‘నమస్తే తెలంగాణ-ముల్కనూరు సాహితీపీఠం’ సంయుక్తంగా నిర్వహించిన ‘కథల పోటీ-2025’లో రూ.2వేల బహుమతి పొందిన కథ.
సామర్లకోట రైల్వే జంక్షన్. ‘ప్రయాణీకులకు విజ్ఞప్తి! రైలు నెం. 12737. కాకినాడ పోర్టు నుండి లింగంపల్లి వెళ్లే గౌతమీ ఎక్స్‌ప్రెస్ మరికొద్ది క్షణాలలో రెండవ నంబరు ప్లాట్‌ఫామ్ పైకి రానున్నది’.. అనౌన్స్మెంట్ వినిపించగానే.. తన భుజానికి ఉన్న బ్యాగ్ తీసి, భార్యకు అందించి.. కింది నుంచి సూట్‌కేస్‌ను చేతిలోకి తీసుకొని, ప్లాట్‌ఫామ్ మారడానికి ముందుకు నడిచాడు రామారావు.
మొబైల్లో బెర్త్ నంబర్స్ సరిచూసుకొని, బోగీలో నడుచుకుంటూ ముందుకు వెళ్లాడు. 17, 18 లోయర్, మిడిల్ బెర్త్‌ల వద్ద ఆగి చూసాడు. ఆశ్చర్యం.. ఆ బెర్త్‌లకు ఎదురుగా తన చిరకాల మిత్రుడు సూర్యనారాయణ మూర్తి, అతని భార్య కూర్చొని ఉన్నారు. “ఏరా! ఎంత వరకు?..” ఒకింత ఆశ్చర్యంగా అడిగాడు రామారావు.
“ఓరీ! నువ్వు ఇక్కడ.. భలే కలిసామే” సమాధానంగా సూర్యనారాయణ మూర్తి. చిరకాల మిత్రులే కానీ, కలిసి ఏడాదిపైనే అయ్యింది. రామారావు అబ్బాయి పెళ్లిలో కలిసారు అంతే! ఆ తర్వాతంతా ఫోన్ పలకరింపులే. “ఎంత వరకు సూర్యనారాయణ” అంటూ కూర్చున్నాడు రామారావు. “హైదరాబాద్‌లో అమ్మాయి దగ్గరికి. అక్కడి నుండి అమ్మాయి, అల్లుడు, పిల్లలతో కలిసి కాశీ వెళదామని”
“కాశీనా! రిటైర్మెంట్ లైఫ్ బాగానే ఎంజాయ్ చేస్తున్నావు” అన్నాడు రామారావు. “ఏదో అలా.. కాశీ యాత్ర చేద్దామని ప్లాను చేసింది తనూజ” అన్నాడు సూర్యనారాయణ మూర్తి. “మా అబ్బాయికి సంబంధాలు కుదరక పెళ్లి ఆలస్యం అయ్యింది కానీ, నువ్వు మాత్రం సర్వీసులో ఉండగానే అమ్మాయి పెళ్లి చేసిన అదృష్టవంతుడవు” అన్నాడు రామారావు సూట్‌కేసును బెర్త్ కింద పెడుతూ. “అదృష్టవంతుడనా! రామారావు.. నువ్వేనా ఆ మాట అంటున్నది..” సూర్యనారాయణ మదిలో ఆనాటి జ్ఞాపకాల పుట తెరుచుకుంది.
* * *
“సూర్యనారాయణ.. నిన్ను మేనేజర్ రమ్మంటున్నారు” మేనేజర్ గది నుండి బయటికి వస్తూ రామారావు. “లోపలకు వెళ్లి ఏం చెప్పావు? ఎవరి మీద ఫిర్యాదు చేసావు?” అన్నాడు కళ్లజోడు సవరించుకుంటూ, కుర్చీలోంచి లేచి సూర్యనారాయణ మూర్తి. ఇద్దరూ మంచి స్నేహితులే కానీ, ఒక్క నిమిషం పడదు. ఏనాటి బంధమో కానీ, ఇంటర్ నుంచి పరిచయం.
