ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ టెస్ట్ చాంపియన్‌షిప్ పోటీలు ఇటీవలే ముగిశాయి. వన్డే క్రికెట్ వరల్డ్ కప్ విజేత ఆస్ట్రేలియాను ఓడించి దక్షిణాఫ్రికా జట్టు కొత్త టెస్ట్ చాంపియన్‌గా అవతరించింది. అంతేకాకుండా అంతర్జాతీయ క్రికెట్లో ఫైనల్స్‌లో ఒత్తిడిని తట్టుకొని నిలవలేదనే అపప్రథను కూడా పోగొట్టుకుంది. ఇదలా ఉంచితే టెస్ట్ వరల్డ్ కప్‌ను దక్షిణాఫ్రికా గెలుచుకోవడంతో మనకు అంతగా పరిచయం లేని ఓ కొత్తపదం వార్తల్లో ప్రముఖంగా నిలిచింది. అదే ‘షోషోలోజా’. ఇది దక్షిణాఫ్రికా దేశానికి చెందిన ఓ పాటలో ప్రారంభపదం. ఈ పదం, పాట పుట్టుక వెనుక అదృష్టాన్ని వెతుక్కుంటూ వెళ్లిన కార్మికుల ఆశ, ఆకాంక్ష ఉండటం గమనార్హం.
ఆఫ్రికా ఖండం దక్షిణ చివరన ఉండే దక్షిణాఫ్రికా దేశం బంగారం, వజ్రాల గనులకు ప్రసిద్ధి చెందింది. దీంతో సరిహద్దు దేశమైన జింబాబ్వే నుంచి ఆ దేశానికి గనుల్లో పనిచేయడానికి ఎంతోమంది కూలీలు వలస వెళ్లేవారు. అలా వెళ్తున్నవాళ్లు తోటివాళ్లను ఉత్సాహపర్చడానికి, కఠినమైన పరిస్థితుల్లోనూ తమ దేశానికి తిరిగి వెళ్లకుండా ఉండటానికి ‘షోషోలోజా..’ పాటను లయబద్ధంగా ఆలపించేవాళ్లట. అలా పుట్టిన ఈ పాట తర్వాత కాలంలో దక్షిణాఫ్రికాలో వర్ణ వివక్షపై పోరాటంలో అక్కడి ప్రజలను ఉత్సాహపర్చింది. ఇప్పుడు రగ్బీ, ఫుట్‌బాల్, క్రికెట్ తదితర ఆటల పోటీల్లో క్రీడాకారులకు స్ఫూర్తినిస్తూ వారిని విజయాల దిశగా నడిపిస్తున్నది.
ఈ పాట ఆఫ్రికాలో ఎన్డెబెలె, జులూ భాషలు మాట్లాడే కార్మికుల నోళ్ల నుంచి పుట్టింది. ఎన్డెబెలె భాషలో షోషోలోజా అంటే ‘ముందుకు వెళ్లండి’, ‘కొత్త బాటలు వేయండి’ అని అర్థం. గనుల తవ్వకంలో తమకు ఎదురయ్యే కష్టాలకు భయపడకుండా ముందుకు సాగడానికి ఈ పాటను సృష్టించుకున్నారు. మొదట్లో పనిపాటగా పుట్టిన ‘షోషోలోజా’ ఆ తర్వాత కాలంలో దక్షిణాఫ్రికా నల్లజాతివారికి ప్రేరణ కలిగించే స్ఫూర్తిమంత్రంగా మారిపోయింది.
ఎక్కడో ఉన్న ఇంగ్లండ్ నుంచి వచ్చి తమను పాలిస్తున్న శ్వేత జాతీయుల వర్ణ వివక్షకు వ్యతిరేకంగా పోరాటానికి స్ఫూర్తినిచ్చింది. అలా ఐక్యత, ప్రతిఘటన, స్వేచ్ఛ, స్వాతంత్య్రం, సమానత్వాల దిశగా ప్రజలను ప్రోత్సహించేదిగా మారిపోయింది. సాంస్కృతికంగా చూస్తే ఈ గీతాన్ని దక్షిణాఫ్రికా దేశానికి అనధికారికంగా రెండో జాతీయ గీతంగా పరిగణిస్తారు.