ఈ సామెతకు కాలదోషం లేదు. ఎప్పుడైనా అన్వయించుకోవచ్చు. నిజాలు తెలుసుకోకుండా అబద్ధాలను, ఊహాగానాలను ప్రచారం చేసేవారు అన్ని కాలాల్లోనూ ఉంటారు. అగరబత్తీల నుంచి వచ్చే పొగను చూసి, భయపడిపోయి.. ఏదో జరగబోతుందని ఊహించుకొని నలుగురినీ నమ్మించే ప్రయత్నం చేయడం అన్నమాట. ఊదుబత్తీల పొగ తీవ్రత చాలా స్వల్పం. అదే ఓ ఊరు మొత్తం తగలబడిపోతే వచ్చే పొగ తీవ్రంగా ఉంటుంది. కొందరికి ఆ తేడా తెలియదు. ఇటువంటి వ్యక్తులను రోజూ సోషల్ మీడియాలో చూస్తూనే ఉంటాం. నిజానిజాలు తెలుసుకోకుండా.. ఎవరో ఏదో ఫార్వర్డ్ చేస్తే, దాన్ని వేరొకరికి చేరవేసి మురిసిపోతుంటారు.
కొందరంతే. లేనిపోని డాంబికం ప్రదర్శిస్తారు. ఎదుటివారిని చిన్నచూపు చూస్తూ తక్కువ చేసి మాట్లాడతారు. ఓ మాటమీద నిలబడలేని వ్యక్తులను ఉద్దేశించి చెప్పిన సామెత ఇది. మనిషిని కుదురుగా ఓ చోట ఉండనివ్వని అంశాలు రెండే.. నడిమంత్రపు సిరి, నరం మీద పుండు. ఎవరికైనా అనుకోకుండా సిరి సంపదలు వస్తే దాన్ని నడిమంత్రపు సిరి అంటారు. ఇలాంటి వారు ఎప్పుడూ ఓ చోట నిలకడగా ఉండలేరు. అప్పనంగా డబ్బు వచ్చిన ఆనందంలో గాలి మేడలు కడుతుంటారు. ఎదుటివారిని తక్కువ చేసి మాట్లాడుతుంటారు. ఇక నరంమీద పుండు పుట్టినవారు కూడా ఓ చోట నిలకడగా ఉండలేరు. ఎందుకంటే నొప్పి విపరీతంగా వస్తుంటుంది. నిత్యం రక్త ప్రసరణ జరిగేది నరాల ద్వారానే కాబట్టి, పుండు త్వరగా మానదు. దాని నుంచి వచ్చే రసికి ఈగలు తోడవుతాయి. వెరసి నిలకడ ఉండదు
పైత్యాలు చాలా రకాలుగా ఉంటాయి. అయితే, ఎప్పుడైనా ‘ఏనుగు పైత్యం’ గురించి విన్నారా? ఈ పలుకుబడిని ఎక్కువగా ఉపయోగించేది గ్రామీణ ప్రాంతాల్లోనే. సాధారణంగా పైత్యం చేస్తే ఒంటిపై చిన్న దద్దుర్లు వస్తుంటాయి. అక్కడక్కడా బొబ్బలు తేలుతాయి. పైత్యం చేస్తే వింతగా ప్రవర్తిస్తుంటారు. అల్లం తింటేనో, బూడిద రాస్తేనో అవి తగ్గిపోతుంటాయి. ఇవన్నీ చేసినా తగ్గకపోగా ఆ బొబ్బలు పెరుగుతూ, అక్కడ చర్మం ముడతలు పడిపోయి, ఏనుగు చర్మాన్ని తలపిస్తుంది. అలా వస్తే ‘వీడికి ఏనుగు పైత్యం పుట్టిందిరా’ అంటారు. దీనిని వైద్య పరిభాషలో ‘అర్టికేరియా’ అంటారు. చర్మంపై ఎర్రటి బొబ్బలు, బొడిపెలు కలిగించే ఒక చర్మ సమస్య. తగ్గడానికి 6 వారాల సమయం పడితే, వాటిని తీవ్రమైన దద్దుర్లు (ఏనుగు పైత్యం)గానే పరిగణిస్తారు.
బీగం = తాళం
(ఊరికి పోయే యావలోపడి ఇంటికి బీగం వేసుడు మర్సినవా?)
కైకట్టుడు =అనుకరణ చేయడం
(రాజుగాడు అప్పటికప్పుడే కైకట్టి పాట పాడిండు)
టోంబాడోలి = బోళాతనం
(ప్రతీది పట్టించుకోకుండా, చూసీ చూడకుండ టొంబాడోలె పోవాలె బిడ్డా)
తకద్దం = పోరు పెట్టడం/మనసున పట్టనీయక పోవడం (మావోడు పైసలియ్యమని
తకద్దం చేస్తున్నడు)
పావురంగా = ప్రేమగా
(మొన్న సంక్రాంతికి అమ్మోళ్ల ఊరువోతే నన్ను పావురంగా చూసుకున్నరు)
✍ డప్పు రవి