Super Foods | .. ఈ మాట మార్కెటింగ్ మంత్రంలా మారిపోయింది. బరువు తగ్గాలన్నా, పెరగాలన్నా.. ఆరోగ్యంగా ఉండాలన్నా, అనారోగ్యాన్ని వదిలించుకోవాలన్నా.. సూపర్‌ఫుడ్స్ తినాల్సిందే అంటున్నారు. అవునా, సూపర్ ఫుడ్స్ అంత సూపరా?
రెండో ప్రపంచయుద్ధ కాలంలో ‘సూపర్ ఫుడ్స్’ అనే మాట ప్రచారంలోకి వచ్చింది. అమెరికాకు చెందిన యునైటెడ్ ఫ్రూట్స్ కంపెనీ కుప్పగా పేరుకు పోయిన అరటిపండ్లను వదిలించు కోవడానికి ఇదో సూపర్ ఫుడ్ అంటూ ప్రచారం హోరెత్తించింది. భోజనానికి బదులుగా అరటిపండ్లు తింటే సరి పోతుందని జనానికి నూరిపోసింది. ఆ వ్యూహం బాగానే పనిచేసింది.
అవిసె గింజలు, చియా విత్తనాలలో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలం. జనపనార విత్తనాలు, పొద్దుతిరుగుడు గింజలు ఒమేగా సిక్స్ ఫ్యాటీ యాసిడ్స్‌కు నిలయం. ఈ రెండు రసాయనాలూ జీవక్రియను మెరుగుపరుస్తాయి. కాబట్టే, ఈ గింజల్ని సూపర్‌ఫుడ్స్‌గా గుర్తించింది పోషకాహార ప్రపంచం. పసుపు, ఉసిరి, కొబ్బరి మొదలైన వంటింటి దినుసులు సైతం ఓ మోస్తరు సూపర్ ఫుడ్సే. యోగర్ట్, బ్రకోలి, ఆలివ్ ఆయిల్ ప్రాధాన్యాన్నీ కాదనలేం. అలా అని పప్పుధాన్యాల అవసరాన్ని కూడా తగ్గించి చూపలేం. కాబట్టే, “ఏ కొన్ని దినుసులకో సూపర్ ఫుడ్స్ ముద్ర వేయడం సరికాదు” అంటారు పోషకాహార నిపుణులు.
సూపర్ ఫుడ్స్ అయినా, ఇతర ఆహార పదార్థాలైనా.. మనల్ని పూర్తిగా ఆరోగ్యవంతుల్ని చేయలేవు. ఆ ప్రయత్నంలో సాయపడతాయంతే. జీవనశైలి, వ్యాయామం, అలవాట్లు, జన్యువులు.. మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే ఇతర అంశాలు.
నిజమే, కొన్ని ఆహార పదార్థాలకు అపారమైన ఔషధ గుణాలు ఉంటాయి. పోషక విలువలూ అనేకం. అంత మాత్రాన ఆరోగ్యం కోసం ఆ ఒక్క ధాన్యం మీదే ఆధారపడలేం. సూపర్ ఫుడ్స్ కోసం ఎగబడేవారు తెలుసుకోవాల్సిన విషయం ఇది. ఒక పదార్థాన్ని అతిగా తినడం ఎంత హానికరమో, కొన్ని పదార్థాల్ని అసలు తినకపోవడమూ అంతే హానికరం.
జీవనశైలి వ్యాధులు పెరుగుతున్నకొద్దీ సూపర్ ఫుడ్స్‌కు గిరాకీ అధికం అవుతూనే ఉంటుంది. చాలా సందర్భాల్లో మార్కెటింగ్ మాయాజాలమూ వీటికి తోడవుతుంది. మనవైన సూపర్‌ఫుడ్స్ చాలానే ఉన్నా.. హఠాత్తుగా ఓట్మీల్ వార్తలకెక్కడమూ అలాంటి వింతే. ఈ మధ్య కొంతమంది సముద్రపు నాచుకు కూడా‘సూపర్’ హోదా ఇస్తున్నారు.
ప్రతి సంప్రదాయ ఆహారంలోనూ కొన్ని సూపర్ ఫుడ్స్ ఉంటాయి. వాటిని చిన్నచూపు చూస్తూ.. ఏ అమెరికన్ సూపర్ ఫుడ్స్ మీదో మనసు పారేసుకోవడం సరికాదు. మన వాతావరణానికి అనువైన, మన నేలల్లో పండే రుచులే అత్యుత్తమం. ఎంత లోకల్ అయితే, అంత సూపర్!
సూపర్ ఫుడ్‌తో పోలిస్తే.. సూపర్ ప్లేట్ మంచి ఆలోచన. తాజా ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు, కార్బొహైడ్రేట్లు పుష్కలంగా ఉన్న నిండు పళ్లెం.. సంజీవనితో సమానం.