పిల్లలు పుట్టగానే తల్లిదండ్రులకు పట్టరాని సంతోషం కలుగుతుంది. చంటిపాపను కంటికి రెప్పలా కాపాడుకోవాలన్న తపన మొదలవుతుంది. చిన్నారి నవ్వులు చిందిస్తుంటే ఎవరెస్ట్ ఎక్కినంతగా సంబురపడతారు అమ్మానాన్నలు. బుజ్జాయి అంబాడిన రోజు తామే ఏనుగు అంబారీపై విహరించినట్టుగా ఊహించేసుకుంటారు. పుట్టిన బిడ్డడికి నిండైన ప్రేమ పంచడమే నిజమైన బాధ్యత అనుకుంటే సరికాదు. వాళ్లకు మెండైన జీవితం ఉండాలంటే ఆర్థిక వ్యవహారాల్లో కాస్త మొండిగా వ్యవహరించాల్సిందే! మీ పిల్లలను ఉన్నతంగా చదివించాలన్నా, వారి పెండ్లిళ్లకు భారీగా చదివించాలన్నా… వారు బాల్యంలో ఉండగానే పొదుపు మంత్రంతో దిష్టి తీసి, మదుపు యంత్రంతో తాయత్తు కట్టండి.
పిల్లలు పొత్తిళ్లలో ఉన్నప్పుడే తల్లిదండ్రులు వారి భవిష్యత్తుకు ఎలాంటి బాటలు వేయాలో ఆలోచించుకోవాలి. ‘నారు పోసిన వాడు నీరు పోయడా’ అనుకుంటే.. వారి ఆశయాలను ఆదిలోనే తుంచేసినట్టు అవుతుంది. అలా కావొద్దంటే కట్టుదిట్టమైన ప్రణాళిక అవసరం. అప్పుడే మీ పిల్లలు పెద్దయ్యాక వారి పట్టుదలకు మీ పెట్టుబడే పట్టుగొమ్మ అవుతుంది. చిన్నారి నామకరణం నాడే వారి పేరిట ఇన్వెస్ట్‌మెంట్‌కు శ్రీకారం చుట్టండి. ఇందుకోసం రకరకాల మార్గాలు అందుబాటులో ఉన్నాయి. ఎస్ఐపీ చేసినా, సుకన్య సమృద్ధి యోజనను ఎంచుకున్నా పిల్లల ప్రయోజనాలే పరమావధిగా ఉండాలి. పై చదువులకు, పెండ్లి, సెటిల్మెంట్ వ్యవహారాలకు వెన్నుదన్నుగా నిలిచే పథకాలను ఎంచుకొని మీ బాధ్యతలను ఆనందంగా పంచుకోండి.
ఆధార్..అన్నిటికీ ఆధారం జనన ధ్రువీకరణ పత్రం చేతికి అందగానే ఆధార్ తీసుకోవాలి. ఆధార్ కేంద్రంలో పిల్లల వివరాలు నమోదు చేయాలి. ఫోన్‌నంబర్, ఈ-మెయిల్ ఐడీ తల్లిదండ్రులవి ఎంట్రీ చేస్తారు. పిల్లల ఫొటో మాత్రమే తీసుకుంటారు. చిన్నారికి ఐదేండ్లు వచ్చిన తర్వాత వేలి ముద్రలు నమోదు చేయాల్సి ఉంటుంది. ఆధార్‌తోపాటు పాన్ కార్డు కూడా ముందుగా తీసుకోవడం మంచిది. తర్వాత బ్యాంకు లావాదేవీలకు, ఇతరత్రా పెట్టుబడుల నిర్వహణకు పాన్ కార్డు ఉండటం చాలా అవసరం. ఫామ్ 49ఏ దరఖాస్తుతో పాటు పిల్లల ఆధార్, తల్లి దండ్రుల వ్యక్తిగత ధ్రువీకరణ పత్రాలు, అడ్రస్ ప్రూఫ్ డాక్యుమెంట్లను నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ (ఎన్ఎస్డీఎల్)- పుణె కేంద్రానికి పంపితే.. పాన్ కార్డు పొందవచ్చు.
