ఆర్థిక వృద్ధే కాదు వన్యప్రాణుల వృద్ధీ అవసరమేనని నేటి అభివృద్ధి అజెండా. పర్యావరణ సమతుల్యత, వన్యప్రాణి సంరక్షణ మానవ మనుగడకు అవసరమేనని ఆలస్యంగానైనా గుర్తించాం. ఈలోగా జరగరాని నష్టం జరిగిపోయింది. కొన్ని జాతులు అంతరించాయి. మరికొన్ని జాతుల మనుగడ ప్రశ్నార్థకమైంది. ఈ సందర్భంలోనే అరుదైన వన్యప్రాణులతో అభయారణ్యాలను నింపాలనే సంకల్పంతోనే వన్యప్రాణుల పరస్పర మార్పిడి జరుగుతున్నది.
రైనో విజన్ 2020, ఖడ్గమృగాల పునరావాస పథకం ద్వారా అంతరించిన ఖడ్గ మృగాలను ఈశాన్య భారత దేశంలోని అరణ్యాలలో మళ్లీ ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. వన్యప్రాణుల పరస్పర మార్పిడిలో భాగంగా ఇతర ప్రాంతాల నుంచి తీసుకువచ్చిన ఖడ్గ మృగాల ప్రసవాలు ఇటీవల పెరిగాయని, దేశంలో జీవ వైవిధ్యాన్ని పెంపొందించాలనే లక్ష్యానికి అనుగుణంగా ఖడ్గ మృగాల సంఖ్య పెరుగుతున్నదని తాజా గణాంకాలు చెబుతున్నాయి.
అసోంలోని మానస్ అడవులు ఒకప్పుడు ఖడ్గ మృగాలకు నెలవు. కొన్ని దశాబ్దాల క్రితం ఇక్కడ ఖడ్గ మృగాలు అంతరించాయి. వీటి సంఖ్యను పెంపొందించేందుకు ఇతర ప్రాంతాల నుంచి ఖడ్గ మృగాలను తీసుకువచ్చారు. వాటి సంరక్షణతోపాటు సంతాన వృద్ధి కోసం ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకున్నారు. అధికారుల కృషి ఫలించి ఖడ్గ మృగాల జననాలతో వాటి సంఖ్య పెరిగింది. రేడియో టెలిమెట్రీ వ్యవస్థ ద్వారా 2012లో చేపట్టిన అధ్యయనంలో 35 ఖడ్గ మృగాలు జన్మించినట్లుగా గుర్తించారు. ఆ తర్వాత ఏడాదిలో జననాల సంఖ్య తొమ్మిదికి తగ్గింది. నాలుగేళ్లకు వార్షిక జననాల సంఖ్య సున్నాకు పడిపోయింది.
అధికారులు ప్రత్యేకంగా దృష్టిసారించి, సంరక్షణ, వృద్ధి కోసం కృషి చేయడంతో మరుసటి ఏడాది జననాలు నమోదయ్యాయి. 2020లో వీటి సంఖ్య అయిదుగా నమోదైంది. తర్వాత సంవత్సరం ఏడు జననాలు నమోదయ్యాయి. ఏటా ఖడ్గ మృగాల జననాల సంఖ్య పెరుగుతూ వాటి జనాభా కూడా వృద్ధి చెందుతున్నది. ఇప్పటికే యునెస్కో ప్రపంచ వారసత్వంగా ఉన్న మానస్ నేషనల్ పార్క్ ఖడ్గ మృగాలతో పర్యాటకుల్ని, వన్యప్రాణి ప్రేమికుల్ని ఆకర్షిస్తున్నది. హిమాలయాల చల్లదనాన్ని, మానస్ నేషనల్ పార్క్ పచ్చదనాన్ని, ఖడ్గ మృగాల విహారాన్ని వీక్షిస్తూ వేసవి సెలవుల్ని సంతోషంగా గడపాలంటే ఇదే సరైన సమయం!