తరగతి గదుల్లో దేశ భవిష్యత్‌ను రూపుదిద్దే అధ్యాపకుడు సి.వి.వి.ప్రసాద్ కళ్లారా చూసిన అభివృద్ధిని అక్షరీకరించారు. మంచి అన్నది పెంచుమన్నా అంటూ పాఠాలు చెప్పడమే కాదు తను చూసిన మంచిని ఎలుగెత్తి చాటుతూ వ్యాసాలూ రాశారు. పత్రికల ద్వారా పది మందికి చెప్పారు. వాటన్నిటినీ కలిపి ‘తెలంగాణ రాష్ట్రం – సామాజిక సమస్యలు, విశ్లేషణ’ పేరుతో ఓ సంకలనం తీసుకొచ్చారు. ఈ వ్యాసాల్లో మంచిని ఎంతగా కీర్తించారో, సమాజంలోని చెడు ధోరణులను కూడా అంతే తెగనాడారు.
హేతుబద్ధత, సమదృష్టి ప్రామాణికంగా తీసుకుని సమకాలీన సమాజాన్ని ఆయన ఇందులో విశ్లేషించారు. తెలంగాణ అభివృద్ధి, సంక్షేమ పథకాలతోపాటు సామాజిక అంశాలెన్నిటినో ఘటనలు, విధానాలు, నివేదికల ఆధారంగా రచయిత విశ్లేషించారు. నలభై మూడు వ్యాసాల్లో అన్నీ తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత రాసినవే. సంక్షేమం, అభివృద్ధి, పర్యావరణం, సామాజికాభ్యుదయం వంటి అంశాలెన్నిటినో వీటిలో సృజించారు. ఇంకో విశేషం ఏమిటంటే ఈ వ్యాసాలన్నీ సామాన్యులకు అర్థమయ్యేలా సరళమైన భాష, పిల్లలు కూడా తెలుసుకునేలా చక్కని విశ్లేషణతో సాగాయి. పాఠకుడిని కష్టపెట్టకూడదని రచయిత తీర్మానించుకొని రాసినట్టే ఉండటం విశేషం!
– నాగవర్ధన్
రచన: సి.వి.వి.ప్రసాద్
పేజీలు: 169, ధర: రూ.100
ప్రతులకు: ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలు