పొలం గట్టుపై చిన్న పాము కనిపించినా.. గుండెలో దడ పుడుతుంది. భయంతో ఒళ్లంతా వణికిపోతుంది. అదే.. శివుడి మెడలోని నాగుపామును చూస్తే.. గుండెలో భక్తిభావం పొంగుకొస్తుంది. భక్తితో శరీరం పులకించి పోతుంది. ఇక్కడే.. భక్తికీ-భయానికీ మధ్య తేడా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే, భక్తితో భయాన్ని జయించవచ్చని మహారాష్ట్రలోని షెత్‌ఫల్ గ్రామాన్ని సందర్శిస్తే తెలుస్తుంది. కొన్నేళ్లుగా విషసర్పాలతో సహజీవనం చేస్తూ.. భక్తి, నమ్మకం ఉన్నచోట, భయం ఉండదని ఈ పల్లె నిరూపిస్తున్నది.
మహారాష్ట్రలోని షోలాపూర్ జిల్లాలో ఉంది షెత్‌ఫల్ గ్రామం. ప్రపంచవ్యాప్తంగా అత్యంత విచిత్రమైన, విస్మయపరిచే విశేషంతో.. ‘పాముల గ్రామం’గా గుర్తింపు తెచ్చుకున్నది. ఎందుకంటే, ఈ గ్రామంలోని ప్రజలు అత్యంత విషపూరితమైన నాగుపాములతో కలిసి జీవిస్తారు. ఇక్కడి ఏ వీధిలో చూసినా, ఏ ఇంట్లో చూసినా కోకొల్లలుగా సర్పాలు దర్శనమిస్తాయి. ఇంటి అరుగు మొదలుకొని పొలం గట్ల దాకా.. ప్రతిచోటా పాములు నివసిస్తాయి. అయినా.. ఆ ఊరి జనం వాటిని చూసి భయపడరు. కనీసం కర్ర పట్టుకుని తరిమేయడానికి కూడా ప్రయత్నం చేయరు.
షెత్‌ఫల్ వాసులు పాములను సాక్షాత్తూ పరమశివుడి స్వరూపమని నమ్ముతారు. వాటిని అత్యంత భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. ఇలా కొన్ని తరాలుగా పాములను ప్రత్యక్ష దైవంగా భావిస్తున్నారు. అందుకే, అవి తమకు ఎలాంటి హానీ కలిగించవని చెబుతారు. వారి నమ్మకానికి తగ్గట్టే.. ఇప్పటివరకు ఈ గ్రామంలో ఒక్కరు కూడా పాము కాటుతో చనిపోలేదు. ఇక, ఇక్కడి ఇళ్లలో మనుషులతోపాటు పాములు కూడా స్వేచ్ఛగా తిరుగుతుంటాయి. వారితో కలిసి ఒకే మంచంపై పడుకుంటాయి. ఇక్కడి పిల్లలు కూడా బొమ్మలకు బదులుగా.. పాములతోనే ఆడుకుంటూ పెరుగుతారు. అందుకే, షేత్ఫల్ వాసులకు పాముల ప్రవర్తన, కదలికల గురించి బాల్యం నుంచే పూర్తి అవగాహన ఉంటుంది.
పాములతో సహవాసం, వాటికి హాని తలపెట్టక పోవడం మాత్రమే కాదు.. ఇంటి నిర్మాణ సమయంలోనూ వీటికోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారు. ఏ సమయంలోనైనా పాములు రావడానికీ, స్వేచ్ఛగా విశ్రాంతి తీసుకోవడానికీ వీలుగా ఇళ్ల పైకప్పుల కింద, గోడలలో ‘దేవస్థానం’ లాంటి ఒక ప్రత్యేకమైన చిన్న స్థలాన్ని (కోటరీ) తప్పనిసరిగా నిర్మిస్తారు. వేసవిలో ఎండలు మండిపోతున్నా, శీతాకాలంలో చలి వేసినా.. పాములు నేరుగా ఈ ప్రత్యేక స్థలాల్లోకి వచ్చి సేదతీరుతాయి.
ఈ పాముల ప్రపంచాన్ని చూసేందుకు సాహస పర్యాటకులు, వన్యప్రాణి ప్రేమికులు అమితాసక్తి చూపుతుంటారు. ఏటా వందల సంఖ్యలో షెత్‌ఫల్ గ్రామాన్ని సందర్శిస్తుంటారు. అయితే, ఇక్కడికి వచ్చే పర్యాటకులు కొన్ని నియమ నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. పాములను తాకడం, పట్టుకోవడం, వాటితో సెల్ఫీలు దిగడం.. పూర్తిగా నిషేధం. అదే విధంగా, పాములను భయపెట్టడం, వాటికి హాని తలపెట్టడం లాంటివీ చేయకూడదు. షెత్‌ఫల్ గ్రామాన్ని సందర్శించాలంటే.. అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో ఇక్కడి వాతావరణం చల్లగా, ఆహ్లాదకరంగా ఉంటుంది. షోలాపూర్ నుంచి షెత్‌ఫల్ గ్రామం 60 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దేశంలోని అన్ని ప్రధాన నగరాల నుంచి షోలాపూర్‌కు రవాణా సౌకర్యం ఉన్నది. ప్రకృతితో, వన్యప్రాణులతో మనుషులు ఎంతటి సామరస్యంతో జీవించవచ్చో చెప్పడానికి.. షెత్‌ఫల్ గ్రామం ఒక అద్భుతమైన ఉదాహరణగా నిలుస్తున్నది.