ఉత్తర భారతంలో ఓ మారుమూల పల్లెటూరు మాది. ఆ ఊళ్లో మా ఇంటి వెనక ఓ మడుగు ఉంది. బాగా పేరుకుపోయిన బురద, బర్రెలు,దున్నపోతులు కాకుండా..అందులో నేను కనుక్కొని తీరాల్సింది ఇంకా చాలాఉందన్న విషయం
అప్పటివరకూ తెలియదు నాకు.
– రస్కిన్ బాండ్
మాతాతయ్యకు నేనంటే ప్రాణం. ఆ మడుగులో ఉండే వైవిధ్యభరితమైన లోకాన్ని నాకు పరిచయం చేసింది ఆయనే. ప్రతీ జీవి ఎంతోకొంత ప్రయోజనం పొందేలా మడుగు ఆవరణ వ్యవస్థ ఎంత చక్కగా ఏర్పాటు చేయబడిందో వివరించారు. మడుగులో బతికే ప్రాణులకు అదే ప్రపంచం. అదే మనకైతే… కేవలం బురద మడుగేనని తాతయ్య చిద్విలాసంతో చెప్పారు.
నాకు బాగా గుర్తు. మొదటిసారి మడుగు ప్రపంచాన్ని చూపడానికి తాతయ్య ఓ ముసలి రావిచెట్టు నీడను ఎంచుకున్నారు. నీటిపైన పేరుకుపోయిన పలుచటి ఆకుపచ్చ నాచు తెట్టును రెప్ప వాల్చకుండా చూస్తూ… అక్కడే ఓ గంటపాటు నిల్చుండి పోయాం. బర్రెలు అప్పటికింకా తమ పగటి స్నానానికి రాలేదు. దాంతో మడుగు పైభాగం కదలకుండా స్థిరంగా ఉంది.
మొదటి పది నిమిషాలూ మడుగు పైభాగంలో మాకు ఏదీ కనిపించలేదు. ఇంతలో మడుగు మధ్యలో ఒక చిన్న మచ్చ ఏర్పడింది. క్రమంగా అది కొంత ఎత్తుకు ఎగసింది. చివరికి మేం ఓ కప్ప తలను మాత్రం చూడగలిగాం. దాని పెద్దపెద్ద కండ్లు మాకేసి తీక్షణంగా చూశాయి. అయితే మేం దానికి దోస్తులమా, శత్రువులమా అన్న సంగతి ఆ కప్పకు తెలియదు. అందుకే తన శరీరం మాకు కనిపించకుండా దాచుకుంది. అయినప్పటికీ, కప్ప శత్రువైన ఓ కొంగ దానికోసం తప్పకుండా వెతుకుతూ ఉండే ఉంటుంది.
అయితే మేము కొంగలం కాదన్న విషయం నిర్ధారించుకున్న మరుక్షణమే, ఆ కప్ప ఈ విషయాన్ని తన దోస్తులకు, పొరుగువారికి తప్పకుండా చెప్పే ఉంటుంది. అందుకేనేమో, ఆ వెంటనే ఇంకా కొన్ని పెద్ద తలకాయలు, పెద్దపెద్ద కండ్లు మడుగు పైభాగానికి రాసాగాయి. అంతేకాదు, వాటి గొంతులు ఉబ్బిపోయాయి. కాసేపట్లో బెకబెకలు షురువైపోయాయి.
ఇంతలోనే, చెట్టుకు దగ్గరగా.. అంతగా లోతులేని మడుగు నీళ్లలో మేం ఒక కదులుతున్న నీడను చూశాం. ఓ కట్టె పుల్లతో దానిని తాకగానే, ఆ నల్లటి తెట్టంతా జీవం పొందింది. వేలాది చిన్నచిన్న చిరుకప్పల్లో కదలిక ఆరంభమైంది. ఒకదానిని మరొకటి తోసుకోవడం, నెట్టుకోవడం ప్రారంభించాయి.
‘చిరుకప్పలు ఏం తింటాయి?’ తాతయ్యను ఆసక్తిగా అడిగాను.