అది అలా అలా ముదిరి.. ప్రైవేటు కంపెనీలో కూడా ఒకేచోట కలిసారు. యాదృచ్ఛికమో, అనుబంధమో తెలియదు కానీ.. మరీ విడదీయరాని బంధంలా ఇద్దరివీ పక్కపక్క సీట్లే. “రామారావుకి కాస్త పని నేర్పమని చెప్పడానికి పిలిచారు” మేనేజర్ రూములోంచి బయటకు వచ్చి ఫైలును తన టేబుల్ మీద పెడుతూ సూర్యనారాయణ. “నేను ఏం చేసా…” తలపైకి ఎత్తి చూసాడు రామారావు.
“ఆడిటింగ్‌లో చాలా తప్పులు దొరికాయట. అవి సరి చేయమని నీకు చెప్పమన్నారు” “అదేదో నాకే చెప్పవచ్చు కదా! మధ్యలో నువ్వెందుకు” ఉక్రోషం తన్నుకొచ్చింది రామారావుకు “కొత్త మేనేజర్ వచ్చేలోపు సరిచేసి ఉంచమని చెప్పారు. వచ్చే మేనేజర్ చాలా కోపిష్టిట” రామారావు బాధను అర్థం చేసుకొని సముదాయిస్తూ సూర్యనారాయణ.
“పది రోజుల్లో కొత్త మేనేజర్ వస్తున్నారుట. పెండింగ్ వర్క్స్ క్లియర్ చేయమని మేనేజర్ చెప్పమన్నారు” అని.. అక్కడ ఉన్నవారికి చెప్పి, సీటు పక్కన ఉన్న క్యారేజీ తీసుకొని లంచ్ హాల్‌కు బయలుదేరాడు సూర్యనారాయణ. లంచ్‌బ్రేక్ కావడంతో అందరూ లంచ్ హాల్లోకి చేరారు. అక్కడ కొత్త మేనేజర్ గురించి చర్చలు మొదలయ్యాయి. వచ్చే కొత్త మేనేజర్ చాలా స్ట్రిక్ట్, చండశాసనుడు అని తెలిసింది.
“కృష్ణవేణీ.. మీ దగ్గర పెండింగ్ పనులు ఏమీ లేవా?” అన్నాడు కళ్లజోడు సర్దుకుంటూ రామారావు. “రెగ్యులర్ పనే కావడంలేదు, పెండింగ్ పని ఏం చేస్తాం! అయినా భయం దేనికి” అంది తల ఎగరేస్తూ కృష్ణవేణి. “వచ్చే మేనేజర్.. నో పర్మిషన్స్, నో సెలవులు” అన్నాడు కాస్త సంతోషంగా భుజాలు ఎగరేస్తూ రామారావు.
“మరీ హ్యాపీ! ఆఫీసులోనే ఉండవచ్చు. ఇంటికన్నా గుడి పదిలం” మధ్యలో కల్పించుకొని వనజ. “సుబ్బారావ్! నువ్వేమీ మాట్లాడవేంటి?” సుబ్బారావు వైపు చూసి రామారావు. “నోర్ముయ్” అన్నాడు సుబ్బారావు.
‘ఎంత మాట అన్నాడు? తోటి ఉద్యోగుల మధ్య అలా అంటాడా?!’ సుబ్బారావు వైపు సీరియస్‌గా చూసాడు రామారావు. “ఇక తినడం ఆపి బుక్ తీసుకొని చదువు, మమ్మీ ఏది? ఎక్కడకెళ్లింది?” గట్టిగా అరిచాడు సుబ్బారావు.. మొబైల్ ఫోన్లో చూస్తూ. ఇంట్లో కెమెరాలు పెట్టి ఫోనులో గమనిస్తూ కంట్రోల్ చేస్తాడు సుబ్బారావు. ఇతనితో శ్రీమతి ఎలా వేగుతోందో అనుకున్నవాళ్లు ఉండరు ఆఫీసులో. “సుబ్బారావు.. ఇయర్ ఫోన్స్ పెట్టుకో!” అన్నాడు సూర్యనారాయణ.
