‘ఇప్పటి వరకూ సైకో పనిపట్టిన నువ్వు.. ఇప్పుడు దెయ్యంతో పోరాడాలి’ అంటూ డీఎస్పీ సత్యనారాయణ చెప్పడంతో.. ఆయన్ని కలవడానికి ఇన్స్పెక్టర్ రుద్ర డైరెక్టుగా సత్యనారాయణ ఇంటికే వెళ్లాడు. ‘సార్.. ఫోన్లో ఏదో దెయ్యం అంటూ అన్నారు. అసలేంటీ విషయం?’ అంటూ డైరెక్టుగా మ్యాటర్‌లోకి వచ్చాడు రుద్ర.
‘ఎస్.. నల్లమల ఫారెస్టులో గత కొన్నాళ్లుగా ఏవేవో మిస్టరీగా జరుగుతున్నాయి. అక్కడ మన సీఐ శరత్ ఉన్నాడు. నీకు అతను తెలిసే ఉంటుంది’ అని డీఎస్పీ అనడంతో.. ముఖపరిచయం లేదుగానీ డిపార్ట్మెంట్లో ఆయన పేరు విన్నాను సార్ అన్నాడు రుద్ర. ‘ఈ నల్లమల మిస్టరీ కేసును సాల్వ్ చేయడం శరత్‌కు కూడా కావట్లేదు. దెయ్యం, భూతం, మంత్రాలు అంటూ అక్కడ నానా హడావుడి జరుగుతున్నది. అమాయకులు ఎందరో బలయ్యారు’ అన్నాడు డీఎస్పీ. ‘సార్.. ప్రజలు చనిపోయారా?’ అంటూ ఆశ్చర్యపోయాడు రుద్ర. ‘పదుల సంఖ్యలో చనిపోయారు రుద్ర. అయితే, ఎందుకో ఆ వివరాలు కూడా బయటకు రావట్లేదు. నాకు కూడా ఓ మీడియా మిత్రుడి ద్వారా గ్రౌండ్లో ఏం జరుగుతుందో తెలిసింది. అందుకే, నువ్వు వెంటనే అక్కడికి బయల్దేరు. సైకో ఆటకట్టించిన నువ్వు.. నల్లమల రహస్యాన్ని ఛేదిస్తావన్న నమ్మకం నాకుంది. వీలైనంత త్వరగా కేసును సాల్వ్ చేసి రా.. ఆల్ ది బెస్ట్’ అంటూ సత్యనారాయణ అనడంతో ఆ మరుసటి రోజే ఫోరెన్సిక్ ఇంచార్జి జయ, ఆమె సిబ్బంది, స్నేహిల్, హెడ్‌కానిస్టేబుల్ రామస్వామితో నల్లమలకు బయల్దేరాడు రుద్ర.
‘ఒరేయ్.. ఈ దెయ్యాల గొడవేంట్రా?’ అర్థంకానట్టు అంది జయ. ‘ఏమో ఆంటీ.. నాకు కూడా పూర్తిగా తెలియదు. ఏవో దెయ్యాలు నాలుగైదు ఊర్లను పట్టిపీడిస్తున్నాయట. దెయ్యాలకు ఎదురెళ్లిన వాళ్లు అనూహ్య పరిస్థితుల్లో చనిపోతున్నారట. ప్రస్తుతం ఆ గ్రామాలకు రక్షా బంధనాలు వేసి స్వామీజీలు కాపాడుతుండటంతో ఇప్పుడిప్పుడే దుష్టశక్తుల ప్రభావం తగ్గిందట’ అంటూ చెప్తున్న రుద్రను నిలువరిస్తూ.. ‘ఏమిట్రా రుద్ర?? ఏదో ట్రిప్ అంటే లాంగ్ లీవ్ పెట్టి వచ్చా. ఇప్పుడు దెయ్యాలంటావేంట్రా?’ అన్నాడు స్నేహిల్. దారిలో దాబా కనిపిస్తే.. జర్నీకి బ్రేక్ ఇచ్చాడు రుద్ర.
