ఈవెంట్ ఏదైనా స్టార్లా వెలిగిపోవాలని కోరుకోని అమ్మాయి ఉండదు. నగలూ దుస్తులనూ అందుకు తగ్గట్టే ఎంపిక చేసుకుంటారు కూడా. ముఖ్యంగా ఆభరణాలు జిగేల్మంటూ ఆకర్షణీయంగా కనిపించేందుకు రకరకాల రాళ్లు పొదిగినవి ధరిస్తుంటారు. ‘స్టార్ సఫైర్’ ఈ రాళ్లలో అత్యంత భిన్నమైనది. కాంతి పడగానే మెరుస్తూ నక్షత్రాకృతిని ఆవిష్కరించే ఇది రత్నాల జాతిలోనే ఎంతో ప్రత్యేకం.
ప్రకృతి ఎన్నో వింతల సమాహారం. అందులో అందమైనవీ ఆశ్చర్యాన్ని కలిగించేవీ మరెన్నో. మనం ధరించే ఖరీదైన వజ్రాలు, రత్నాలూ, మణిమాణిక్యాలూ కూడా అందులోనివే. భూమి పొరల్లో ఒక్కో రాయీ ఒక్కో రంగులో ఒక్కో ప్రత్యేక లక్షణాలతో ఏర్పడుతుంటుంది. అందులో ఉండే రకరకాల ఖనిజ మిశ్రమాలు వాటికా ప్రత్యేకతను తెచ్చిపెడతాయి. వాటి తళుకుబెళుకులే మనల్ని నగల్లో అమర్చుకుని ఆనందించేలా చేస్తాయి. ‘స్టార్ సఫైర్’ కూడా అలా తనకంటూ ఒక ప్రత్యేకతను కలిగిన రత్నమే. ఇందులోనే మరో రకం ‘స్టార్ రూబీ’. ఈ స్టార్ స్టోన్లలో టైటానియం డై ఆక్సైడ్ సమ్మేళనమైన రూటిల్ అనే ఖనిజం సూదిలా రాయిలో రకరకాల దిశల్లో వ్యాపించి ఉంటుంది. అదే కాంతి పడినప్పుడు కనిపించే ఈ నక్షత్రాకృతికి కారణం అన్నమాట! ఇక, ఇలా కనిపించడాన్నే ఆస్టెరిజం అని పిలుస్తారు. పూర్వపు గ్రీకు భాషలో నక్షత్రం అన్న పదం నుంచీ ఈ ఆస్టెరిజం పుట్టిందట.
స్టార్ సఫైర్గా పిలిచే ఈ రాళ్లలో ప్రధానమైనది నీలి రంగు. నిజానికి నీలమణిని సఫైర్ అని అంటాం. కానీ, ఇందులో గులాబీ, నారింజ, ఆకుపచ్చ, ఊదా, పసుపు పచ్చ… ఇలా విభిన్న రంగులవీ ఉంటాయి. ప్లాటినం, బంగారంలాంటి నగల్లో ఈ రాళ్లను ఎక్కువగా వాడుతున్నారు. ఉంగరాలు, పెండెంట్లు, చెవి దుద్దులు, బ్రేస్లెట్లు… ఇలా రకరకాల ఆభరణాల తయారీలో ఈ నక్షత్రపు రాయిని పొదుగుతున్నారు. వీటి మీద వెలుగు పడ్డ కోణాన్ని బట్టి నక్షత్రం ఒక్కోసారి ఒక్కోచోట కనిపిస్తుంది. అంతేకాదు సిక్స్ రే స్టార్, నైన్ రే స్టార్, ట్వెల్వ్ రే స్టార్… ఇలా నక్షత్రం ఎలా ఏర్పడుతుందన్నదాన్ని బట్టీ రాళ్లను పిలుస్తుంటారు.
ఉదాహరణకు సిక్స్ రే స్టార్ అంటే, ఆ రాయిలోని నక్షత్రం ఆరు రేఖలతో కనిపిస్తుందన్నమాట. నక్షత్రం ఎంత బాగా ఏర్పడితే అంత గొప్ప అన్నది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కదూ! ఇంతకీ ఈ రాళ్లు మన దేశంలోని కశ్మీర్ దగ్గర అధిక మొత్తంలో దొరుకుతాయట. తర్వాతి స్థానంలో శ్రీలంక, బర్మాలు ఉన్నాయి. ‘ద స్టార్ ఆఫ్ ఇండియా’గా పిలిచే ఒక రాయి అయితే ఏకంగా 560 క్యారెట్ల పైనే ఉందట. కాకపోతే న్యూయార్క్ మ్యూజియంలో ఉందనుకోండి. ఏదైతేనేం, రత్నగర్భ భారత్లో పుట్టిన మరో అద్భుతమైన రత్నం ఈ ‘స్టార్ సఫైర్’… మీకూ నచ్చిందా!