చిన్న కుదుపుతో కారు ఆగిపోయింది. ఏదో ఆలోచిస్తూ, కారు స్టీరియోలో పాటలు వింటున్న రజనీశ్ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. తేరుకొని, తేరిపార చూసేసరికి.. బోనెట్ తీసి, ఇంజిన్‌ను పరీక్షిస్తున్న డ్రైవర్ ముజీబ్ కనిపించాడు.
విసుగ్గా కారు దిగాడు రజనీశ్.
‘ఆఫీస్ పనులతో అలసిపోయి ఇంటికెళ్తుంటే ఈ అవాంతరం ఒకటి’ అనుకున్నాడు.
“ఏమైంది?” డ్రైవర్‌ను విసుగ్గా అడిగాడు.
“చిన్న రిపేర్ సార్! పది నిమిషాల్లో అయిపోతుంది అంతే. పక్కనే గ్యారేజీ ఉంది..” నసుగుతూ అన్నాడు ముజీబ్.
“సరే! నేను ఆటోలో ఇంటికెళ్లిపోనా?”.
“అవసరం లేదు సార్. పది నిమిషాలంతే! మీరెళ్లి ఆ బట్టల షాప్‌లో కూర్చోండి” అంటూ, కారును గ్యారేజీ వైపు నెట్టసాగాడు ముజీబ్.
రజనీశ్ అసహనంగా పేవ్‌మెంట్‌పై నిలబడ్డాడు.
జోరీగల్లా వేగంగా కదిలే వాహనాలు. లోకంలో పని మొత్తం తమకే ఉన్నట్లు.. టెన్షన్ నిండిన
మొఖాలతో రివ్వున దూసుకెళ్తున్నారు వాహన
దారులు. ఖాళీ ఆటో ఒక్కటీ రావడం లేదు. పైగా ఆకాశం అప్పటికే దట్టంగా మబ్బులు పట్టింది. ఏ క్షణంలోనైనా జడివాన ప్రారంభం కావచ్చు.
“మీరు.. నువ్వు.. రజనీ కదూ?”.
గళ్ల చొక్కా, కాటన్ ప్యాంటు, చేతిలో కారియర్ బ్యాగ్‌తో.. సంభ్రమాశ్చర్యాలు నిండిన మొఖంతో తనను ప్రశ్నించిన నలభై ఐదేళ్ల శాల్తీ వంక ప్రశ్నార్థకంగా చూశాడు రజనీశ్. రెండు నిమిషాల తరువాత అతణ్ని గుర్తుపట్టాడు.
“సుందరం.. నువ్విక్కడ!” ఆశ్చర్యంతో అడిగాడు రజనీశ్.
పదో తరగతి దాకా తిరుపతి ప్రకాశం పంతులు మున్సిపల్ హైస్కూల్లో తన క్లాస్మేట్ సుందరం. బాగా చదివేవాడు. టెన్త్ క్లాస్‌లో స్కూల్ టాపర్. తానుమాత్రం సెకండ్ క్లాస్‌లో పాసై, ఆ తరువాత డొనేషన్ కట్టి ఇంజినీరింగ్‌లో చేరాడు. ఆ పిమ్మట భారీ నజరానా సమర్పించుకొని, గవర్నమెంట్ ఇంజినీరింగ్ శాఖలో వర్క్ ఇన్స్పెక్టర్గా చేరాడు. అంచెలంచెలుగా ఎదిగి, ప్రస్తుతం డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ స్థాయిలో ఉన్నాడు. ఈమధ్యే తాను పుట్టి పెరిగిన తిరుపతికి బదిలీ మీద వచ్చాడు.
“నేను సెరీకల్చర్ డిపార్ట్మెంట్లో సీనియర్ అసిస్టెంట్‌గా ఉన్నాను. మా ఇల్లు ఇక్కడికి దగ్గరే! రా వెళ్దాం”.. రజనీశ్తో కరచాలనం చేసి, నవ్వుతూ చెప్పాడు సుందరం.
“కారు పాడైంది. ఆటో కోసం చూస్తున్నాను” అన్నాడు రజనీశ్.