‘మామూలుగా అయితే అవి ఒకదానిని మరొకటి తింటూ కాలం గడుపుతాయి’ అన్నది తాతయ్య సమాధానం. ‘ఇది అంత మంచి ఏర్పాటుగా అనిపించకపోవచ్చు. కానీ, తల్లి కప్పలు పొదిగే వేలాది చిరుకప్పలను తలుచుకుంటే, ఇదెంత ఉపయోగకరమైన ఏర్పాటో నీకు అర్థమవుతుంది. ఒకవేళ ఈ మడుగులో ఉన్న చిరుకప్పలన్నీ గండ్రు కప్పలే గనక అయిపోతే, అవి ఇక్కడికి, మనింటికీ మధ్య ఉన్న నేలను మొత్తం.. అంగుళం అంగుళాన్నీ ఆక్రమించుకుంటాయి!’ అన్నారు తాతయ్య. ‘అంటే… వాటి బెకబెకలు నానమ్మను తప్పకుండా పిచ్చిదాన్ని చేసేస్తాయి’ అన్నాను నేను.
ఆ సంగతి అలా ఉంచితే, నేను కొన్ని కప్పల్ని ఇంటికి తీసుకువచ్చాను. వాటిని ఓ పెద్ద గాజు సీసాలో ఉంచాను. నా పడకగదిలో ఓ కిటికీ చజ్జపై పెట్టాను. తెల్లవారుజామున నాలుగు గంటల ప్రాంతంలో మా ఇల్లంతా హాహాకారాలతో దద్దరిల్లింది. మా తాతయ్య, నానమ్మ, చిన్నమ్మలు, అత్తలు, పనివాళ్లు… అందరూ భద్రత కోసం ఇంటి వరండాలో పోగయ్యారు. ఇంతలో ధ్వని మూలాన్ని పసిగట్టారు. నేను తెచ్చిన కప్పలే ఆ ఉత్పాతానికి కారణమని వారికి అర్థమైపోయింది. పొద్దుపొడుపును కనిపెట్టిన కప్పలు తమ ఉదయరాగాలను మొదలుపెట్టాయన్న మాట! నానమ్మ అయితే, కప్పలతో సహా సీసాను బయటికి విసిరివేయాలనుకుంది. కానీ, తాతయ్య స్థితప్రజ్ఞుడి టైపు. అదేం పట్టించుకోలేదు. తాపీగా సీసాను కదిపాడు. దాంతో కప్పలు గప్చుప్ అయిపోయాయి. ఇక అంతా మళ్లీ నిద్రకు ఉపక్రమించారు. నేను మాత్రం మెలకువగానే ఉండాలని నిర్ణయించుకున్నాను. మళ్లీ కప్పలు రాగం అందుకుంటే సీసాను కదపడానికి అన్నమాట. అయితే పొద్దున నాస్తా చేయడానికి ముందే నేను వాటిని తోటలో వదిలిపెట్టాను.
ఆ రోజు నుంచీ మడుగు దగ్గరికి నా అంతట నేనే వెళ్లడం మొదలుపెట్టాను. బూట్లను విడిచిపెట్టి దాని దరులు, లోతులను కనుక్కొంటూ మోకాలు లోతువరకు బురద నీళ్లలోకి వెళ్లేవాణ్ని. మడుగు ఉపరితలంపై తేలుతున్న కలువ పువ్వులను తెంపేవాణ్ని.
అలా ఓరోజు నేను మడుగు దగ్గరికి చేరుకునేటప్పటికే దానిని బర్రెలు, దున్నపోతులు ఆక్రమించుకున్నాయి. వాటి యజమాని నా కంటే కొంచెం పెద్దవాడైన పిల్లవాడు. అతను మడుగు మధ్యలో ఈదులాడుతున్నాడు. ఇంతలోనే, తన బర్రెల్లో ఒకదాని మీదికి చేరుకున్నాడు. నల్లగా మెరుస్తున్న వీపుపై తన సన్నటి శరీరాన్ని వాలుగా సాగదీశాడు. తనలో తాను ఏదో పాడటం మొదలుపెట్టాడు.
నేను తనను చూస్తున్న విషయం గమనించి చిన్నగా నవ్వాడు. నల్లటి ముఖం వెనకాల తెల్లగా మెరుస్తున్న పండ్లను బయటికి చూపిస్తూ. నన్ను కూడా ఈత కొట్టమంటూ నీళ్లలోకి ఆహ్వానించాడు. నాకు ఈత రాదని చెప్పాను. అదెంతపని, ఆ విద్య నీకు నేర్పుతానన్నాడు.