“రెండు రోజుల్లో పరీక్షలు! చిన్నాడు క్రికెట్ బ్యాట్ పట్టుకొని బయటకు పోయాడా! వచ్చి చదవమని చెప్పు. ఓరే.. నువ్వు ఐదో లెస్సన్ తీసి చదువు. సాయంత్రం అడుగుతాను” పక్కవాళ్లతో సంబంధం లేదు. తన లోకంలో తాను ఉన్నాడు సుబ్బారావు. “ఫోను మమ్మీకి ఇవ్వు.. ఏమే టీవీ పెట్టి సీరియల్స్ చూడటం కాదు, వాళ్లను కాస్త చదివించు” వీడియోలోకి వచ్చిన భార్యకు గట్టిగా చెప్పాడు సుబ్బారావు.
“నీ గోల ఏంటి? ఆడ ఉద్యోగం చేయడం లేదా! కెమెరాలు స్విచ్చ్ ఆఫ్ చేయమంటావా?” అవతల నుంచి స్వరం చాలా స్ట్రాంగ్‌గా వచ్చింది.
“ఇయర్ ఫోన్స్ పెట్టుకో.. సుబ్బారావు” ఆమె మాటలు బయటికి వినిపించడంతో మళ్లీ అన్నాడు సూర్యనారాయణ.
“సరే! రోజూ ఆలస్యంగా వచ్చే లేట్ కమ్మర్ వెంకట లక్ష్మి పరిస్థితి ఏమిటో” సూర్యనారాయణ టాపిక్ తమవైపు తిప్పుతూ. “వస్తే రానీండి! మొగుళ్ల కన్నా చండశాసనుడా!?” అంది లక్ష్మి. లంచ్ రూమ్ ఒక్కసారి నిశబ్దంగా మారి పోయింది ఆ మాటకు. అందరూ ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు.
“తప్పు ఏమైనా మాట్లాడానా!?” కన్ఫర్మ్ చేసుకుంది లక్ష్మి. “ఉదయమే వంట చేసుకొని, పిల్లలను స్కూలుకు తయారు చేసి, శ్రీవారికి, పిల్లలకి బాక్స్‌లు సర్ది, ఆఫీసుకు వచ్చి.. మరలా సాయంత్రం ఇంటికి వెళ్లి మళ్లీ వంట చేసి పెట్టాలి” అంది లక్ష్మి.
“అది మీ డ్యూటీ కాదా!” అన్నాడు రామారావు. “డ్యూటీనా! ఆడవాళ్లు అంటే వంటింటికే పరిమితమా!” ఒకేసారి అందరూ అనడంతో రామారావు నోట మాట రాలేదు. “ఏం.. మేం మాత్రం ఉద్యోగాలు చేయడం లేదా? ఉద్యోగం చేసి అలిసిపోయి వచ్చినట్లు బిల్డప్ ఇచ్చే మీకు మంచినీళ్లు అందించి, చేతికి కాఫీ అందించి.. రాత్రికి మీ కోరిక ప్రకారం వండి పెట్టాలి.
మీరు మాత్రం టీవీ చూస్తూ కూర్చుంటారు. మాకు సహాయం చేద్దామని అనిపించదు” అందుకుంది వనజ. “మాకు తలనొప్పి వచ్చినా! మేమే కాఫీ పెట్టుకొని తాగాలి. మాకు నీరసం వచ్చినా మేమే వండుకొని తినాలి. మాపై ఎవ్వరూ సానుభూతి కూడా చూపరు” కల్పించుకొని పద్మ.
