‘సార్.. పవన్విహార్ కాలనీలో ఓ ఆవిడను ఎవరో దారుణంగా హత్య చేశారు. మీరు త్వరగా రండి’ అంటూ అటునుంచి ఒకరు ఫోన్లో కంగారుగా చెప్తున్నారు. కాసేపట్లోనే ఘటనాస్థలికి చేరుకొంది ఇన్స్పెక్టర్ రుద్ర టీమ్. అప్పటికే ఇరుగుపొరుగువారు గుమిగూడటంతో ఆ ప్రాంతమంతా గందరగోళంగా ఉంది. కాసేపట్లోనే సత్యవంత్, అనసూయ అక్కడికి వచ్చారు.
‘అక్కా.. ’ అని ఏడుస్తూ లోపలికి వెళ్లబోయిన అనసూయను లేడీ కానిస్టేబుల్స్ అడ్డుకొన్నారు. ‘ఒరేయ్.. జగదీశ్. నా సావిత్రిని ఎందుకు చంపావ్రా’ అంటూ కోపంగా అక్కడే ఉన్న యువకుడి మీదకు వెళ్లబోయాడు సత్యవంత్. అతణ్ని కానిస్టేబుల్స్ అడ్డుకొన్నారు. సావిత్రి, సత్యవంత్ భార్యాభర్తలు, సావిత్రి చెల్లి అనసూయ. తండ్రి చనిపోవడంతో అక్కా, బావ దగ్గరే ఉంటూ ఏదో కోర్స్ చేస్తున్నది.
కాసేపటి క్రితమే సావిత్రి చనిపోయిందన్న విషయం పక్కింటి వ్యక్తి ఫోన్లో చెప్పడంతో ఆఫీస్ నుంచి సత్యవంత్, కాలేజీ నుంచి అనసూయ పరుగున వచ్చారు. ఫోన్లో ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వ్యక్తిని పిలిచి, ఏమైందంటూ అడిగాడు రుద్ర. ‘సార్.. నా పేరు జగదీశ్. ఫుడ్ డెలివరీ బాయ్‌ని. ఆర్డర్ వచ్చింది. ఇద్దామని ఇక్కడికి రాగానే మేడమ్ రక్తపుమడుగులో కనిపించారు.
భయపడి నేనే మీకు ఫోన్ చేశాను’ చెప్పాడు జగదీశ్. ‘సార్.. వాడు అబద్ధం చెప్తున్నాడు. నా సావిత్రిని తన వశంచేసుకోవాలని ఎప్పటినుంచో చూస్తున్నాడు. ఆమె కాదనడంతోనే ఇలా చేశాడు’ అంటూ సత్యవంత్ గుండెలు బాదుకున్నాడు. ‘అమ్మతోడు సార్! ఈ మేడమ్ ఎవరో నాకు తెలియదు. ఫుడ్ ఆర్డర్ ఇస్తేనే వచ్చా. ఈ ఇంట్లోకి రావడం ఇదే మొదటిసారి. నా పేరుకూడా ఈ సారుకు ఎలా తెలుసో నాకర్థం కావట్లేదు’ భయపడుతూ చెప్తున్నాడు జగదీశ్. ‘నోర్ముయ్.. మొన్న మార్కెట్లో నా ముందే మా అక్క చెయ్యి పట్టుకొన్నావ్. ఇప్పుడు ఏకంగా చంపేశావ్’ అంటూ ఏడుస్తూనే అరిచింది అనసూయ.
అసలేం జరుగుతున్నదో రుద్రకు ఏమీ అర్థం కావట్లేదు. ఇల్లంతా కలియదిరిగిన ఆయన దృష్టి వంటింటిమీదకు మళ్లింది. మెత్తగా తడిపిన పిండి సగం ముద్దకట్టి ఉంది. సావిత్రి పిండి కలుపుతుండగా ఎవరో ఇంట్లోకి వచ్చినట్టు దీన్నిబట్టి అర్థమవుతున్నది. సత్యవంత్, అనసూయ చెప్తున్నట్టు.. జగదీశ్ అంటే సావిత్రికి అసహ్యంగా ఉంటే అతణ్ని చూడగానే పెనుగులాట జరగాలి. అయితే, గొడవ జరిగిందనడానికి సాక్ష్యంగా అక్కడ ఏ వస్తువూ చిందరవందరగా పడిలేదు.
అంటే పెనుగులాట జరగలేదు. దీన్నిబట్టి సావిత్రికి ఇష్టమైన వ్యక్తే ఇంట్లోకి వచ్చాడు. అంటే సావిత్రికి-జగదీశ్‌కు మధ్య ఏమైనా వ్యవహారం నడుస్తుందా? ఇద్దరి మధ్య చెడి జగదీశే సావిత్రిని చంపాడా? ఒకవేళ జగదీశ్ ఈ హత్య చేసి ఉంటే.. అతనే స్వయంగా పోలీసులకు ఎందుకు సమాచారం ఇచ్చినట్టు? రుద్ర బుర్ర వేడెక్కిపోతున్నది.