అప్పుడే టపటపా చినుకులు మొదలయ్యాయి.
“అరే! వర్షం కూడా వస్తోంది. రా.. మా ఇంట్లో కూర్చుని కాఫీ తాగేంతలోగా కారు రిపేర్ అవుతుంది” అన్నాడు సుందరం.
రజనీశ్ ఆలోచించాడు. ఇంటికెళ్లి చేసేదేమీ లేదు. దసరా పండగకు తన భార్య ఇద్దరు పిల్లలను తీసుకొని పుట్టింటికి వెళ్లింది. ఇంట్లో ఒక్కడే ఉన్నాడు.
“సరే పద” అన్నాడు రజనీశ్. సుందరం అతని పక్కనే నడుస్తూ ఏవో కబుర్లు చెప్పసాగాడు.
ఒక విశాలమైన కాంపౌండ్‌లో అగ్గిపెట్టెల్లాంటి ఆరు ఇండ్లు. ఒక్కో ఇంటిలో ఒక వరండా, హాల్, వంట గది, మరొక బెడ్రూమ్. ఇంటి ఆవరణలోనే బాత్రూములన్నీ కామన్‌గా ఉన్నాయి. ఆ పోర్షన్లలోనే ఒక ఇంటిలో సుందరం ఉంటున్నాడు. అలికిడి విని ఒక మహిళ వంటింట్లోంచి వచ్చింది.
“నా భార్య విమల” అంటూ పరిచయం చేశాడు సుందరం. అంతలోనే, లోపలి గదిలో చదువుకుంటున్న సుందరం కూతురు లత కూడా హాల్లోకి వచ్చి, రజనీశ్కు నమస్కరించింది.
“అమ్మాయి లత. గవర్నమెంట్ ఉమెన్స్ కాలేజీలో బీఏ ఫైనల్ ఇయర్ చదువుతోంది. అబ్బాయి బాలు ట్యూషన్‌కు వెళ్లాడు” అన్నాడు సుందరం.
రజనీశ్కు ఆ ఇంట్లో నాలుగు కుర్చీలు, టేబులు, టీవీ తప్ప ఫర్నిచర్ ఏమీ కనిపించలేదు.
“అబ్బాయి ఏం చదువుతున్నాడు?” క్యాజువల్‌గా అడిగాడు.
“ఎంసెట్‌లో ఇంజినీరింగ్ సీటు రాలేదు. బీఎస్సీలో చేరాడు. కంప్యూటర్ కోర్సు కూడా చేస్తున్నాడు” చెప్పాడు సుందరం.
ఇంతలో విమల కాఫీ తెచ్చి ఇద్దరికీ ఇచ్చింది. రజనీశ్ కుటుంబ వివరాలడిగాడు సుందరం.
“మిసెస్ చంద్రకళది నెల్లూరు. అబ్బాయి గోపి. హైదరాబాద్‌లోని ఎల్లారెడ్డి కాలేజీలో బీటెక్ చదువుతున్నాడు. అమ్మాయి సుమను ఈ మధ్యే యాభై లక్షలు డొనేషన్ కట్టి, దావణగేరెలో ఒక ప్రైవేట్ కాలేజీలో చేర్చాను”.. దర్పంగా చెప్పాడు రజనీశ్. ఇంతలో అతని డ్రైవరు నుంచి ఫోను వచ్చింది. కారు రిపేరైందని చెప్పడంతో, సుందరం ఇంటి గుర్తులు చెప్పి.. అక్కడికి రమ్మన్నాడు రజనీశ్.
తన ఇంటి అడ్రస్ చెప్పి, ఆదివారం ఉదయం తప్పక తమ ఇంటికి రావాలని, చెప్పి సుందరం దగ్గర సెలవు తీసుకున్నాడు రజనీశ్.