“కాఫీ వేడిగా లేదు. పంచదార సరిపోలేదు. కూరలో ఉప్పు తక్కువైంది.. ఎవరు భరిస్తారండి ఆ మాటలు. అరె ఆఫీసుకు టైం అవుతోంది. కాస్త బస్‌స్టాప్ వరకు బైక్‌పై దింపవయ్య మగడా అంటే.. ‘నాకు కుదరదు. నువ్వే ఎలాగో అలాగ వెళ్లు’ అంటాడు నా మొగుడు” అంది కృష్ణవేణి.
“అందేంటి? సూర్యనారాయణ కొత్త మేనేజర్ గురించి మాట్లాడితే.. వీళ్లందరూ భర్తల మీద పడ్డారు” గుమ్మడికాయ దొంగ సామెతలా భుజాలు తడువుకుంటూ లంచ్ హాల్ నుండి నడుస్తూ రామారావు.
“సరదాగా వాళ్ల ఇంటిలోని బాధ చెప్పుకొంటున్నారు. వారి మనసులో ఏమీ దాచుకోరు, సరదాగా ఉంటారు. వాళ్లు ఇంట్లో తిరుగుతూ ఉంటే అదొక అందం. అయినా అది ఆస్వాదించేవారికే తెలుస్తుంది” అన్నాడు సూర్యనారాయణ.
“నువ్వు ఎన్ని చెప్పు సూర్యనారాయణ? ఆడ పిల్లలు అంటే నాకు ఇష్టం ఉండదు. మాకు అబ్బాయి పుట్టాలని తిరగని గుళ్లు లేవు, మొక్కని దేవుడు లేడు. అమ్మాయి పుడుతుందేమోనని చాలా భయపడిపోయాను తెలుసా! ఆ దేవుడు కరుణించి నాకు అబ్బాయే పుట్టించాడు” అన్నాడు రామారావు.
“రామారావు! దేవుడు ఎవరికి పడితే వారికి అమ్మాయిలను పుట్టించడు. దేవుళ్లు అన్నిచోట్ల ఉండలేక అమ్మాయిల రూపంలో పుట్టి అమ్మలుగా మారతారు. పుట్టినప్పటి నుండి మన ఆలనపాలన చూసుకొనేది అమ్మే కదా.. ఆ అమ్మే మన దేవత. కుమార్తె అంటే లక్ష్మీస్వరూపురాలు. తాను ఏ ఇంటిలో నివసించాలో చూసుకొని ఆ కుటుంబానికే అమ్మాయిగా వస్తుంది” రామారావు మాటలకు కాస్త భావోద్వేగానికి గురై.. సమాధానం చెప్పాడు సూర్యనారాయణ.
“నువ్వు ఎన్ని చెప్పు నారాయణ.. నీకు అమ్మాయి కదా! ఏం చేస్తాం.. బెంగ పెట్టుకోక, ఏదో చదివించి పెళ్లి చేసి పంపించు. మా అబ్బాయిని మాత్రం మంచిగా చదివిస్తా! అబ్బాయి కదా మరి” గర్వంగా అన్నాడు రామారావు.
“అయినా.. ఈ రోజుల్లో ఆడమగా తేడా ఏమీ లేదు. అందరూ ఉద్యోగాలు చేస్తున్నారు. పెద్ద పెద్ద పదవులు అలంకరిస్తున్నారు. మన ఆఫీసులో చూడు.. ఎంతమంది ఆడవాళ్లు ఉన్నారు. నువ్వు ఇంకా పాత కాలంలోనే ఉన్నావు రామారావు. ఆడవాళ్లకు మగవాళ్ల కంటే ఓర్పూ, నేర్పూ ఎక్కువ. వాళ్లు ఉన్నచోట చాలా సందడిగా, ఆహ్లాదకరంగా ఉంటుంది. స్త్రీలను తక్కువగా చూడకు” అన్నాడు సూర్యనారాయణ.. వస్తున్న కోపాన్ని ఆపుకొంటూ.