బ్యాంకు ఖాతాతో మొదలు పెట్టుబడులు పద్ధతిగా సాగాలంటే అది పిల్లల పేరిట ఉండటమే శ్రేయస్కరం. తల్లిదండ్రుల సేవింగ్స్ ఖాతాలో వాటిని జమ చేసి పొదుపు చేస్తున్నాం కదా అనుకుంటే సరిపోదు. ఏదైనా అవసరం రాగానే.. ముందుగా ఖాతాలో ఉన్న డబ్బులు వాడుకుందామన్న ఆలోచన వస్తుంది. అదే పిల్లల పేరిట ఉన్న ఖాతాలో జమ చేస్తే.. అత్యవసరమైతే తప్ప వాటి మీదికి మనసు మళ్లదు. మైనర్లకు అకౌంట్ ఓపెన్ చేయడం ఇప్పుడు చాలా తేలిక. బర్త్ సర్టిఫికేట్, ఆధార్ కార్డు ఉంటే సరిపోతుంది. తల్లిదండ్రుల పాన్, ఫోన్‌నంబర్ జతచేయాల్సి ఉంటుంది. మీ ఖాతా ఉన్న బ్యాంకులోనే అయితే ఆ అవసరం కూడా ఉండదు. మైనర్ల బ్యాంకు ఖాతాలో రూ.2,500 నుంచి రూ.10,000 వరకు మినిమమ్ బ్యాలెన్స్ మెయింటేన్ చేయాల్సి ఉంటుంది.
మ్యూచువల్ ఫండ్స్ బ్యాంకు ఖాతా తీసుకున్న తర్వాత.. వారి పేరిట మ్యూచువల్ ఫండ్స్ అకౌంట్ నిర్వహించడం చాలా తేలిక. మీకున్న ఆర్థిక పరిస్థితిని బట్టి చిన్నమొత్తంతో ఎస్ఐపీ ప్రారంభించండి. మ్యూచువల్ ఫండ్స్ అకౌంట్ తెరవడానికి బర్త్ సర్టిఫికెట్ చాలు. పేరెంట్స్ అకౌంట్‌కు సంబంధించిన క్యాన్సల్డ్ చెక్ జత చేయాల్సి ఉంటుంది. పిల్లలు కాస్త పెద్దవాళ్లయితే వాళ్ల ఖాతాకు చెందిన క్యాన్సల్డ్ చెక్ ఇవ్వొచ్చు. మ్యూచువల్ ఫండ్స్ ఎందుకు అనుకుంటే.. ఆడపిల్ల అయితే సుకన్య సమృద్ధి యోజన పథకంలో ఇన్వెస్ట్ చేయొచ్చు. నెలకు ఇన్ని వేల చొప్పున ఆ పథకంలో పెట్టుబడి పెడితే.. పిల్లలు ఎదిగే కొద్దీ లాభాలు వృద్ధి చెందుతాయి. నెలానెలా మీరు పొదుపు చేసిన చిన్నమొత్తమే వారికి పెద్ద సాయమవుతుంది.
పుత్తడిపై పెట్టండి పెట్టుబడికి పుత్తడిని మించిన మెరుగైన మార్గం మరొకటి ఉండదు. మీ కూతురు ప్రతి పుట్టిన రోజుకు తులం బంగారం కొనగలిగినా.. పాపాయికి పాతికేండ్లు వచ్చేసరికి పావుకిలో పసిడి జమవుతుంది. దీంతో అమ్మాయి పెండ్లికి బంగారం భారం మీపై పడకుండా ఉంటుంది. పైచదువుల సమయంలో నిధులు అవసరమైతే… బంగారంపై రుణం తీసుకునే వెసులుబాటూ ఉంటుంది. బంగారం ఇంట్లో భద్రపర్చడం ఇబ్బంది అనుకుంటే.. డిజిటల్ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ మేలు.
ఆరోగ్యానికి రక్షణ
‘కీడెంచి మేలెంచమ’ని పెద్దల మాట. మీ పిల్లల పేరిట ఎన్ని ఇన్వెస్ట్మెంట్లు చేసినా… తల్లిదండ్రుల ఆరోగ్య పరిస్థితి తలకిందులైతే.. ఆ పెట్టుబడులు కొనసాగించే పరిస్థితి ఉండకపోవచ్చు. అలాంటి రోజు రావొద్దనుకుంటే.. మీ ఆరోగ్యానికి రక్షణ కవచం ఉండాల్సిందే! మీ పిల్లల పేరిట ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ముందే మీ కుటుంబం పేరిట ఆరోగ్యబీమా, మీ పేరిట జీవిత బీమా చేయండి.
సుకన్య సమృద్ధియోజన
ఎస్ఐపీ
-ఎం. రాం ప్రసాద్
సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్
ram@rpwealth.in
www.rpwealth.in