ఆదివారం ఉదయం రజనీశ్ ఇంటికి వెళ్లాడు. లగ్జరీ అపార్ట్మెంట్స్ నాలుగో అంతస్తులోని ఫ్లాట్ ముందు నిలబడి, సందేహిస్తూనే కాలింగ్ బెల్ నొక్కాడు సుందరం. రజనీశ్ ఆఫీస్‌లో పనిచేసే వాచ్‌మన్ గంగులు తలుపు తీసి, సుందరాన్ని సోఫాలో కూర్చోమన్నాడు. ఆదివారం ఆఫీసు సెలవు కాబట్టి రజనీశ్ ఇల్లు శుభ్రం చేయడానికి వచ్చాడు గంగులు. ఖరీదైన ఫర్నిచర్‌తో పాటు, గోడకు తైలవర్ణ చిత్రాలు, మలేషియా రోజ్‌వుడ్‌తో తయారైన డైనింగ్ టేబుల్, షాండ్లియర్.. ఇలా అణువణువునా అరిస్టోక్రసీ నిండిన ఆ ఫ్లాట్ సౌందర్యాన్ని ఆశ్చర్యంతో తిలకించాడు సుందరం.
ఇంతలో స్నానం చేసి, టవల్‌తో తల తుడుచుకుంటూ హాల్లోకి వచ్చిన రజనీశ్..
“ఓ! నువ్వా సుందరం ఎంతసేపైంది వచ్చి” అంటూ పలకరించాడు.
“కాసేపు కూర్చో.. తయారై వస్తాను” అంటూ ఇంట్లోకి వెళ్లిపోయాడు.
గంగులు తెచ్చిచ్చిన కాఫీ తాగి, టీపాయ్‌పై ఉన్న పేపరు చదువుతూ సుందరం కాలం గడిపాడు.
ఈసారీ ఖరీదైన కుర్తా, పైజమాతో హాల్లోకి వచ్చాడు రజనీశ్. చేతిలో ల్యాప్‌టాప్ ఉంది. సుందరంతో మాట్లాడుతూనే షేర్మార్కెట్లో వివిధ షేర్ల ధరవరలు గమనిస్తూ ఉన్నాడు.
“ఈ ఇన్ఫ్రా షేర్లు ఇలా తాచుపాములా ఎగబాకుతుంటే ఈ ఫార్మాషేర్లు ఏమిటిలా డౌన్ ట్రెండ్‌లో ఉన్నాయి? ఔను సుందరం.. నువ్వు షేర్లలో ఏ మాత్రం ఇన్వెస్ట్ చేశావు?” అని అడిగాడు రజనీశ్.
సుందరం నేలచూపులు చూశాడు.
“సుందరం.. నువ్వు తెలివైనవాడివి. నాకంటే కూడా! టెన్త్‌లో నువ్వు స్కూల్ టాపర్‌గా నిలిస్తే, నేను సెకండ్ క్లాస్‌లో పాసయ్యాను. మా నాన్న తెలివిగా డొనేషన్ కట్టి నన్ను ఇంజినీరింగ్‌లో చేర్చాడు. అందుకే, నేను ఇప్పుడు ఈ స్థానంలో ఉన్నాను. ఇకనైనా మేలుకో! అప్పో, సప్పో చేసైనా, అబ్బాయికి డొనేషన్ కట్టి ఇంజినీరింగ్‌లో చేర్పించు. ఈ కాలంలో అందరూ గౌరవించేది నీ స్టేటస్‌నే. నువ్వెంత నిజాయతీగా ఉన్నావన్నది ముఖ్యం కాదు. నువ్వు ఎంత సంపాదించావన్నదే అందరూ చూస్తారు.. ” అన్నాడు రజనీశ్ దర్పంగా.
సుందరానికి ఆ మాటలు చికాకు కలిగించాయి.
“డొనేషన్స్ కట్టడానికి నేను విరుద్ధం. మావాడు కూడా డొనేషన్ కట్టి ఏ కోర్సులో చేరడానికి ఒప్పుకోడు” అన్నాడు సుందరం బింకంగా.
రజనీశ్ పెద్దపెట్టున నవ్వాడు.
