కాలం ఇచ్చే అతి విలువైన కానుకలు స్నేహితులే. అలాంటి అపురూపమైన వ్యక్తులకు అందమైన కానుకలు ఇచ్చే ప్రత్యేక సందర్భం ఫ్రెండ్షిప్ డే. నిరంతర నదీ ప్రవాహంలా సాగే స్నేహబంధంలో, మేలిమలుపుల్లో పూదోటలాంటి మనోహరమైన జ్ఞాపకాలను భద్రపరిచేందుకు ఉపయోగపడతాయివి. ఆడపిల్లలూ మగపిల్లల్లోనే కాదు, ఆడామగా మధ్యా కూడా అనుబంధాన్ని మించి విరబూసే స్నేహబంధాన్ని అందమైన వేడుకలా జరుపుకోవడానికి ఎన్నో బహుమతులు… అందులో కొన్ని…
పంచుకోవడాన్ని తోబుట్టువుల తర్వాత స్నేహితుల దగ్గరే మనం ఆనందిస్తాం. అంతటి చనువు వాళ్ల మధ్య అనువుగా వచ్చి చేరుతుంది. మ్యాచింగ్ మంత్రం స్నేహితుల మధ్య పనిచేసినట్టు మరెక్కడా పనిచేయదు. వాళ్లవి ఒకే అభిరుచులు. ఒకేలాంటి ఆనందాలు. ఇలాంటి వాళ్ల కోసమే ‘బెస్ట్ ఫ్రెండ్ లాకెట్లు’ దొరుకుతున్నాయి. ఇద్దరు మొదలు ముగ్గురు, నలుగురు, ఆరుగురు ఇలా… ఫ్రెండ్స్ బ్యాచ్ ఎంత మంది ఉంటే అంతమందికీ కలిపి తయారు చేసే లాకెట్లు ఇవి. అంటే వీటిని ఒక దగ్గర పెట్టినప్పుడు పువ్వు, పద్మం, రెయిన్బో, పిల్లి… ఇలా రకరకాల ఆకృతులు వస్తాయి. అందులో నుంచి ఒక్కో భాగానికి ఒక్కో గొలుసు ఉంటుంది. వాటిని విడివిడిగా వేసుకోవడమే. కొన్ని రకాల్లో అయితే ప్రతి భాగం మీదా ఒక పేరు ముద్రించే వీలుంటుంది. అంటే మన ఫ్రెండ్స్ బ్యాచ్ పేర్లు అక్కడ పెట్టించుకోవచ్చు అన్నమాట. ఒకేదాన్ని తుంచుకొని పంచుకోవడం కన్నా ఆనందం ఇంకేముంటుంది చెప్పండి.
మన నేస్తం మనసు మనకు తెలిసినంతగా మరెవరికీ తెలియదు. కొన్నిసార్లు ఇంట్లో వాళ్లకి తెలీని సంగతులు, అనుభవాలు, అభిరుచులు కూడా మిత్రుల దగ్గర భద్రంగా ఉంటాయి. సంవత్సరాల పాటు కొనసాగే ఈ స్నేహబంధంలో ఒకరి గురించి ఒకరు తెలుసుకోవడమే కాదు, ఒకరికొకరు ఎలా అర్థమయ్యారో కూడా తెలుసుకునేందుకు ఉపయోగపడే సరదా పుస్తకమే ‘ఐ రోట్ ఎ బుక్ ఎబౌట్ యు’. ఇందులో మిత్రులకు సంబంధించిన కొన్ని సరదా ప్రశ్నలుంటాయి. వాటి పక్కనే జవాబు రాసేందుకు వీలుగా ఖాళీ స్థలమూ ఉంటుంది. ఉదాహరణకు.. ‘నేను నీతో ఈ విషయం ఎప్పుడూ మాట్లాడి ఉండకపోవచ్చు. కానీ, నాకు చాలా స్పష్టంగా తెలుసు’, ‘ఒక వేళ నేను నీకు అత్యుత్తమ ట్రోఫీ ఇచ్చే అవకాశం ఉంటే… అది ఎందులో ఇస్తానంటే…’ ఇలా అన్నమాట. ఈ పుస్తకం బహుమతిగా ఇవ్వడమంటే ఒకరి మనసుతో మరొకరి మనసు మాట్లాడటమే మరి!
బహుమతులంటే ఎప్పుడూ అందంగా ఉండేవి… ప్రత్యేకంగా కనిపించేవే కాదు.. నిత్య జీవితంలో ఉపయోగపడేవీ… చూడగానే ఇదీ బహుమతేనా అనిపించేవీ కూడా అయి ఉండొచ్చు. సిల్లీ థింగ్స్… లేకపోతే అసలది ఫ్రెండ్షిప్పే కాదు. అర్థం లేని గొడవలు, వేళాపాళా లేని పనులు, కుళ్లు జోకులు అన్నీ ఈ ప్రయాణంలో భాగమే. అందుకే అలాంటి సిల్లీ ఫ్రెండ్ కోసం సిల్లీయెస్ట్ కానుకగా ఫ్రెండ్ షిప్‌డే ప్రత్యేక స్పూన్లు తయారు చేస్తున్నారు. స్టెయిన్లెస్ స్టీల్‌తో రూపొందే వీటి మీద స్నేహబంధానికి సంబంధించి రకరకాల కోట్స్ చెక్కి ఉంటున్నాయి. ‘జీవితపు రెసిపీలో తప్పకుండా కావలసిన పదార్థాలు స్నేహితులు’, ‘జీవితాన్ని తియ్యగా మార్చేది మిత్రులే’ లాంటి మాటలతో వస్తున్నాయివి. మనకు నచ్చిన దాన్ని ఎంచుకొని స్నేహితులతో పంచుకోవడమే… ఓ స్పూన్ తేనెను.