అయితే నేను పల్లెటూరి పిల్లలతో కలవడం మా నానమ్మకు అంతగా రుచించదు. ఆమెది కఠినమైన పాతకాలపు చాదస్తం. ఆ సంగతి గుర్తుకువచ్చి అతని ఆహ్వానాన్ని మన్నించడానికి కొంచెం తటపటాయించాను. ఇంతలో, ఏదైనా సమస్య వస్తే నన్ను బయట పడేయటానికి మా తాతయ్య ఉన్నాడన్న విషయం గుర్తుకువచ్చింది. పైగా ఆయన మా నానమ్మకు తెలవకుండా అప్పుడప్పుడూ హుక్కా పీలుస్తాడు కూడా! అలా నేను ఆ అబ్బాయి ప్రతిపాదనను అంగీకరించడానికి ధైర్యంగా ముందడుగు వేశాను. ఇక ఒక్కసారి నిర్ణయం తీసు కున్నానంటే.. అది ఏదైనా, ఎంతటిదైనా సరే.. తగ్గేదే లేదు.
దాంతో ఆ కుర్రాడు తన బర్రె మీదినుంచి నీటిలోకి దూకాడు. నావైపు ఈదుతూ వచ్చాడు. నేను కూడా నా చెడ్డీ, అంగీ విప్పేశాను. అతని సూచనలను అనుసరిస్తూ కలువ పువ్వుల వరకు వెళ్లాను. తన పేరు రాము. మొత్తానికి ప్రతీ మధ్యాహ్నం నాకు ఈత పాఠాలు నేర్పుతానని మాటిచ్చాడు. అలా పగటివేళల్లో, ప్రత్యేకించి అందరూ నిద్రపోయే వేసవి మధ్యాహ్నాల్లో మేము కలుసుకునేవాళ్లం.
మడుగు ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకు ఈదడం నేర్చుకోవడానికి ముందు… నేను, రాము ఇద్దరమూ ఒకే బర్రె మీద కూర్చునేవాళ్లం. బర్రె కాళ్లు ఏటవాలుగా చాపుకొని ఉన్న ఆ దృశ్యం.. బురద మహాసముద్రం మధ్యలో మేం ఒక ద్వీపంలా నిలుచున్నట్లు ఉండేది. కొన్నిసార్లయితే రాము, నేను వేర్వేరు బర్రెల మీద కూర్చుని వాటికి పరుగు పందెం పెట్టేందుకు ప్రయత్నించేవాళ్లం.
కానీ, అవి చాలా సోమరి జంతువులు. అవసరమైతే తప్ప తమకు అనువైన ప్రదేశాన్ని విడిచిపెట్టేవే కాదు. వాటికి పరుగు పందాలంటే ఆసక్తి లేదని అర్థమైపోయాక.. మేం వాటి వీపుల మీద అటూయిటూ దొర్లేవాళ్లం. అవి ప్రేమగా మమ్మల్ని బురద మడుగులోని ఆకుపచ్చ తెట్టులోకి తీసుకెళ్లేవి. అలా మడుగులో పేరుకుపోయిన నాచు ఆకుపచ్చ, బురద ఖాకీ రంగులలో మునిగితేలి పైకి వచ్చేవాణ్ని. అక్కడినుంచి సరాసరి జాలాడు గుండా ఇంట్లోకి జారుకునేవాణ్ని. బట్టలు వేసుకోవడానికి ముందు, జాలాడులో నల్లా కింద స్నానం చేసేవాణ్ని. అయితే రాము పేద రైతు కుటుంబం నుంచి వచ్చాడు. బడికి వెళ్లే అవకాశం లేదు. కానీ తనకు జానపదాలు బాగా తెలుసు. పక్షులు, జంతువుల గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు మనసుకు హత్తుకునేలా చెప్పేవాడు.