“ఈ విలువలు అన్నీ నీకు కూడు పెట్టవు. పిల్లలకేం తెలుసు? కావాలంటే నా దగ్గర రెండు,
మూడు లక్షలైనా అప్పు తీసుకో. చాలామంది నెలకు ఐదు రూపాయల వడ్డీలకు అప్పులిస్తుంటారు. కానీ, నువ్వు నా మిత్రుడివి కాబట్టి మూడు రూపాయల వడ్డీకే ఇస్తాను” అన్నాడు.
లంచాల రూపంలో నెలవారీగా తనకు వచ్చే అదనపు ఆదాయాన్ని రజనీశ్ నమ్మకస్తులైన వారికి అప్పులిస్తుంటాడు. వడ్డీల రూపంలో అతనికి నెలనెలా బోలెడంత ఆదాయం వస్తుంటుంది. సుందరంలాంటి భయస్థుడు, నిరాడంబర జీవికి అప్పిస్తే.. కచ్చితంగా తనకు వడ్డీతో కలిపి తిరిగిస్తొందని రజనీశ్కు తెలుసు. కాబట్టే, ఈ ఆఫర్ ఇచ్చాడు.
ఎన్నో ఏండ్ల తరువాత కలిస్తే, కుటుంబ విషయాలు, చిన్ననాటి విషయాలూ మాట్లాడుకోకుండా.. కేవలం ఆర్థిక అంశాలు మాత్రమే రజనీశ్ మాట్లాడటం సుందరానికి నచ్చలేదు.
“సరే! మీ ఆవిడ, పిల్లలు ఊరినుంచి ఎప్పుడు తిరిగొస్తారు? మీ నాన్నగారెలా ఉన్నారు?”.. టాపిక్ మారుస్తూ అడిగాడు సుందరం.
“రెండు రోజుల్లో మా ఆవిడ, పిల్లలు తిరిగొస్తారు. నాన్నగారి ఆరోగ్యం అంత బాలేదు. షుగరు, బీపీ ఉన్నాయి. డబ్బు ఏళ్లు దాటింది కదా! ఆరు నెలలు అన్నయ్య దగ్గర, ఆరు నెలలు నా దగ్గరా ఉంటారు. రెండు రోజుల క్రితమే గుంటూరులో ఉండే మా అన్నయ్య ఫ్యామిలీతో కలిసి కేరళలో పద్మనాభస్వామి ఆలయ దర్శనానికి వెళ్లారు. నేను వద్దంటున్నా వినకుండా, మా నాన్నగారు కూడా వాళ్లతో వెళ్లారు. వాళ్లూ మరో మూడు రోజుల్లో ఇక్కడికొచ్చి, నాన్నగారిని దింపి గుంటూరు వెళ్లిపోతారు” చెప్పాడు రజనీశ్.
“సరే ఆయనను చూడ్డానికి మళ్లీ వస్తాను. ఇక వెళ్తా.. అమ్మాయిని సంగీతం క్లాసు దగ్గర దింపిరావాలి. ప్రతి శని, ఆదివారాలు తనకు మ్యూజిక్ క్లాస్ ఉంటుంది” అన్నాడు సుందరం.
“సుందరం.. నామాట విని వెంటనే పిచ్చుకగూడు లాంటి ఆ ఇల్లు ఖాళీ చేసి ఏ అపార్ట్‌మెంట్‌లోనో చేరు. మా అపార్ట్మెంట్స్ చూడు. డాక్టర్లు, ఇంజినీర్లు, పెద్దపెద్ద వ్యాపారులు ఇలా మంచి పొజిషన్స్‌లో ఉన్నవాళ్లే ఉంటారు. మనకు వారితో కలిసి ఉండటం రాయల్‌గా ఉంటుంది. నాకైతే మీ ఇంటి పోర్షన్లలో ఉన్నవాళ్లంతా చిన్నచిన్న పనులు చేసుకొనే అలగా జనంలాగా కనిపించారు. ఆ ఇల్లు వెంటనే ఖాళీ చేసి, మరో మంచి లొకాలిటీలో చేరు. అలగా వారితో ఉంటే.. పిల్లలకూ అలగా బుద్ధులే వస్తాయి” అన్నాడు రజనీశ్.
