శాస్త్రీయ సంగీతం మీద ఇష్టం, ఆసక్తి కనబరిచే వారి సంఖ్య ఇప్పుడు చాలా తక్కువగా ఉంటుంది. దీనికి కారణం ఆ విద్య అంత త్వరగా పట్టుబడక పోవడమే అనొచ్చు. శాస్త్రీయ సంగీతం మీద పుస్తకాలు, వ్యాసాలు రాసేవారి సంఖ్య తెలుగు రాష్ర్టాల్లో చాలా తక్కువ. సామల సదాశివ (హిందుస్థానీ సంగీతం మీద రాసిన ‘స్వరలయలు’కు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది), కొడవటిగంటి రోహిణీ ప్రసాద్, నండూరి పార్థసారథి లాంటివాళ్లు వేళ్లమీద లెక్కించే సంఖ్యలో మాత్రమే మనకు కనిపిస్తారు. ఈ బాటలో నడుస్తూ సామల సదాశివ తనయుడు సామల రాజవర్ధన్ తాను మూసీ పత్రికకు రాసిన వ్యాసాలను ‘సంగీత సౌరభాలు’ పేరుతో సంకలనంగా తీసుకువచ్చారు. ఈ పుస్తకం సంగీతానికి మూలమైన నాద ప్రసక్తితో మొదలవుతుంది. హిందూస్తానీ సంగీతాన్ని పరిచయం చేస్తుంది. ఆ తర్వాత బాలగంధర్వ, కుమార గంధర్వ, గంగూబాయి హంగల్, మల్లికార్జున్ మన్సూర్, మంగళంపల్లి బాలమురళీకృష్ణ, ఎం.ఎస్. సుబ్బులక్ష్మి, ఎం.ఎల్. వసంతకుమారి, ఉస్తాద్ అల్లాదియాఖాన్, ఉస్తాద్ బడేగులాం అలీ ఖాన్, ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ తదితర భారతీయ సంగీత విద్వాంసుల జీవితాల వివరాలు, విశేషాలను రచయిత ఇందులో పొందుపరిచారు. సంగీత జ్ఞానాన్ని పొందాలనుకునే వారికి ఈ ‘సంగీత
సౌరభాలు’ ఓ పాఠ్యగ్రంథంలా ఉపయోగపడుతుంది.