“నేను తక్కువగానే చూస్తాను. ఆడపిల్లలు మనకు బరువు, పెళ్లి చేసేస్తే ఆ బాధ్యత, బంధం అన్నీ తీరిపోతాయి” సీరియస్‌గా అన్నాడు రామారావు.
“యత్ర నార్యస్తు పూజ్యంతే.. అన్నదానికి అర్థం తెలిస్తే నువ్వు ఇలా మాట్లాడవు రామారావు” అన్నాడు.. అంతే సీరియస్‌గా సూర్యనారాయణ.
* * *
రైలు తన ఉనికిని చాటుకుంటూ పరుగులు తీస్తోంది. “అబ్బాయి, కోడలు ఎలా ఉన్నారు? ఏమైనా విశేషమా!?” నాటి జ్ఞాపకాల నుండి బయటికి వస్తూ ఆసక్తిగా అడిగాడు సూర్యనారాయణ. “అబ్బే అదేం లేదు రా..” ఆర్ధోక్తిగా ఆగిపోయి, ఏదో ఆలోచిస్తూ.. “అమ్మాయి, అల్లుడు ఇద్దరూ ఉద్యోగస్తులే కదా!” అన్నాడు రామారావు.
“అవును! ఇద్దరూ ఉద్యోగులే! అప్పుడప్పుడూ వెళ్లి చూసి వస్తున్నాం. రిటైర్ అయిన తరువాత తన దగ్గరికి వచ్చేయమని బాగా గొడవ చేసింది తనూజాత్మజ. కానీ, మేమే వెళ్లలేదు” అన్నాడు సూర్యనారాయణ.
“అమ్మాయి పేరు తనూజ కదా! మరి ఈ ఆత్మజ ఏంటి?” ఆసక్తిగా అడిగాడు రామారావు.
“ఓరోజు మందులు కొనడానికి మందుల దుకాణానికి బయలుదేరాను. జేబు తడిమి చూసుకుంటే.. ఉద్యోగం చేసే రోజులలో అయితే వందలు, ఐదు వందలు నోట్లు ఉండేవి. రిటైర్ అయిన తరువాత జేబులో ఇరవై, యాభై రూపాయలు మాత్రమే కనిపిస్తున్నాయి. మనలాంటి ప్రైవేటు ఉద్యోగస్తులకు వచ్చే అరకొర పెన్షన్ కోసం ఆశపడటం అత్యాశే అవుతుంది. సరే.. ఏదైనా ఉద్యోగం వెతుక్కుంటే బాగుంటుందని ఆలోచిస్తున్నాను.
అప్పుడే నా ఫోన్ రింగ్ అయ్యింది. ఆలోచనల నుండి బయటికి వచ్చి ఫోన్ తీసాను. మా తనూజ.. తనతో మాట్లాడుతూ ఉంటే.. ‘నాన్నా! నీకు ఆత్మాభిమానం ఎక్కువ. కూతురిని డబ్బులు అడగడం ఏమిటని అనుకుంటావు. కూతురు అయినా కొడుకు అయినా నేనే కదా! కన్న తల్లితండ్రుల బాధ్యత కొడుకులకే కాదు.. కూతుళ్లకూ ఉంటుంది. నాకు పెళ్లి చేసి పంపినంత మాత్రాన పరాయిదాన్ని కాదు! మిమ్మల్ని చూసే బాధ్యత నాకూ ఉంది.