సుందరం ఏమీ మాట్లాడకుండా రజనీశ్కు షేక్హేండ్ ఇచ్చి, అక్కడినుంచి బయల్దేరాడు.
తమ ఇంటి వద్ద ఉండే నాలుగురోడ్ల కూడలిలో షేర్ ఆటో కోసం నిలబడ్డాడు సుందరం. పది రూపాయలిస్తే చాలు, షేర్ ఆటోవాలా సుందరాన్ని తన ఆఫీసు సమీపంలో కూడలి వద్ద దింపేస్తాడు. ఆరోజు అటువైపుగా వచ్చే షేర్ ఆటోలన్నీ జనంతో కిటకిటలాడుతూ ఉన్నాయి. తమ ఆఫీసు సమీపంలోని అమ్మవారి గుడిలో ఆ రోజేదో జాతర జరుగుతుందన్న విషయం గుర్తొచ్చింది సుందరానికి. అప్పుడే సుందరం పక్కన ఓ కారు వచ్చి ఆగింది. వెనుక సీట్లో రజనీశ్‌ను గమనించాడు సుందరం.
“రా సుందరం.. నిన్ను ఆఫీసు దగ్గర దింపేసి, అట్నించటే నా ఆఫీసుకు వెళ్తా” అన్నాడు రజనీశ్.
తత్తరపడ్డాడు సుందరం.
“వద్దులే రజనీ! కాసేపు వెయిట్ చేస్తే షేర్ ఆటో వస్తుంది. నీకెందుకు శ్రమ” నసిగాడు సుందరం.
“ఇందులో శ్రమేముంది. ఎటూ నేను మీ ఆఫీసు పక్కే వెళ్తున్నాను” అని డోర్ తెరవడంతో, సుందరానికి కార్లో ఎక్కి రజనీశ్ పక్కన కూర్చోక తప్పలేదు.
“చూడు సుందరం! ఇన్నేళ్లొచ్చినా, నువ్వు షేర్ ఆటోలో ప్రయాణిస్తూ ఉంటే నీ పరువేం కానూ? అలగా జనం పక్కనే కూర్చుని ఆఫీసుకు వెళ్తావా? నామాట విని ఏ స్కూటరో, బైకో కొనుక్కో. కారు కొంటే ఇంకా మంచిది. షేర్ ఆటోలలో వెళ్తూ ఉంటే మనకు షేర్ ఆటో బుద్ధులే అలవాటు అవుతాయి” అన్నాడు రజనీశ్.
సుందరానికి తల కొట్టేసినట్టు అయ్యింది. మౌనంగా కూర్చుని తన ఆఫీసు వద్ద కారు దిగి, రజనీశ్కు ‘థాంక్స్’ చెప్పి వెళ్లిపోయాడు సుందరం.
అర్ధరాత్రి ఫోన్ మోగడంతో ఉలిక్కిపడి లేచి, లిఫ్ట్ చేశాడు సుందరం.
“సుందరం.. నేను రజనీని”.
స్నేహితుని గొంతులో కంగారు విని ఉలిక్కిపడ్డాడు సుందరం.
“సుందరం.. మా నాన్నగారు చనిపోయారు” వణుకుతున్న గొంతుతో చెప్పాడు రజనీశ్.
“అరే! ఎంత పని జరిగింది. మొన్ననే కదా మీ అన్నయ్య వాళ్లతో కలిసి కేరళ వెళ్లారు. ఇంతలోనే ఇలా ఎలా?” ఓదార్పుగా అడిగాడు సుందరం.
“కేరళ నుంచి వచ్చిన తర్వాత నాన్నను ఇంట్లో దింపి, అన్నయ్య వాళ్లు వెళ్లిపోయారు. అక్కడికి వెళ్లొచ్చినప్పటి నుంచీ ఆయన ఆరోగ్యం బాగా లేదు. తీవ్రమైన జ్వరం, చలి, గొంతునొప్పి, ఆయాసం ఎక్కువ కావడంతో నాలుగు రోజుల క్రితం శ్రీనివాస నర్సింగ్ హోమ్‌లో చేర్చాం. ఆయన జ్వర లక్షణాలు డాక్టర్లకు కూడా అంతుబట్టలేదు. నిఫా ఫీవరేమోనని అనుమానించారు. ట్రీట్మెంట్ ఏమీ పనిచేయక సాయంత్రం పదింటికి ఆయన చనిపోయారు”.
