలో ఉంటుంది చౌండాలా గ్రామం. మహా అయితే రెండు వందల గడపలు ఉంటాయి. అన్ని ఊళ్లలో ఉన్నట్టు ఇక్కడ అన్ని వర్గాల ప్రజలూ ఉంటారు. సంపన్నులూ ఉంటారు, కడుపేదలూ ఉంటారు. అందరూ ఆ గ్రామదేవత రేణుకమ్మ ముందు ఒకే అంతరం పాటిస్తారు. ఆ గ్రామంలో రెండు అంతరాల ఇండ్లు కనిపించవు. కారణం.. ఇంటి ఎత్తు రేణుకాదేవి ఆలయాన్ని మించి ఉండొద్దని వారి నమ్మకం. అందుకే, కలిగినవాడి ఇల్లు కూడా ఒకే అంతస్తులో ఉంటుంది. శతాబ్దాలుగా ఇదే ఆచారం కొనసాగుతూ వస్తున్నది. ఆలయ ప్రాంగణంలోని దీపస్తంభం మాత్రమే ఎత్తుగా కనిపిస్తుంది. మిగతా ఇండ్లన్నీ గర్భాలయం కన్నా తక్కువ ఎత్తులోనే ఉంటాయి.
రేణుకాదేవి కొలువుదీరిన చౌండాలా శక్తిపీఠమని భక్తుల నమ్మకం. అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటైన మాహుర్లోని రేణుకామాతను దర్శించుకోలేని భక్తులు చౌండాలాలోని అమ్మవారిని దర్శించుకునే సంప్రదాయం ఉండటం విశేషం. మాతోశ్రీ అహల్యాదేవి ఈ ఆలయాన్ని పునరుద్ధరించారని చెబుతారు.
చౌండాలలో పెండ్లి బాజాలు మోగవు. శతాబ్దాలుగా ఈ గ్రామంలో పెండ్లి జరిగిన దాఖలాలు లేవు. పురాణ కాలం నుంచీ ఈ సంప్రదాయం కొనసాగుతూ వస్తున్నదని స్థానికులు చెబుతారు. అందుకు కారణం ఏంటని ఆరా తీస్తే.. దాని వెనకాల కూడా రేణుకాదేవి మహిమే కనిపిస్తుంది. ఈ గ్రామంలో రేణుకాదేవి కన్యక రూపంలో కొలువుదీరింది. ఒకసారి ఆమెను పెండ్లి చేసుకోవడానికి రుషులు, మునులు స్వయంవరానికి వచ్చారట. రేణుకాదేవి అందానికి ముగ్ధుడైన ఓ రాక్షసుడు కూడా అక్కడికి వచ్చాడట. ఆమెను తానే పెండ్లి చేసుకుంటానని భీష్మించాడట. దీంతో ఆగ్రహించిన రేణుకాదేవి.. స్వయంవరానికి వచ్చిన వారందరినీ గండశిలలుగా మారిపొమ్మని శాపమిచ్చిందట. ఊరి శివారులో ఇప్పటికీ కొన్ని రాళ్లు చెల్లాచెదురుగా పడి ఉండటాన్ని గమనించవచ్చు. ఈ రాళ్లను గ్రామస్తులు ఏ నిర్మాణానికీ ఉపయోగించరు. అలా కాదని, రాళ్లను వినియోగిస్తే అరిష్టమని అక్కడ శిలాశాసనం.
అలా అమ్మవారి కల్యాణం ఆగిపోవడంతో.. ఊళ్లో పెండ్లిళ్ల మీద నిషేధం కొనసాగుతున్నది. అలాగని చౌండాలాలో దంపతులు ఉండరు అనుకుంటే పొరపాటు. ఈడొచ్చిన పిల్లలకు అంగరంగ వైభవంగా పెండ్లిళ్లు జరుగుతాయి. కానీ, ఆ వేడుకలకు ఈ ఊరు వేదిక కాదన్నమాట. ఊరి పొలిమేర దాటిన తర్వాత ఉన్న ఆంజనేయస్వామి ఆలయంలో గానీ, పక్క గ్రామాల్లో గానీ వివాహం చేసుకుంటారు. పొలిమేరకు వచ్చాక అప్పంగింతల తంతు ముగిస్తారు. అక్కడివరకే మేళతాళాలు ఉంటాయి. బారాత్లు జరుగుతాయి. బాణసంచా పేలుళ్లు కనిపిస్తాయి. ఒక్కసారి ఊరు హద్దులకు వచ్చాక అంతా సద్దుమణిగిపోతుంది. నవజంట చడీ చప్పుడు లేకుండా గృహప్రవేశం చేస్తుంది. శతాబ్దాలుగా వస్తున్న ఆచారాన్ని కాదని.. ఎవరైనా ఊళ్లో పెండ్లి తలపెడితే.. ఆ అమ్మవారితో తలపడినట్టే అవుతుందని భయపడతారు! అందుకు తగ్గట్టే… ఎవరైనా గ్రామంలోనే భూదేవంత అరుగు వేయడానికి ప్రయత్నిస్తే.. ఏదో ఆటంకం వచ్చి పెండ్లి నిలిచిపోయిన దాఖలాలూ ఉన్నాయట.
ఊరు వెలుపల పెండ్లి చేసుకున్న జంట గృహప్రవేశం తర్వాత పందిరి మంచం సౌఖ్యం కూడా ఉండదిక్కడ. ఎందుకంటే.. ఈ గ్రామంలో మంచాలు వాడరు. బాలింతలైనా, పసిపాపలైనా ఎవరైనా నేలపై పడుకోవాల్సిందే. నేలమీదే చాపలు, పరుపులు వేసుకోవచ్చు. ఇంటికి ఏ పెద్దమనిషో వస్తే.. సుఖాసీనులు కావడానికి కుర్చీలు కనిపించవు. బల్లలు కూడా వాడరు. నవరాత్రుల వేళ రేణుకాదేవి నేలపై నిద్రిస్తుందట. అందుకే, గ్రామంలో ఎవరూ మంచంపై పడుకోరాదనీ, కుర్చీల్లో కూర్చోరాదనీ తరతరాలుగా వస్తున్న సంప్రదాయం. ఇలా లెక్కకు మిక్కిలి వింత ఆచారాలున్న చౌండాలాలో ప్రజలు మాత్రం అమ్మవారి కన్నా ఏదీ ఎక్కువ కాదంటారు. తాము చల్లగా ఉన్నామంటే ఆ తల్లి దయే కారణమని చెబుతున్నారు.
– పాసికంటి శంకర్ , భివండీ