అందరూ దిగి భోజనాలు కానిస్తున్నారు. ఇంతలో దగ్గర్లో ఏదో ఆశ్రమంలాంటిదేదో కనిపిస్తే రుద్ర దృష్టి అటువైపు మళ్లింది. చాలామంది గుమిగూడి ఉండటంతో అక్కడికి వెళ్లాడు రుద్ర. నడుస్తూ.. ఆ ఆశ్రమం గురించి శివుడిని అడిగి తెలుసుకొన్నాడు. నల్లమలలో సాయంగా ఉంటాడని ఆ ప్రాంతానికి చెందిన శివుడిని రుద్ర తన టీమ్‌లో చేర్చుకొన్నాడు. ‘సార్.. ఈ స్వామి పేరు నారాయణాద్రులు. ఇంట్లో దుష్టపీడలను వదిలిస్తారు. ఈయనంటే ఇక్కడి వారికి ఎంతో గురి’ అంటూ చెప్తూ పోయాడు శివుడు. ఇంతలో ఆశ్రమం లోపలికి వెళ్లాడు రుద్ర. ‘స్వామీ.. మీరు చెప్పినట్టే అన్నీ జరుగుతున్నాయి. ఇంట్లోకి వెళ్లిన రోజు నుంచే అన్నీ అపశకునాలే. మీరు చెప్పినట్టే మా ఇంట్లో మీరు పూజ చేసి ఇచ్చిన పాలు కూడా పొంగలేదు’ అంటూ ఓ దంపతులు మొరపెట్టుకొన్నారు. ‘ఎక్కడపడితే అక్కడ ఆస్తులు కొనడం కాదు. ఏది మంచిదో, మన భవిష్యత్తు తరాలకు ఏది శుభమో.. ఆ ఆస్తులనే కొనాలి. నన్ను సంప్రదించకుండా కొన్నారుగా.. ఇక అనుభవించండి’ అంటూ నారాయణాద్రులు కొంత ఆగ్రహంతో అన్నాడు. దీంతో భయపడిపోయిన ఆ దంపతులు.. ‘స్వామి.. మా తాతల కాలం నుంచి మీకు సేవ చేస్తున్నాం. మీరు చెప్పింది ఇక జవదాటం. కరుణించండి’ అంటూ ఇంకా ఏదో చెప్పబోతుండగా.. రుద్ర మధ్యలో అందుకొన్నాడు.
‘నారాయణాద్రుల స్వామి గారూ.. పాలు పొంగకపోతే.. అపశకునమా?’ సూటిగా ప్రశ్నించాడు. చిన్నగా నవ్విన నారాయణాద్రుల స్వామి.. ‘పాతికేండ్లు కూడా లేవు. పైగా పోలీసులా ఉన్నావ్. ఇవన్నీ నీకు ఇప్పుడే అర్థంకావు బాబు.. అయినా.. నీకు’ అంటూ స్వామి ఏదో చెప్పబోతుండగా.. ‘సోది అంతా చెప్పకు స్వామి. పాలు పొంగకపోతే.. అపశకునమా?’ అంటూ మళ్లీ అడిగాడు. దీంతో అక్కడున్న దంపతులు కలుగజేసుకొని.. ‘అవును.. అపశకునమే. స్వామీజీకి చెప్పకుండా ఓ కొత్త ఇల్లు తీసుకొన్నాం. ఏదో కీడు జరుగుతున్నట్టు మనసు శంకించింది. దీంతో స్వామిని కలిస్తే, ఇల్లు మంచిదో కాదో తెలుసుకోవడానికి పొంగించమని పాలు ఇచ్చారు. పొంగితే, మరేం ఫర్వాలేదు అన్నారు. లేకపోతే, ఇల్లు విడిచిపెట్టాలన్నారు. ఆయన చెప్పినట్టే ఎంత వేడి చేసినా పాలు పొంగలేదు. ఐదు కోట్లు పెట్టి కొన్న ఇల్లు. విడిచిపెట్టడం ఇష్టంలేక, మరో మార్గం ఏదైనా ఉందా? అని అడగడానికి వచ్చాం. ఇంతలో..’ అంటూ ఆ దంపతులు ఏదో చెప్పబోతుండగా.. ‘ఇక, చాలు. స్వామీజీతో నేను డీల్ చేస్తా’ అంటూ దంపతులను వారించి మళ్లీ మొదలుపెట్టాడు రుద్ర.
‘స్వామీ! మీ గురించి, ఇన్‌స్టాగ్రామ్‌లో మీ శిష్యుల ప్రచారం గురించి.. భక్తులు ఇచ్చే కానుకలతో కోట్లకు కోట్లు ఆస్తులను వెనకేసుకొన్న మీ చరిత్ర గురించి ఇలా అన్నీ నాకు తెలుసు. నా డౌట్ ఏంటంటే? పాలు పొంగకపోతే.. ఆ ఇల్లు మంచిది కాదా?’ అంటూ సూటిగా మళ్లీ అడిగాడు. కోపంతో అవునన్నట్టు తలూపాడు స్వామీజీ. ‘అయితే, ఈ ఆశ్రమంలో పాలు పొంగిద్దాం. పొంగితే మంచి ప్లేస్. లేకుంటే మంచిది కానట్టు. ఒకవేళ, పాలు పొంగలేదో.. తట్టాబుట్టా సర్దుకొని మీరూ, మీ శిష్యగణం అంతా ఇక్కడినుంచి దయచేయాలి. అంతేకాదు.. ఈ ప్లేస్ మంచిదో కాదో కూడా కనిపెట్టలేని మీరు.. ఇకపై, ఇంటికి సంబంధించిన దోషాలు అంటూ ప్రజలను మభ్యపెట్టడం కూడా మానెయ్యాలి. అంటే, ఓవరాల్‌గా మీ దుకాణం సర్దెయ్యాలి. ఓకేనా?’ అని అంటున్న రుద్రను తిట్లు, శాపనార్థాలతో కసురుకొన్నారు స్థానికులు. రుద్ర పోలీసు కాకపోయుంటే కొట్టేవారే. అసలు రుద్ర ఏం చేస్తున్నాడో అక్కడ ఎవరికీ అర్థంకావట్లేదు. ఇంతలో.. సరేనంటూ తలూపాడు స్వామీజీ.