“నాతో మాట మాత్రమైనా చెప్పలేదు. నీకు సాయంగా హాస్పిటల్‌కు వచ్చి ఉండేవాడిని కదా!” అన్నాడు సుందరం ఆందోళనగా.
“నాన్న శవాన్ని మా అపార్ట్‌మెంట్‌కు తీసుకొచ్చాం. అన్నయ్యవాళ్లు తెల్లవారుజామున ఇక్కడికి చేరుకుంటారు. ఢిల్లీలోని మా చెల్లాయి ఫ్లయిట్లో వచ్చేసరికి రేపు మధ్యాహ్నం అవుతుంది. బంధువులందరూ వచ్చి చూసివెళ్లాక రేపు సాయంత్రం నాలుగింటికి దహన సంస్కారాలు చేయాలనుకుంటున్నాం” అన్నాడు రజనీశ్.
“అలాగే చేయి. నేను రేపు లీవు పెట్టి నీకు తోడుగా ఉంటాను” అన్నాడు సుందరం.
“అదికాదు సుందరం. ఇక్కడ మిగతా ఫ్లాట్ల వాళ్లంతా వెంటనే శవాన్ని తీసుకెళ్లిపొమ్మని గొడవ చేస్తున్నారు. నాన్నగారు ఏ అంటువ్యాధితోనో మరణించారని అనుకుంటున్నారు. నాకేం చేయాలో తోచడం లేదు” టెన్షన్‌గా అన్నాడు. రజనీశ్.
సుందరం రెండు క్షణాలు ఆలోచించాడు.
“నువ్వేం కంగారు పడకు. వెంటనే ‘వైకుంఠ రథం’ లాంటి వ్యాన్‌లో శవాన్ని మా ఇంటికి తెచ్చెయ్యి. నాన్నగారి బాడీని ఇక్కడే ఉంచుదాం. మీ వాళ్లందరూ వచ్చాక శాస్ర్తోక్తంగా దహన సంస్కారాలు నిర్వహిస్తాం” అన్నాడు సుందరం.
“మరి మీ చుట్టుపక్కల వాళ్లూ..” అనుమానంగా అడిగాడు రజనీశ్.
“ఆ విషయాలన్నీ నేను చూసుకుంటాను. మా ఇల్లు తెలుసు గదా, నేనిక్కడ ఏర్పాట్లు చేస్తాను”.
సుందరం వెంటనే భార్యను, పిల్లలను నిద్రలేపి, పక్క గదిలోకి వెళ్లిపొమ్మన్నాడు. పక్క పోర్షన్లో వంట పనిచేసే సెల్వాన్ని సాయంగా పిలిచాడు.
సెల్వం ఒక చెక్క బెంచీని వరండాలో వేసి, దాన్ని బాగా తుడిచి, దానిపై గుడ్డ వేశాడు. సుందరం భార్య విమల ఫ్రిజ్‌లోంచి కొన్ని గులాబీలు, మల్లెలు తీసి చిన్న మాల తయారుచేసి ఇచ్చింది. ఈ లోగా సుందరం బెంచీ పక్క ఒక చాప, కుర్చీలు వేశాడు. సెల్వం తన ఇంటిలోంచి నాలుగు కుర్చీలు తెచ్చి, వచ్చిన వారు కూర్చునేందుకు వీలుగా వరండాలో వేశాడు.
ఈలోగా రాఘవరావు గారి శవం ఉన్న వాహ నం సుందరం ఇంటి బయట ఆగింది. శవాన్ని జాగ్రత్తగా తీసుకు వచ్చి బెంచీపై పడుకోబెట్టారు. దుప్పటి కప్పారు. రాఘవరావు పార్థివదేహానికి నమస్కరించి పూలమాల వేశాడు సుందరం.
