క్లాసులు లేవు. అసలే ఆందోళనగా ఉన్న విద్యార్థులను నిశ్చైతన్యం మరింత ఆందోళనపరిచింది. నూరుమంది విద్యార్థులు కాలినడకను బొంబాయికి బయలుదేరారు. సుందరానికేమీ తోచలేదు. వాడు రెండో టరం జీతం కట్టలేదు. ఆ డబ్బు దగ్గరుంది. అది తీసుకుని మరిద్దరు విద్యార్థులతో ఆగ్రా బయలుదేరాడు. ఆగ్రాలో వాళ్ళు తాజ్‌మహల్ చూశారు. సుందరం తాజ్ మహల్‌ను అందమైన వస్తువుగా చూడలేదు. అద్భుతమైన వస్తువుగా చూశాడు ఏ చక్రవర్తినో, వింత మృగాన్నో చూసినట్టుగా తాజ్‌మహల్ అందాన్ని అర్థం చేసుకోవాలంటే దాని ఫొటోలు చూడటమే చాలా మెరుగు. దానిలోని అద్భుతాన్ని చూడాలంటే స్వయంగా వెళ్ళి చూడవలసిందే.
సుందరం ఒకరోజల్లా దయాల్బాగ్లో గడిపాడు. అక్కడి వాతావరణం సుందరానికి అవాస్తవంగా కనపడింది. అక్కడ అందరూ ఒకటేనన్నారు. జాతిమత లింగభేదాలు లేవు. అందరూ ఏవేవో పనులు చేస్తూ ఉంటారు. అందరూ కలిసి ఒకేచోట తిండి తింటారు. ఎవరికి వారు వడ్డించుకుంటారు. ఎవరి పళ్ళాలు వారు కడుక్కుంటారు. అక్కడా సినిమా టిక్కెట్టు కొన్నంత సులభంగా పెళ్ళి. అంతే సులభంగా పెళ్ళి రద్దు చేసుకోవచ్చు.
గ్రామఫోను రికార్డులు తయారు చెయ్యటమూ, ఫౌంటెన్ కలాలు తయారు చెయ్యటమూ తప్ప మిగిలిన పరిశ్రమలన్నిటినీ సుందరాన్ని చూడనిచ్చారు. సుందరం అక్కడ కొత్తగా పెట్టిన డయిరీఫారం కూడా చూశాడు. అక్కడ గేదెల్ని చేత్తో పితకరట, పాలుతీసే యంత్రం వుందిట. ఆరోజు ఉదయం అల్పాహారం కింద సుందరం అణాకానీ ఇచ్చి శేరుపాలు చిక్కనివి తాగాడు.
“ఈ సమాజంలో దగాలేదు. దురన్యాయం లేదు. మనుష్యులకు ప్రతిబంధకాలు లేవు. అధికారభయం లేదు. ఇటువంటి సమాజాన్ని రాధాస్వామి ఎట్లా స్థాపించారు? ఈ గురూజీ ఎట్లా నిర్వహిస్తున్నాడు?” అనుకున్నాడు సుందరం.
సాయంకాలం సత్సంగానికి వెళ్ళాడు సుందరం. తాను పరాయివాడన్నట్టు ఎవరూ చూడరు. తాను పక్కవాణ్ణి పట్టుకుని ఏ ప్రశ్నవేసినా ఎరిగున్నవాడల్లే ఆర్తిగా సమాధానం చెబుతారు.
– కొడవటిగంటి కుటుంబరావు ‘చదువు’ నవల నుంచి