పదో తరగతి ఫెయిలయ్యాడు. మెకానిక్ కావాలనుకున్నాడు. ఆ వృత్తిలో సంపాదన లేక నష్టపోయాడు. ఊరిని నమ్ముకొని వెనక్కి వచ్చాడు. ఆర్.ఓ.వాటర్ ప్లాంట్ పెట్టాడు. ఆటో ప్రమాదంలో మళ్లీ నష్టపోయాడు. భూమినే నమ్ముకుని వ్యవసాయంలో మళ్లీ అడుగుపెట్టాడు. పెట్టుబడి పెరిగింది. కానీ, ఆదాయం తరిగింది. అప్పులు చుట్టుముట్టాయి. అప్పుల వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు ప్రయోగాలు మొదలుపెట్టాడు. కొత్త కొత్త ఆవిష్కరణలు చేసి సవాలుగా మారిన పనులను సునాయాసంగా మార్చాడు! తనకే కాదు మిగతా రైతులకూ లాభసాటి సాగుబాట చూపించాడు కడివెండి మహిపాల్ చారి.
పరకాల పట్టణానికి సమీపంలోని సీతారాంపురం గ్రామ రైతు బిడ్డ కడివెండి మహిపాల్ చారి. పదో తరగతి ఫెయిల్ అయ్యాడు. తన చదువు అంతటితోనే ఆగిపోయింది. జీవనోపాధి కోసం హనుమకొండకు వెళ్లాడు. అక్కడ బైక్ మెకానిజం నేర్చుకున్నాడు. కొంతకాలం తర్వాత జమ్మికుంటలో మెకానిష్ వర్క్‌షాప్ తెరిచాడు. రాబడికి ఖర్చులకు పొంతన కనిపించలేదు. ఈ ఆర్థిక భారం వద్దనుకుని, ఊళ్లోనే ఏదో ఒకటి చేసుకుందామని సొంతూరికి మకాం మార్చాడు. ట్రాక్టర్ నడుపుతూ అమ్మానాన్నలకు ఆసరా అయ్యాడు. ఆర్.ఓ.వాటర్ ప్లాంట్ ప్రారంభించాడు. ఆటోలో ఇంటింటికీ తిరిగి మంచినీళ్లు అమ్మేవాడు. కాలం కలిసి రాలేదు. ఓ రోజు ఆటో ప్రమాదానికి గురైంది. మళ్లీ నష్టపోయాడు.
ఆ ఇంటికి వ్యవసాయమే దిక్కైంది. పెట్టుబడి ఎక్కువ. ఆదాయం తక్కువ. పంటకు ధరలు పెంచమని అడిగినా పెంచేవాళ్లు లేరు. కాబట్టి పెట్టుబడి ఖర్చులు తగ్గించేందుకు కొత్త పరికరాల తయారీ మొదలుపెట్టాడు. అప్పటికే మెకానిక్ వృత్తిలో ప్రవేశం ఉండటం వల్ల తొలి ప్రయత్నంగా కలుపు తీసే యంత్రం తయారు చేయాలనుకున్నాడు. ప్రమాదానికి గురై పక్కన పడి ఉన్న ఆటోతో ప్రయోగాలు చేశాడు. అనుకున్నట్టే ఆటో ఇంజిన్‌తో మినీ కల్టివేటర్‌ను రూపొందించాడు! దీనితో వ్యవసాయంలో కలుపు నివారణలో విజయవంతమయ్యాడు.
ఒక ప్రయోగం విజయవంతమయ్యాక మహిపాల్ రెట్టించిన ఉత్సాహంతో పనిచేశాడు. శ్రీవరి సాగులో కలుపు నివారణకు పవర్ వీడర్, మినీ ట్రాక్టర్, ఎలక్ట్రిక్ మినీ ట్రాక్టర్, ట్రాక్టర్ హైడ్రాలిక్ లిఫ్ట్, ట్రాలీ ఆటోను తయారు చేశాడు. పెట్రోల్‌తో నడిచే ద్విచక్ర వాహనాలు, కార్లను ఈవీ వాహనాలుగా మార్చాడు. సన్నకారు రైతుల అవసరాలకు తగ్గట్టుగా మోటర్ సైకిళ్లకు ట్రాలీలు రూపొందించాడు. అవసరం ఏదైనా సరే దానికి పరిష్కారం చూపించే మహిపాల్ ఆవిష్కరణలను రైతులే కాదు ప్రభుత్వ సంస్థలూ ప్రశంసించాయి.
చైనా పవర్ వీడర్‌కు షాక్ అబ్జార్బర్ బిగించి వ్యవసాయ పంటల్లో కలుపు మొకలను నివారించే మినీ కల్టివేటర్‌ను ఆవిష్కరించాడు. దీనికిగాను 2015లో రాష్ట్రపతి నుంచి పురసారం అందుకున్నాడు. 2018లో నేషనల్ ఆంత్రప్రెన్యూర్‌షిప్ అవార్డ్ గెలుచుకున్నాడు. ఈ పురస్కారం వల్ల 5 లక్షల రూపాయల నగదు ప్రోత్సాహకం అందుకున్నాడు. అమేజింగ్ ఇండియన్ 2024 పురసారానికి ఎంపికయ్యాడు. జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఎన్నో పురస్కారాలు అందుకున్నాడు. ఇప్పటికీ తన ప్రయోగాలు కొనసాగిస్తున్నాడు మహిపాల్. వ్యవసాయాన్ని సులభతరం చేయడమే తన లక్ష్యం అంటున్నాడు.

చదువు అబ్బకపోయినా.. ఈ స్థాయిలో ఉండడానికి కారణం పల్లె సృజన సంస్థ ప్రోత్సాహమే. ఈ సంస్థ అధ్యక్షుడు మాజీ బ్రిగేడియర్ పోగుల గణేశం చేయూత వల్లే జాతీయ స్థాయికి ఎదిగాను. ఇంత గుర్తింపు వచ్చింది. ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు ఆ సంస్థ సహకరించింది. వారి ప్రోద్బలంతోనే ఇన్ని ఆవిష్కరణలు చేయగలిగాను. రైతులకు ఉపయోగపడే ఆవిష్కరణలు ఇక ముందూ చేస్తాను. తల్లిదండ్రులు చదువు పేరుతో పిల్లలను ఒత్తిడికి గురిచేస్తున్నారు. అందువల్ల వారి ఆలోచనా శక్తి తగ్గుతున్నది. చదువు సృజనాత్మకంగా ఉంటే జీవితంలో రాణించొచ్చు. అందుకు నా జీవితమే ఉదాహరణ. తల్లిదండ్రులు ఆలోచించాలి. అదేసమయంలో విద్యావిధానంలోనూ మార్పు రావాలి.
– కడివెండి మహిపాల్ చారి, ఇన్నోవేటర్
– పోచంపల్లి రాజ్‌కుమార్ , పరకాల