మీ ఆరోగ్యం జాగ్రత్త’ అంటూ ఫోన్ పెట్టేసింది. చూస్తే.. నా బ్యాంకు అకౌంట్లోకి అమౌంట్ వచ్చినట్లుగా మొబైల్ సందేశం వచ్చింది. ‘ఆత్మజ’ అంటే కూతురు, నా ముందు పెద్దగా మాటలు ఆడని నా అంతరాత్మ ఒక ఆత్మీయునిలా ఎంత పెద్దగా మాట్లాడింది. అందుకే.. ముద్దుగా తనూజాత్మజ అంటున్నాను” ఆనాటి విషయం గుర్తుకు తెచ్చుకొని, కళ్లజోడు తీసి చెమ్మగిల్లిన కళ్లు తుడుచుకుంటూ సూర్యనారాయణ.
“చాలా మంచి పేరు పెట్టావు సూర్యనారాయణ. మా వియ్యపురాలికి మోకాలు ఆపరేషన్ ఉంది. అబ్బాయి రమ్మంటే వెళ్లుతున్నాం. ఆ.. మా అబ్బాయి ఈ మధ్య కారు కొన్నాడు. స్టేషన్‌కి వచ్చి మమ్మల్ని రిసీవ్ చేసుకుంటాడు. మీరు క్యాబ్ బుక్ చేసుకొని వెళ్లాలి అనుకుంటా” కొడుకు గూర్చి చెబుతూ ఫోన్ రింగ్ అవ్వడంతో జేబు నుండి ఫోన్ తీసి.. “మా అబ్బాయి ఫోన్ చేస్తున్నాడు” అంటూ సీటులోంచి లేచి డోరు వద్దకు వెళ్లాడు రామారావు.
* * *
భార్య లేపడంతో మెలకువ వచ్చి చుట్టూ చూసాడు సూర్యనారాయణ. “అప్పుడే వచ్చేసిందా! రామారావు ఫ్యామిలీ ఎక్కడ?” అన్నాడు చుట్టుపక్కల చూస్తూ భార్యతో. “వాడు ఎప్పుడూ ఇంతే! చెప్పను కూడా చెప్పడు” అనుకుంటూ, లగేజీ తీసి తన బెర్త్ మీద పెడుతుంటే.. మడిచి పెట్టి ఉన్న తెల్ల కాగితం కనిపించింది. అది చూసి జేబులో పెట్టుకొని, తమ కోసం వచ్చిన అతనితో కారులో బయలుదేరారు సూర్యనారాయణ మూర్తి, అతని భార్య. మధ్యదారిలో గుర్తుకు వచ్చి.. జేబు నుండి కళ్లజోడు తీసి, మడిచిపెట్టుకొన్న పేపరు విప్పి చూసాడు.
‘సూర్యనారాయణ, నన్ను క్షమించరా! నీకు అమ్మాయి పుట్టిందని, నాకు అబ్బాయి పుట్టాడని చాలా గొప్పగా మాట్లాడేవాణ్ని. నిన్ను చాలా చిన్నచూపు చూసాను. రోజూ ఆఫీసులో మా అబ్బాయి గురించి గొప్పలు చెబుతూ ఉంటే.. నువ్వు మౌనంగా ఉండేవాడివి. చిన్నతనంలో మీ అమ్మాయి మన ఆఫీసుకు వచ్చినప్పుడు కూడా చులకనగానే మాట్లాడేవాణ్ని. మరి నా బుద్ధే అంత అనుకుంటా!
‘కుమార్తె ఆస్తి కాదు.. ఒకరికి బదిలీ చేయడానికి. ఆమె కుటుంబానికి దక్కిన ఆశీర్వాదం. పుట్టింటి బంధం.. శాశ్వతం!’ అని నువ్వు అన్న మాటల్ని నేను కొట్టి పారేసాను. ‘స్త్రీలకు దేవుడిచ్చిన శక్తి ఎక్కువ. వారు మన ఇంటిని స్వర్గంగా మారుస్తారు’ అని నువ్వు గర్వంగా చెబుతున్నప్పుడు.. నా కళ్లు, చెవులు మూసుకుపోయాయి.