రాత్రంతా రాఘవరావుగారి పార్థివదేహం పక్క నే రజనీశ్, సుందరం ఇద్దరూ జాగారం చేశారు. శవం తలవద్ద ఉంచిన దీపంలో నూనె పోస్తూ దీపం ఆరిపోకుండా చూశాడు సుందరం. ఉదయానికి విషయం చుట్టుపక్కల పోర్షన్లకు పాకింది. ఎవ్వరూ పిలవకుండానే సుందరానికి సహాయం చేయడానికి మిగిలిన పోర్షన్లవారు ముందుకొచ్చారు.
శ్రీరాముడి గుడిలో పూజారిగా పనిచేసే ప్రసాదశర్మ, బంధువులందరి సమక్షంలో రాఘవరావు గారి ఆత్మశాంతి కోసం పార్థివదేహం వద్ద నారాయణస్తోత్రం చదివారు. ఆయనే అపరకర్మలు చేసే శంకరశాస్త్రిని పిలిపించారు. సుందరం పక్క
పోర్షన్లో ఉండే క్షురకుడు ఓబులేసు, మేళతాళాల వారిని ఆగమేఘాల మీద రప్పించాడు. సుందరం, కొడుకు బాలుతో కలిసి వచ్చిన అతిథులు కూర్చునేందుకు వీలుగా ఇంటి వసారాలో షామియానా, కుర్చీలు వేయించాడు. వచ్చే అతిథులకు మంచినీళ్లూ, కాఫీ, టీలు సరఫరా చేస్తూ సుందరం భార్య విమల, కూతురు లత బిజీగా ఉన్నారు. వాటర్ క్యాన్లూ, డ్రమ్ముల ఏర్పాట్లూ జరిగిపోయాయి. ఉదయానికల్లా రజనీశ్ అన్నయ్య కుటుంబం గుంటూ రు నుంచి దిగింది. వచ్చిన బంధువులు రజనీశ్కు ఫోన్ చేసి, సుందరం అడ్రస్ తెలుసుకొని అక్కడికి చేరుకుంటున్నారు. వచ్చిన వారందరికీ భోజనం తమ ఇంట్లోనే తయారు చేస్తున్నాడు సెల్వం. మధ్యాహ్నం మూడింటికి తిరుపతిలో ఫ్లయిట్ దిగిన రాఘవరావు గారి అమ్మాయి అనితని సుంద రం కొడుకు బాలు, రజనీశ్ కొడుకు గోపి వెళ్లి ఇంటి కి తోలుకొచ్చారు. ఆమె భోరున విలపిస్తుంటే.. సుందరం భార్య, కూతురు ఓదార్చారు. శంకర శాస్త్రి శాస్ర్తోక్తంగా మంత్రాలు జపించి, పూజ చేశాక, బంధుమిత్రులు దారి పొడవునా పూలు చల్లుతూ వుంటే రాఘవరావు గారి పార్థివదేహాన్ని శ్మశానానికి తరలించారు. దహనక్రియలు ముగిశాక, రాఘవరావు గారిని స్మరించుకుంటూ రజనీశ్, అతని సంబంధికులు సుందరం ఇంటికి చేరి, స్నానాదికాలు ముగించారు. వచ్చిన వారంతా ఒకరొకరిగా సెలవు తీసుకున్నారు.
సుందరం చేతులు పట్టుకొని.. “సుందరం! ఆపద సమయంలో తోడుగా నిలిచి అసలైన స్నేహితుడివని అనిపించుకున్నావు. మీవి షేర్ఆటో బతుకులని ఎగతాళి చేసిన నాకు కనువిప్పు కలిగించావు. ఒక మనిషి గొప్పతనం అతను నివసించే ఇంటిలో కానీ, తిరిగే కారులో కానీ ఉండదనీ మనసులోనే ఉంటుందనీ నాకు తెలియజెప్పావు” అన్నాడు రజనీశ్ గద్గదికంగా.
“నేను నీకు చేసింది చిన్న సాయమే రజనీ! స్నేహితుడిగా అది నా బాధ్యత” అని చిరునవ్వు నవ్వాడు సుందరం.
-రాచపూటి రమేశ్, 98667 27042