మహిళల సొంత ఇంటికల పై ఓ యువ రచయిత్రి తన అభిప్రాయం వెల్లడిస్తే ఆమెపై విపరీతమైన ట్రోలింగ్. సొంత ఇల్లు అమరిందని ఓ గృహిణి సంతోషం వ్యక్తం చేస్తే ఓ రాజకీయ పార్టీకి అనుకూలమని ట్రోలింగ్ ఆమె ఆత్మహత్యకు దారి తీసింది. చెన్నైలో చిన్నారి మొదటి అంతస్తు కిటికీ నుంచి జారిపడితే ఆ తల్లి ఏమరుపాటుగా ఉందన్న ట్రోలింగ్. దాని దెబ్బకు ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. ఇలా ఆన్లైన్లో ట్రోలింగ్ అనేది ఎంతో మందిని ఇబ్బంది పెడుతున్నది. ట్రోల్‌కి గురైన వారు మానసిక కుంగుబాటు గురైన సందర్భాలు ఉన్నాయి. అసలు పనిగట్టుకొని ఇలా ట్రోలింగ్ చేసే వారి మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది? ఈ మాటల దాడిని ఎలా ఎదుర్కోవాలో తెలుసుకుందాం.
సా మాజిక మాధ్యమాల్లో ట్రోలింగ్ కేవలం మాటల దాడి కాదు, దీని వెనుక లోతైన మానసిక అంశాలు ఉన్నాయి. ఆన్లైన్ ట్రోలింగ్ మనల్ని ఎంతగా బాధించినా, దాన్ని అర్థం చేసుకొని, సమర్థంగా ఎదుర్కోవడం చాలా ముఖ్యం.
ఇటీవలి కాలంలో సోషల్ మీడియా, ఆన్లైన్ వేదికలలో అత్యంత సాధారణంగా మారిన ఒక ప్రతికూల అంశం ట్రోలింగ్. ఇతరులను రెచ్చగొట్టడం, అవమానించడం, ఉద్దేశపూర్వకంగా విపరీతమైన కోపాన్ని, గందరగోళాన్ని సృష్టించడమే ట్రోలింగ్. చాలామందికి ఇది మానసిక ఆందోళనను కలిగిస్తుంది.
ట్రోలింగ్ చేసే వ్యక్తులు తమ అనామకత అంటే, తమ గుర్తింపు తెలియకుండా.. తెరచాటున దాగి ఉంటారు. నిజ జీవితంలో వారు తమ ప్రవర్తనకు బాధ్యత వహించాల్సి వస్తుంది. కానీ, ఆన్లైన్లో వారికి ఆ భయం ఉండదు. దీనిని ‘డిజిన్హిబిషన్ ఎఫెక్ట్” అంటారు. ట్రోలింగ్ చేసే వారి మానసిక స్థితి సాధారణంగా ఉండదు. వారిలో ఉన్న మానసిక అవలక్షణాల కారణంగానే వారు ట్రోలర్‌గా మారుతారు.
శాడిజం: ఇతరులను బాధ పెట్టడం ద్వారా, వారి ఆందోళనను చూసి ఆనందించే మనస్తత్వం. ట్రోలింగ్ చేసే వ్యక్తులలో ఇది ఒక బలమైన ప్రేరణ.
మాకియవెల్లియనిజం: ఇతరులను తమ స్వార్థ ప్రయోజనాల కోసం మోసం చేయడం లేదా తారుమారు చేయడం.
నార్సిసిజం: తమ గురించి తామే గొప్పగా అనుకోవడం, అధికారాన్ని కోరుకోవడం. ట్రోలింగ్ ద్వారా ఇతరుల దృష్టిని ఆకర్షించడానికి ప్రయత్నించడం.