మీ అమ్మాయి పెళ్లికి డబ్బులు అప్పు అడిగినా కావాలనే నేను సహాయం చెయ్యలేదు. ఎందుకో నాకు, నా భార్యకు అబ్బాయిలంటేనే ఇష్టం. ఆడపిల్లలు మనకు భారం అవుతారని ఒక ఇదిలో ఉండిపోయాం. నీ కూతురు గురించి గొప్పగా చెపుతుంటే.. నాకు కన్నీళ్లు ఆగలేదు. నా కొడుకుని చిన్నప్పటి నుండి ఎంతో గారాబంగా పెంచాం. ఏలోటూ రాకుండా అన్నీ చూసుకున్నాం. వాడికోసం రేయీపగలు కష్టపడ్డాం కానీ.. ‘నిజాన్ని ఒప్పుకోవడానికి ధైర్యం కావాలి.. పుత్రుడు అంటే శారీరక వారసుడు మాత్రమే కాదు’ అన్న నీ మాటలు వేదవాక్కులుగా స్ఫురిస్తున్నాయి. నిజం చెప్పాలంటే మా అబ్బాయి నుండి మేము ఆశించిన ప్రేమ, ఆప్యాయత పొందడం లేదు.
నా మొహం చూపించలేక, నువ్వు నిద్ర లేచేలోపు మేము వేరే కంపార్టుమెంట్కి వెళ్లిపోతున్నాం. నన్ను క్షమించరా.. సూర్యనారాయణ! ‘మా అబ్బాయి కారు తీసుకొని రైల్వే స్టేషన్‌కు వస్తున్నాడు. కానీ, మమ్మల్ని తీసుకొని వెళ్లడానికి కాదు. తనూజాత్మజ తల్లిదండ్రులకు స్వాగతం చెప్పడానికి. మీ అమ్మాయి తనూజ మా అబ్బాయికి మేనేజరుట. మీరు వస్తున్న విషయం తెలుసుకొని మా అబ్బాయి మీ కోసం వస్తున్నాడు.
మమ్మల్ని క్యాబ్ బుక్ చేసుకొని రమ్మని ఫోన్ చేసి చెప్పాడు. మా అబ్బాయి మీద ఉన్న ప్రేమతో ఆ భగవంతుడ్ని నేను ఒకటే కోరుకుంటున్నాను.. ఆ దేవుడు కరుణిస్తే మా అబ్బాయికి అమ్మాయి పుట్టాలని. వాడు మాలాగా బాధపడకూడదని ఆశిస్తున్నానురా. ఇంకా చాలా రాయాలని ఉన్నా.. చేతులు వణుకుతూ పెన్ను కదలడం లేదు. మా అబ్బాయిలాగే ఇది కూడా మొరాయిస్తోంది. ఈ లేఖతోపాటు డబ్బులు ఉంచాను. ఈ డబ్బులు మన అమ్మాయి ‘తనూజాత్మజ’కు నేను ఇచ్చానని చెప్పు.
– నీ రామారావు.
కుటుంబ నేపథ్యంలో రచనలు రాస్తుంటారు రచయిత్రి వింజమూరి శ్రీవల్లి. వీరి స్వస్థలం కాకినాడ. బీకాం చదివారు. తల్లిదండ్రులు వింజమూరి కృష్ణవేణి-వెంకట రామశాస్త్రి. అక్క సంగీత, అన్న కృష్ణకాంత్ ప్రోత్సాహంతో చిన్నప్పటి నుంచే కథలు, కవిత్వం మొదలు పెట్టారు. తనదైన శైలిలో కొన్ని కథలు రాశారు. భర్త మైలవరపు భాస్కర్ సూచన మేరకు మొట్టమొదటిగా ఈ కథను నమస్తే తెలంగాణ-ముల్కనూరు సాహితీపీఠం కథల పోటీకి పంపారు. రూ.2వేల బహుమతిని అందుకున్నారు.
– వింజమూరి శ్రీవల్లి
83094 13383