ఫోరెన్సిక్ ఎగ్జామినేషన్, పోస్ట్‌మార్టం ప్రాసెస్‌ను ప్రారంభించిన రుద్ర టీమ్.. జగదీశ్, సత్యవంత్, అనసూయను స్టేషన్‌కు తీసుకెళ్లారు. సీసీటీవీ ఫుటేజీలో.. జగదీశ్ ఇంట్లోకి వెళ్లి 10 నిమిషాల తర్వాత కంగారుగా బయటకు వచ్చినట్టు రికార్డయ్యింది. అది చూసిన రుద్ర.. ‘జగదీశ్.. ఫుడ్ డెలివరీ చేసేవాడివి ఇంట్లోకి ఎందుకు వెళ్లావ్?’ సూటిగా ప్రశ్నించాడు.
‘సార్.. నేను రెండుసార్లు బెల్ కొట్టాను. తలుపులు తీయలేదు. డోర్ కొట్టాను. గడియ పెట్టకపోవడంతో తలుపులు వాటికవే తెరుచుకొన్నాయి. ఆర్డర్ వచ్చిందంటూ ముందటి రూమ్‌లో కాసేపు ఉండి మేడమ్‌ను పిలిచాను. సమాధానం లేదు. ఏమిటా? అని లోపలికి వెళ్లగానే హాల్లో మేడమ్ చనిపోయి ఉన్నారు. భయపడి బయటికి వచ్చి మీకు ఫోన్ చేశాను. నిజంగా నాకు ఆ మేడమ్ ఎవరో.. ఈ సార్ ఎవరో తెలియదు సార్..’ అంటూ కాళ్లమీద పడ్డాడు జగదీశ్. ‘నీకు వాళ్లు తెలియనప్పుడు.. నిన్ను చూడగానే వాళ్లు నీపేరు అంత కరెక్ట్‌గా ఎలా చెప్పారు? మార్కెట్లో ఆ గొడవ సంగతేంటి?’ అంటూ గద్దించాడు రుద్ర. భయపడిపోయిన జగదీశ్ వణుకుతూ నేలపై ఓ మూలన కూర్చుండిపోయాడు.
‘సత్యవంత్ గారూ.. అసలేం జరిగిందో ముందు మీరు చెప్పండి’ అడిగాడు రుద్ర. ‘చెప్పాను కదా సార్. వీడే నా భార్యను హత్య చేశాడు. ఆమె కాదనడంతోనే ఈ ఘాతుకానికి తెగబడ్డాడు’ అంటూ ఏడ్చాడు సత్యవంత్. ‘అవును సార్. వీడు ఎంతోకాలంగా మా అక్కను ఏడిపిస్తున్నాడు. నేను న్యూజిలాండ్‌లో ఉన్నప్పుడు మా అక్క తరుచూ ఇదే విషయాన్ని ఫోన్లో చెప్తూ బాధపడుతుండేది. నాన్నగారు చనిపోయాక.. ఒంటరితనంతో ఉన్న నన్ను అక్కే చేరదీసింది. మా బావ నన్ను ఓ తండ్రిలా చూసుకొంటున్నాడు.
ఇంతలో ఈ దుర్మార్గుడు.. ’ అంటూ జగదీశ్ చొక్కా పట్టుకోబోయింది అనసూయ. ఆమెను వారించిన రుద్ర.. ‘మీ నాన్నగారు ఎలా చనిపోయారు?’ అని అడిగాడు. పాముకాటుతో మరణించినట్టు చెప్పిన అనసూయ.. జగదీశ్‌కు తప్పకుండా శిక్ష పడేలా చేయాలని ప్రాధేయపడింది. ఇంతలో హెడ్‌కానిస్టేబుల్ చెవిలో ఏదో చెప్పిన రుద్ర.. జగదీశ్‌ను సెల్లో వేశాడు. గంట గడిచిన తర్వాత కంట్రోల్ రూమ్, ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి రామస్వామి కొన్ని డాక్యుమెంట్లు తీసుకొచ్చాడు. అవి చూసిన రుద్ర.. జగదీశ్, సత్యవంత్, అనసూయతో ఓ స్టోరీ చెప్పడం ప్రారంభించాడు.
