శా॥ స్వామీ ! మా నవభూములందుఁ గల దస్మద్దేశికాపత్య ము
ద్దామశ్రీకలితం బుదంచితకలాధామంబు నిన్గన్నఁ జే
తో మోదంబున స్వీకరించు జనకుండుం బంపు సేయంగ ని
స్సీమప్రీతి ననంగ యోగ ముపదేశించున్ గురుప్రౌఢిమన్
ఈ పద్యం తెలుగు వాల్మీకి కోకిల, సంస్కృతాంధ్ర కవితా సనాథ శ్రీ మోతుకూరి పండరినాథరావు గారు రచించిన ‘శ్రీమత్పండరినాథ రామాయణం’ బాలకాండం లోనిది. విభాండక మహాముని ఆశ్రమ సమీపంలో అతని పుత్రుడైన ఋష్యశృంగుని జనవాసంలో జనక వాసంలో చేర్చడానికి వారాంగనలు అతనిని సరస సల్లాప మనోల్లాస కేళిలో ముంచి స్త్రీలు అనే కొత్త జాతిని పరిచయం చేస్తున్న సందర్భం. అతణ్ని గాఢాలింగితుని చేసి చుంబితాస్యలగుచు పులకింతల కవ్వింతలలో సౌఖ్యం ప్రసాదించి, ఈ సౌఖ్య యోగాన్ని అనంగ యోగం అంటారని వాక్రుచ్ఛగా ఈ అనంగయోగం ఎక్కడ లభిస్తుందని ప్రశ్నించిన ఋష్యశృంగునికి సమాధానమే ఈ పద్యం.
అందమైన ఈ పద్యం శ్లేషతో మరింత అందగించింది. స్వామీ ఋష్యశృంగా! మా నవ దేశమందు మా గురువుల సాంగత్యం ఉద్దామ శ్రీకలితం (ఎలాంటి బంధనాలు లేని ఐశ్వర్య యుక్తమైన సకల కళలకు నిలయమైన కళాధామం). వారు మిమ్మల్ని చూసినట్లయితే సంతోష మానసులై జనకుని ఆదేశంతో మిమ్మల్ని శిష్యులుగా స్వీకరించి అంతులేని ప్రేమ పారవశ్యంలో మీకు అనంగయోగం ఉపదేశిస్తారు. అస్మద్దేశికాపత్యం అనే పదబంధానికి ఇక్కడ మా రాజు గారి పుత్రిక అని అర్థం. ఆమె మిమ్మల్ని సకల సౌఖ్య సంపదలలో నిలుపుతుంది, కనుక మీరు మా రాజ్యానికి రావల్సిందిగా ప్రార్థన అని బతిమాలడం సాధారణ అర్థం.
కాగా, కొంత విశేషమైన అర్థం కూడా పద్యంలో తొంగి చూస్తున్నది.
అంతవరకు తండ్రిని తప్ప మరొకరిని చూడని, స్త్రీ పురుష భేదం తెలియని ఋష్యశృంగుని తమ రాజ్యానికి తీసుకుపోవడానికి మా నవ భూములు అనడంలో మీకు మానవులు కొత్త వారు అని శ్లేష. జనావాసాలు మీకు కొత్త. మా దేశికాపత్య(రాజకుమార్తె) అద్భుతమైన తనూ సౌందర్యమనే ఐశ్వర్య యుక్తమైన కలావిలాసాన్ని అనుభవించు అని మొదటి రెండు పాదాల అంతరార్థం. బహుళ అర్థాలు కల ‘కలా’ అనే పదానికి ఆలింగన చుంబనాది చతుష్షష్టి క్రియలనీ, వాత్సాయనోక్త నృత్త గీత వాద్యాది చతుష్షష్టి బాహ్యక్రియలనీ అర్థాలు ఉన్నాయి. ఇవన్నీ నువ్వు మా దేశికుడవై అనుభవించవచ్చు అనునది అంతరార్థం. సంతస మనస్కుడై మా దేశికుడు ఈ కలాధామంబులో నిన్ను శిష్యునిగా స్వీకరిస్తారు అనే సాధారణార్థంలో మా గురువు, రాజకుమార్తె శాంత మిమ్మల్ని స్వీకరిస్తుందనేది మరో అర్థం.
జనకుని ఆనతితో మా గురువు మీకు అనంగయోగం ఉపదేశిస్తాడు అని మూడు నాలుగు పాదాల అర్థం కాగా, ఆమెకు తండ్రి ఆనతి ఉంది ఇది ధర్మ సమ్మతమే అని చెప్పడం కూడా విశేషం. జనకుడు అంటే విదేహ రాజు అంటే దేహం లేని వాడు, (వి+దేహ, విగతః దేహః దేహసంబంధః యస్య) దేహ సంబంధము లేనివాడు… జనకుడు. అనే ఆంధ్రభారతి వివరణతో జనకుడు పంపుసేయగా అంటే మన్మథుడు పంపగా అని కూడా తీసుకోవచ్చు. క్రీ.శ 1810 లో మోతుకూరి పండరినాథుడను కవి మడికొండ నివాసి ఆరు కాండలు, పదకొండు ఆశ్వాసాలు 7,300 పద్య గద్యాలతో ఆధ్యాత్మ రామాయణం ఆధారంగా రచియించిన ‘శ్రీమత్పండరినాథ రామాయణం’ కావ్యం ఓరుగల్లు జిల్లా వాసులకే కాక తెలంగాణ వారందరికీ గర్వకారణం.
-చేపూరి శ్రీరాం, హన్మకొండ