విశిష్టాద్వైత వీచికలు
శయనంబై, యుపధానమై, నిలయమై, సచ్ఛత్రమై, పాదుకా ద్వయమై, మంగళ పీఠమై, మృదుల వస్త్రంబై సమస్తోచిత క్రియలం జక్రికి నిత్య సన్నిహిత మూర్తిం బొల్పు శేషాహి, న క్షయ మేథానిధి గావ్యలక్షణ కళాచార్యున్ బ్రశంసించెదన్
శయనంబై, యుపధానమై, నిలయమై, సచ్ఛత్రమై, పాదుకా
ద్వయమై, మంగళ పీఠమై, మృదుల వస్త్రంబై సమస్తోచిత
క్రియలం జక్రికి నిత్య సన్నిహిత మూర్తిం బొల్పు శేషాహి, న
క్షయ మేథానిధి గావ్యలక్షణ కళాచార్యున్ బ్రశంసించెదన్
పరమేశుం బురుషోత్తముం బరు, కృపాపాధోధి, నారాయణున్
హరి చిత్తంబుననిల్పి నిత్యము ప్రణామాభ్యర్చనాది క్రియా
పరతం గార్యము దీర్పు మట్లయిన బాపశ్రేణి బోదోలి త
త్పరమ స్థానము బొందెదెంతయును గోప్యంబేనెరింగించెదన్
ఈ రెండు పద్యాలు భైరవ కవి రచించిన శ్రీరంగ మహత్త్వం అనే కావ్యం లోనివి. హరిశ్చంద్రోపాఖ్యానం, నవనాథచరిత్ర, లక్షణ దీపిక లాంటి సుప్రసిద్ధ గ్రంథ రచయిత గౌరన పుత్రుడే భైరవ కవి. ఇతను మహా వైష్ణవ భక్తుడు. భైరవ కవి గజాంకుశం, రత్న పరీక్ష అనే గ్రంథాలు రచించారు. ఇక మన పద్యాల విషయానికి వస్తే శయనంబై అనేది కావ్యంలోని రెండో పద్యం. ఇది ఆదిశేషుని ప్రస్తుతి. ఇందులో శేషుని దేహాదివర్ణనలు గాక శేషుడు విష్ణువుకు తనను తాను ఎలా సంపూర్ణంగా అర్పించుకున్నాడో వివరించారు కవి. విశిష్టాద్వైతంలో శేషశేషి సంబంధాలు కనిపిస్తాయి. గద్య త్రయంలోని వైకుంఠ గద్యంలో భగవద్రామానుజుల వారు ‘శేషశేషా సనాది సర్వం పరిజనం’ అన్నారు. యమునాచార్యుల వారు శేషునికి ప్రథమ స్థానాన్నిచ్చారు. భగవద్రామానుజులు శేషాంశుడే కాబట్టి ఈ పద్యంలో రామానుజుల స్తుతి కూడా ఉన్నట్లు భావించాలి. ప్రత్యేకంగా శేషుని కావ్యలక్షణ కళాచార్యున్ అని ప్రస్తుతించారు. ఇందులో లాక్షణిక, ఆధ్యాత్మిక ద్వంద్వార్థాలు మిళితమై ఉన్నాయి. శేషుడు గొప్ప ఆధ్యాత్మికవేత్త మాత్రమే గాక గొప్ప విజ్ఞాని. వేదాంతర్గత శాస్త్ర విజ్ఞాన ఛందో రహస్యాలు ఎరిగిన బుద్ధిశాలి. అతను ఏ విధంగా విష్ణువుకు తన సర్వస్వం అప్పగించాడో ఆ అర్పణ లక్ష్యమే ఈ గ్రంథ రచనోద్ధేశ్యం. అదే ఈ కావ్య లక్షణంగా ఉండాలని కవి కోరిక.
రెండో పద్యం లో పురుషోత్తముడైన హరిని కీర్తిస్తూ చివరలో గోప్యంబేనెరింగించితిన్ అంటారు. ఈ గోప్యం ద్వయ మంత్రం. అది రహస్యంగా పేర్కొన్నది. అది తెలిస్తేనే ఆ పరమోత్కృష్ట స్థానం పొందగలుగుతారు. వైష్ణవులు సమాశ్రయణ సందర్భంగా ద్వయ మంత్రోపదేశం పొందుతారు. ‘శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే, శ్రీమతే నారాయణాయ నమః అనేది ద్వయ మంత్రం. దీనికి చరమశ్లోకం కలిస్తే అది రహస్య త్రయం అవుతుంది. ఈ రహస్యాన్ని వైష్ణవ మతావలంబులు తెలుసుకుని ఆచరించాలి. భగవద్రామానుజులు దీనినే అశేష ప్రజానీకంలో బహిరంగంగా ప్రకటించారు. ద్వయ మంత్రంలో ‘ఓం నమో నారాయణాయ’ అనే అష్టాక్షరి తిరుమంత్రం కూడా ఉంది. ఇదే భక్తుల కోరికలు ఈడేర్చేది. నిత్య ప్రణామాభ్యర్చన కార్యకలాపంలో ఈ రహస్య త్రయం కూడా నేను పఠిస్తాను అంటున్నారు కవి.
-చేపూరి శ్రీరాం, హన్మకొండ
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