ఓ రోజు, అలా మాటల సందర్భంలో ‘పక్షులు చాలా పవిత్రమైనవి’ అని రాము నాతో అన్నాడు. ఇంతలో ఓ పాలపిట్ట రావి చెట్టు మీది నుంచి కిందికి వచ్చి వాలింది. రెప్పపాటు సమయంలో ఒక గొల్లభామను పట్టుకు పోయింది. శివుడినే కాదు, పాలపిట్టనూ ‘నీలకంఠ’ అని పిలుస్తారని రాము చెప్పాడు. ఆ పిట్టలానే శివుడికీ నల్లటి గొంతు ఉంటుందట. మనుషులకు ప్రమాదం రాకుండా, ఎంతో దయతో శివుడు కాలకూట విషాన్ని మింగేశాడు. దాన్ని తన గొంతులోనే ఉంచుకొన్నాడు. లోపలికి వెళ్లనీయ లేదు.
‘ఉడుతలు కూడా పవిత్రమైనవేనా?’ నేను అడిగాను.
‘అవి అంటే శ్రీకృష్ణుడికి చాలా ఇష్టం’ ఊరిస్తూ చెప్పాడు రాము. ‘ఆయన వాటిని తన చేతుల్లోకి తీసుకున్నాడు. తన పొడవైన వేళ్లతో తడిమాడు. అందుకే వాటికి తల నుంచి తోక వరకు నాలుగు నల్లటి చారలు ఉంటాయి. కృష్ణుడు కూడా చాలా నల్లగా ఉంటాడు. ఆ చారలు ఆయన వేళ్ల గుర్తులే’.
మనం పక్షులు, జంతువులతో సున్నితంగా మెలగాలని రాము, తాతయ్య ఇద్దరూ అనేవాళ్లు. ఎట్టి పరిస్థితుల్లోనూ వాటిని చంపకూడదని కూడా చెప్పేవాళ్లు. ‘వాటి హక్కులను తప్పకుండా గుర్తించాలి’ అని తాతయ్య నొక్కిచెప్పారు. కానీ, మనం మాత్రం ఆ విషయాన్ని పట్టించుకోకుండా అడవులను నాశనం చేస్తున్నాం. కాబట్టి, ప్రతిచోటా పక్షులు, జంతువులు నివసించడం ఎంతో కష్టంగా మారిపోతున్నది. చెట్లు కనుమరుగై పోతున్న కొద్దీ అవి వేరే దగ్గరికి వలస పోవాల్సి వస్తున్నది.
రాము, నేను ఎన్నో సుదీర్ఘమైన ఎండాకాలం మధ్యాహ్నాలను మడుగులో గడిపాం. నేను మా తాతయ్య ఇల్లు వదిలిపెట్టి వచ్చిన తర్వాత మళ్లీ మేమెప్పుడూ ఒకరినొకరం చూసుకోనే లేదు. అతనికి చదవడం, రాయడం రాదు. అందుకని ఉత్తరాలూ రాసుకోలేకపోయాం. మా దోస్తానా గురించి మాకు తప్ప ఎవరికీ తెలియదు.
మా గురించి తెలిసింది మడుగులో ఉన్న బర్రెలు, కప్పలకు మాత్రమే. ఏమైతేనేం, బురదతో ఉన్నప్పటికీ.. అవి తమకే సొంతమైన మడుగు ప్రపంచంలో మమ్మల్ని కూడా భాగం చేసుకున్నాయి. ఎక్కడెక్కడి నుంచో వలస వచ్చే పక్షుల లాగే.. నేను కూడా ఎప్పుడో ఓసారి తిరిగి వస్తానని రాముతోపాటు బర్రెలు, కప్పలు అనుకొని ఉండవచ్చు.
రస్కిన్ బాండ్ ప్రముఖ భారతీయ ఆంగ్ల రచయిత. బ్రిటిష్ మూలాలు ఉన్న 87 ఏండ్ల బాండ్ ప్రస్తుతం ఉత్తరాఖండ్ రాష్ట్రం ముస్సోరీలో నివాసం ఉంటున్నారు. ద రూమ్ ఆన్ ద రూఫ్, రెయిన్ ఇన్ ద మౌంటెయిన్స్, బ్లూ అంబ్రెల్లా తదితర రచనలు ఈయన కలం నుంచి జాలువారాయి. రస్కిన్ బాండ్ రచనలలో హిమాలయ పర్వత ప్రాంత జీవితాల చిత్రణ ప్రముఖంగా కనిపిస్తుంది.
స్వేచ్ఛానువాదం: చింతలపల్లి హర్షవర్ధన్