చుట్టూ ఎత్తయిన కొండలు… కనుచూపుమేరలో నల్లమల అందాలు.. మధ్యలో గలగలపారుతూ హొయలొలికే కృష్ణమ్మ.. ఇవి చాలవన్నట్టు అడపాదడపా పలకరించే జలపాతాలు, తరచూ తారసపడే వన్యప్రాణలు.. ఇలా మనసుదోచే అద్భుత దృశ్యాలను మదినిండా నింపుకోవాలని భావిస్తున్నారా! సోమశిల నుంచి శ్రీశైలం లాంచీలో విహరిస్తే ఈ అందాలన్నీ మీ సొంతం కావడం ఖాయం. అందుకే ఈ లాంచీ విహారం కోసం సందర్శకులు పోటీ పడుతున్నారు.
కృష్ణమ్మ సోయగాలకు కాణాచి సోమశిల. ఆ నదీమతల్లిని ఒడిసిపట్టి అక్షయ గంగగా మార్చింది శ్రీశైలం. ప్రకృతి రమణీయతకు ఆ దరి ఆలవాలమైతే.. ఆధ్యాత్మిక శక్తి కేంద్రం ఈ దరి. ఈ రెండిటినీ కలిపిన కృష్ణమ్మ ఒడిలో విహారం ఎంత మనోహరంగా ఉంటుందో ఊహించుకోండి. పాపికొండల నడుమ పారాడే గోదారి అందాలను మరిపిస్తుందీ ప్రయాణం. నల్లమలను దాటుకుంటూ వచ్చిన గాలులు.. పర్యాటకుల ముంగురులను సవరిస్తాయి. కృష్ణా తరంగాల నుంచి పుట్టుకొచ్చిన తుంపర్లు.. లాంచీలో టైటానిక్ పోజు కోసం ప్రయత్నిస్తున్న కొత్తజంటపై పన్నీరు చిలకరిస్తాయి. ఆరు గంటల విహారం. అర నిమిషానికో ఆహ్లాదం. ఈ ఏడాది నదికి పెద్ద ఎత్తున వరద రావడంతో కృష్ణలో లాహిరి.. లాహిరి అంటూ లాంచీ ప్రయాణం జోరుగా సాగుతున్నది.
సోమశిల టు శ్రీశైలం లాంచీ ప్రయాణం ఎన్నో అనుభూతులకు కేరాఫ్‌గా నిలుస్తుంది. మొత్తం దూరం 120 కిలోమీటర్ల ప్రయాణం పర్యాటక, ఆధ్మాత్మిక కలబోతగా సాగుతుంది. శతాబ్దాల కిందట సప్తనదుల చెంతన శైవం వర్ధిల్లింది. ఇక్కడి శైవ ఆలయంలో గంట మోగిన తర్వాతే శక్తి పీఠమైన శ్రీశైలంలో పూజలు ప్రారంభమయ్యేవని కథనం. ఇలా పౌరాణిక ప్రాశస్త్యం కలిగిన సప్త నదుల కూడలి (సోమశిల) నుంచి శ్రీశైలానికి జల విహారం ఆద్యంతం అద్భుతమే! ఈ ప్రయాణంలో వేపధార లింగం మొదలుకొని ద్వాదశ జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం కలుగుతుంది.
మల్లయ్య సెల, చాళుక్యులు నిర్మించిన శత్రుదుర్భేద్యమైన అంకాలమ్మ కోట, వీరభద్రుడి కోవెల, శైవంలో మిలితమైన హనుమంతుడి ఉగ్రరూప దర్శనం, అక్కమహాదేవి గుహల సందర్శనం మరపురాని అనుభూతిని పంచుతాయి. చివరిగా సిరిగిరి మల్లికార్జునుడి సన్నిధిలోని పాతాళగంగ చేరుకోవడంతో లాంచీ ప్రయాణం ముగుస్తుంది. ఈ విహారం ప్రకృతి ఒడిలో సేదతీరుతున్న భావన కలిగిస్తుంది. ఒకచోట ఆశ్చర్యానికి గురిచేస్తుంది, మరోచోట ఆనందాన్ని పంచుతుంది. మొత్తంగా ఈ ప్రయాణం పర్యాటకులపై మత్తుజల్లుతుంది.
పర్యాటకుల డిమాండ్ మేరకు ప్రతి శనివారం క్రూయిజ్ నడిపేందుకు తెలంగాణ టూరిజం ఏర్పాట్లు చేస్తున్నది. హైదరాబాద్ నుంచి వచ్చే పర్యాటకులను టూరిజం శాఖ ప్రత్యేక వాహనంలో సోమశిల వరకు రోడ్డు మార్గంలో తీసుకొస్తారు. అక్కడి నుంచి కృష్ణానదిలో శ్రీశైలం పాతాళగంగ వరకు క్రూయిజ్‌లో తీసుకువెళ్తారు. అక్కడ మల్లన్న, భ్రమరాంబ దర్శనం అనంతరం మరుసటి రోజు తిరిగి సోమశిల వరకు లాంచీలో తీసుకొస్తారు. సింగిల్ ట్రిప్ చాలు అనుకునేవారిని శ్రీశైలం నుంచి రోడ్డు మార్గంలో హైదరాబాద్‌కు వెళ్లే వెసులుబాటు కూడా కల్పిస్తారు. చార్జీల విషయానికొస్తే పెద్దలకు రూ.3 వేలు, పిల్లలకు రూ.2,400గా ధర నిర్ణయించారు. ఈ ప్యాకేజీలో సందర్శకులకు భోజనవసతితోపాటు స్నాక్స్ అందిస్తారు. ఆన్‌లైన్‌తోపాటు ఆఫ్‌లైన్‌లో కూడా టిక్కెట్లు పొందొచ్చు.
-సీపీ నాయుడు, కొల్లాపూర్