‘నిన్న రాత్రే నేను ఓ వెబ్ సిరీస్ చూశా. అందులో ఓ తండ్రికి ఇద్దరు కూతుళ్లు. పెద్ద కూతురిని ఎంబసీలో పనిచేసే వ్యక్తికిచ్చి పెండ్లి చేస్తాడు. అయితే, అక్క మొగుడిపై చిన్న కూతురు మనసు పడుతుంది. ఇది తెలుసుకొన్న తండ్రి.. చిన్న కూతురిని విదేశాలకు తీసుకెళ్తాడు. అల్లుడి వ్యవహారం కూడా సరిగ్గా లేదని గమనించి విషయం పెద్ద కూతురికి చెప్పాలనుకుంటాడు.
అయితే, అనూహ్యంగా చిన్న కూతురే తండ్రిని చంపేస్తుంది. ఎంబసీలో పనిచేస్తుండటంతో ఆ అక్క మొగుడు.. తన మరదలిని ఎలాగోలా రక్షించి ఇండియాకు తీసుకొస్తాడు. తన ఇంట్లోనే నీడనిస్తాడు. ఒకరోజు ఈ బావా-మరదలి వ్యవహారం ఆ ఇల్లాలికి తెలిసే పరిస్థితి వస్తుంది. తప్పదు అనుకున్న ఆ భర్త తన భార్య అడ్డు తొలగించుకోవాలని ఫిక్సవుతాడు.
సీసీటీవీలు లేని ఇంటి వెనుక నుంచి ఇంట్లోకి వస్తాడు. వంటింట్లో పిండి కలుపుతున్న భార్యను ముద్దుల్లో ముంచెత్తాడు. ఆమెను లాలిస్తూనే.. అదునుచూసి కత్తితో పొడిచేస్తాడు. మర్డర్‌లో ఎవరిని ఇరికించాలి? అని అంతకుముందే బాగా ఆలోచించిన ఆ భర్త.. రిమోట్ మొబైల్ ఆప్లికేషన్ ద్వారా.. తన మొబైల్లోంచి తన భార్య మొబైల్‌ను ఆపరేట్ చేశాడు.
ఆమె ఫుడ్ డెలివరీ యాప్ నుంచి ఫుడ్ ఆర్డర్ చేశాడు. డెలివరీ పర్సన్ పేరు పడింది. చిలువలు పలువలు అల్లి అతనే ఈ హత్య చేసినట్టు మిగతా కథంతా నడిపించాడు’ అంటూ కథను పూర్తిచేశాడు రుద్ర. ‘ఇప్పుడు నేను చెప్పిన స్టోరీలో ఎవరిది ఏ క్యారెక్టర్ అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదనుకొంటా?’ అన్న రుద్ర.. సత్యవంత్, అనసూయను అరెస్ట్ చేశాడు. తమదైన శైలిలో విచారించడంతో తామే సావిత్రిని చంపేసినట్టు సత్యవంత్, అనసూయ ఒప్పేసుకొన్నారు. ఇంతకీ.. సత్యవంత్, అనసూయపై రుద్రకు ఏ పాయింట్లో అనుమానం స్టార్ట్ అయ్యిందో చెప్పగలరా?
న్యూజిలాండ్‌లో పాము కరువడంతో తన తండ్రి మరణించినట్టు అనసూయ చెప్పడంతో రుద్రకు అనుమానం మొదలైంది. నిజానికి న్యూజిలాండ్‌లో పాములు ఉండవు. ఆ విషయం తెలియని అనసూయ.. తాను విషప్రయోగంచేసి చంపిన తన కన్నతండ్రి చావును పాముకాటుగా ఏమార్చి దొరికిపోయింది. దీంతో అనసూయ తండ్రి మరణం ఎలా జరిగిందో ఎంబసీ ద్వారా రుద్ర రికార్డులు తెప్పించుకొన్నాడు.
అలాగే, సత్యవంత్ మొబైల్లోని రిమోట్ మొబైల్ ఆప్లికేషన్ ద్వారా సావిత్రి మొబైల్ లింక్ అయ్యి ఉన్న విధానాన్ని ఫోరెన్సిక్ డేటా ద్వారా విశ్లేషించాడు. ఘటన జరిగిన ప్రదేశంలో పెనుగులాట జరగకపోవడం, సత్యవంత్, అనసూయ మధ్య కాల్ సంభాషణలు ఇలా మొత్తానికి రుద్ర ఈ కేసు సాల్వ్ చేశాడు. కాగా.. అలనాడు భర్త సత్యవంతుడి ప్రాణాన్ని యముడితో పోరాడి ఆనాటి సావిత్రి కాపాడుకొంటే, నేటి సత్యవంతుడు కట్టుకొన్న భార్యనే కడతేర్చాడని ఇరుగుపొరుగువారు బాధపడిపోయారు. మహా పతివ్రత అనసూయ పేరును చెడగొట్టిందని సావిత్రి చెల్లెలిని ఛీకొట్టారు.
– రాజశేఖర్ కడవేర్గు