పక్కనున్న బడ్డీ కొట్టు నుంచి రెండు పాల ప్యాకెట్లను తెప్పించిన రుద్ర.. ఆశ్రమం మధ్యలో గ్యాస్ స్టౌవ్ వెలిగించి.. పాత్రలో ఒక ప్యాకెట్ పాలను పోసి మరిగించాడు. అందరిలోనూ ఒకటే టెన్షన్. అయితే, కాసేపటికి పాలు పొంగాయి. స్వామీజీకి జై అంటూ భక్తులది మామూలు ఆనందం కాదు. ‘హలో.. మై డియర్ పబ్లిక్. ఇక, అరుపులు ఆపుతారా? ఇంకో ప్యాకెట్ ఉంది. ఇది కూడా పొంగాలిగా’ అంటూ మరో పాత్రలో పాలు పోసి.. జేబులోని తన అరచేయిని తీసి పాత్రపై ఉంచి.. ‘ఓమ్ భగ భుగే భగిని భాగోదరీ భగవాసనే ఓమ్ ఇమ్ క్లిమ్ ఫట్ స్వాహా..’ అంటూ ఏదో మంత్రం చదివాడు రుద్ర. అంతే, ఎంత వేడిచేసినా పాలు మరుగుతున్నాయే గానీ, పొంగడంలేదు. దంపతులు వైపు తిరిగిన రుద్ర.. ‘స్వామీజీ ఇచ్చిన పాలు కాదు.. ఇప్పుడు మీరు కొన్న పాలు వేడి చేసి చూడండి. అప్పుడు పొంగకపోతే నా దగ్గరకు రండి’ అంటూ చెప్పి.. నారాయణాద్రుల స్వామి వైపు చూశాడు రుద్ర. ‘బాబూ.. క్షీరసాగర మథనాన్ని సైన్సు గుట్టుతో భలే కనిపెట్టావు. అయితే, అన్నీ సైన్సుతో పరిష్కరించలేవు. రేపు చనిపోబోతున్న ఈ చిన్నారిని కూడా ఇలాగే రక్షించగలవా?’ అంటూ నోట్లోంచి నురగకక్కుకొంటున్న ఓ ఐదేండ్ల చిన్నారిని చూయించాడు స్వామీజీ. దీంతో రుద్ర టీమ్ షాకైంది. అది పక్కనబెడితే, పాలు పొంగడంలో ఉన్న రహస్యమేంటి? రుద్ర దాన్ని ఎలా ఛేదించాడో కనిపెట్టారా?
సమాధానం: రుద్ర టెక్నిక్.. స్వామీజీ మోసం తెలియాలంటే.. ముందు పాల పొంగు రహస్యం అర్థంచేసుకోవాలి. వేడిచేయడం వల్ల పాలలోని కొవ్వు పైకి ఓ పొరలా ఏర్పడుతుంది. పాలలోని నీరు వేడెక్కి గాల్లో కలువాలంటే ఆ పొర అడ్డుపడుతుంది. ఈ క్రమంలోనే పొంగు వస్తుంది. అయితే, స్వామీజీ తనకు చెప్పకుండా ఇల్లు కొన్నారని ఆ దంపతులకు ఇచ్చిన పాలల్లో కొంత జెలెటిన్ పౌడర్‌ను కలిపాడు. కొవ్వు పొరను ఎక్కడికక్కడ విడగొట్టే స్వభావం దాని సొంతం. అందుకే పాలు పొంగలేదు. ఆ విషయం తెలుసుకొన్న రుద్ర.. అదే పౌడర్‌ను తన అరచేతి మధ్యలో పెట్టుకొని ఏదో మంత్రం చదువుతున్నట్టు చేస్తూ రెండోసారి వేడిచేసిన పాలల్లో వేశాడు. అందుకే ఆ పాలు పొంగలేదు. కాగా, చిన్నారిని కాపాడటానికి రుద్ర సమాయత్తమయ్యాడు.
-రాజశేఖర్ కడవేర్గు