సైకోపతి: సహానుభూతి లేకపోవడం, ఇతరుల పట్ల శ్రద్ధ చూపకపోవడం. నిజ జీవితంలో శక్తి లేని వారు, లేదా నిరాశలో ఉన్నవారు ఆన్లైన్లో తమ అధికారాన్ని నిరూపించుకోవడానికి ట్రోలింగ్‌ను ఒక సాధనంగా ఉపయోగించుకోవచ్చు.
ట్రోలింగ్ బాధితులు తీవ్రమైన ఆందోళన, నిరాశ, ఆత్మగౌరవం తగ్గడం వంటి మానసిక సమస్యలను ఎదుర్కొంటారు. అటువంటి పరిస్థితుల్లో ట్రోలింగ్‌ను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి కొన్ని పద్ధతులు పాటించాలి.
1. స్పందించొద్దు ట్రోలర్‌కు మీరు ఇవ్వగలిగే అతిపెద్ద శిక్ష నిశ్శబ్దం. వారు కోరుకునేది మీ ప్రతిస్పందన. మీరు కోపంగా లేదా బాధగా స్పందించినప్పుడు, వారు విజయం సాధించినట్లు భావిస్తారు. ట్రోలర్‌ను విస్మరించడం లేదా బ్లాక్ చేయడం ఉత్తమ పరిష్కారం.
2. వ్యక్తిగతంగా వద్దు మీరు బాగా తెలుసు కాబట్టి ట్రోలర్లు మీపై దాడి చేస్తున్నారని భావించొద్దు. వాళ్లు చేసే ట్రోలింగ్ ఆ వ్యక్తి మనస్తత్వం, నిరాశల గురించి తెలియజేస్తుంది! మీ గురించి కాదు. మీరు ఎదుర్కొనే ప్రతికూల వ్యాఖ్యలు వారి సమస్యలే తప్ప, మీ లోపాలు కాదు.
3. సెక్యూర్డ్ సెట్టింగ్స్ మీరు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో అందుబాటులో ఉన్న భద్రతా సాధనాలను ఉపయోగించండి. ట్రోలింగ్ చేసే ఖాతాలను ప్లాట్‌ఫామ్ నిర్వాహకులకు నివేదిండి. మీ పోస్ట్‌లపై ఎవరు కామెంట్లు చేయవచ్చో పరిమితం చేయండి. ట్రోలింగ్ చేసే వారిని వెంటనే బ్లాక్ చేయండి.
4. యూజ్ నెట్వర్క్ మీరు ట్రోలింగ్‌కు గురైనప్పుడు, దానిని మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో పంచుకోండి. మీ గురించి శ్రద్ధ వహించే వ్యక్తులతో మాట్లాడటంతో మీరు ఒంటరిగా లేరనే భావన కలుగుతుంది. మానసిక బలం లభిస్తుంది.
5. డిజిటల్ డిటాక్స్ ట్రోలింగ్ ఒత్తిడిని పెంచినప్పుడు కొన్ని రోజుల పాటు సోషల్ మీడియాకు దూరంగా ఉండండి. మీ మానసిక ఆరోగ్యాన్ని రక్షించుకోవడం చాలా ముఖ్యం. ప్రకృతిలో గడపడం, హాబీలను కొనసాగించడం లాంటి పనుల ద్వారా దృష్టిని మళ్లించండి.
ఆన్లైన్ ప్రపంచం ఎంత గొప్పదో, అంత ప్రమాదకరమైనది కూడా. ట్రోలింగ్‌ను అర్థం చేసుకుని వారి దురుద్దేశపూర్వక చర్యలకు లొంగిపోకుండా, మన మానసిక ప్రశాంతతను కాపాడుకోవడం ముఖ్యం. ట్రోలర్ల శక్తిని తగ్గించే అతిపెద్ద ఆయుధం మీరు సంయమనం పాటించడం. మీ ఆన్లైన్ అనుభవాన్ని సానుకూలంగా ఉంచుకోవడానికి కృషి చేయండి. అడ్డమైన వాగుడును పట్టించుకోకండి.