తెలంగాణ జానపద కళలకు ఎంతో విశిష్టత ఉన్నది. వాటితో ఉపయోగించే వాద్యాలకూ అంతే ప్రాధాన్యమున్నది. ఒక్కో వాద్యం.. సంబంధిత కళా రూపాన్ని ఉచ్ఛ స్థితికి తీసుకెళ్తుంది. శైవ సంప్రదాయానికి చెందిన ‘రుంజ’ కూడా ఆ కోవకు చెందినదే! ఈ చర్మ వాద్యం నుంచి వచ్చే వినసొంపైన శబ్దాలకు ఎవరైనా మైమరచి పోవాల్సిందే!
రుంజ.. అతి ప్రాచీనమైన వాద్యం. విశ్వ బ్రాహ్మణుల ఆశ్రితకులం వారైన ‘రుంజలు’ దీన్ని వాయిస్తారు. విశ్వబ్రాహ్మణుల గోత్రాలు, వంశనామాల గురించి శ్లాఘిస్తూ విశ్వకర్మ పురాణం, ఇతర కథలు చెబుతుంటారు. విశ్వబ్రాహ్మణుల ఆశ్రిత కులం కాబట్టి రుంజ కళాకారులు కమ్మరి, వడ్రంగి, కంచరి, స్థపతి, స్వర్ణకారుల వద్దే రుంజ వాయించాలనే నియమం ఉన్నది. సాధారణంగా వీరు విశ్వబ్రాహ్మణులు ఎక్కువగా ఉండే గ్రామాల్లో తమ కళారూపాలను ప్రదర్శిస్తారు.
ఎంతో ప్రాధాన్యం..
ఇత్తడితో రూపొందించిన ఈ వాద్యం పైభాగంలో జంతు చర్మాన్ని గట్టిగా బిగించి రుంజను తయారు చేస్తారు. ఇది దాదాపు మూడున్నర అడుగుల ఎత్తు ఉంటుంది. దీనికే ‘రౌంజ’ అనే పేరు కూడా ఉన్నది. రుంజను ఏటవాలుగా నిలబెట్టి వాయిస్తారు. ముందుకు కదలకుండా మోకాళ్లతో అదిమిపెట్టి, చేతులతో తాళ్లను లాగి శ్రుతిచేస్తారు. డమరుకం, డప్పు, సప్త తాళాలు, మృదంగం వంటి 32 రకాల శబ్దాలను ఒక్క రుంజ నుంచే పలికిస్తారు. దీని నుండి వచ్చే ధ్వని.. యుద్ధ భేరీ నాదాన్ని మరిపిస్తుంది. కళాకారులు తమ శక్తినంతా కూడదీసుకుని వాయించడంతో దిక్కులు పిక్కటిల్లేలా శబ్దం చేస్తుంది. కొన్ని సందర్భాల్లో రెండు, మూడు కిలోమీటర్ల దూరం వరకూ ఈ ధ్వని వినిపిస్తుంది.
ప్రదర్శన విధానం ఇదీ..
రుంజ కథకులు ఒక్కో గ్రామానికీ వెళ్లి కళా ప్రదర్శన ఏర్పాటు చేస్తుంటారు. ఎక్కడికి వెళ్లినా విశ్వబ్రాహ్మణుల్లోని సానగ(కమ్మరి), సనాతన (వడ్రంగి), అహభూన (కాంస్యకారి), ప్రత్న (శిల్పాచారి), సువర్ణ (స్వర్ణకారి) గోత్రాల వారిని మాత్రమే యాచిస్తారు. విశ్వబ్రాహ్మణుల కులపెద్ద ఇంటి వద్దగానీ, విశ్వబ్రాహ్మణ కాలనీలో గానీ కథలు చెబుతారు. మిగతా గ్రామస్తులు కూడా హాజరవుతారు. ఒక్కో బృందంలో ముగ్గురు సభ్యులు ఉంటారు. ఒకరు కథ చెబితే, ఇంకొకరు రుంజ వాయిస్తారు. మరొకరు వంత పాడుతారు. రుంజ కథ ఓంకారంతో, అమ్మవారి స్తుతితో ప్రారంభమవుతుంది. ‘తక్కు ధిక్కు.. తకధిక్కు ధిక్కు.. తకమని.. అంబుజాసనుడు తాళంబువేయ’ అంటూ మెల్లిగా మొదలయ్యే కథాగానం.. క్రమంగా ఊపందుకుంటుంది. గానం, తాళం వేగానికి తగ్గట్టుగా రుంజ ధ్వనిలోనూ తీవ్రతను పెంచుతూ కథలు చెబుతారు. ముందు సంస్కృత శ్లోకం చదివి, తెలుగులో తాత్పర్యాన్ని వివరిస్తారు. వీరి కళారూప ప్రదర్శన వివిధ రకాల ధ్వనులతోపాటు శ్లోకాలు, పాటలు, విన్యాసాలతో వీక్షకులను మైమరపిస్తుంది. ఉమ్మడి వరంగల్, కరీంనగర్, నల్గొండ, మహబూబ్నగర్ జిల్లాల్లో రుంజ కళాకారుల కుటుంబాలు ఎక్కువగా నివసిస్తున్నాయి. అయితే, సరైన ఆదరణ లేకపోవడంతో చాలా మంది ప్రదర్శనలు చేపట్టడం లేదు. దీంతో తరం నుంచి తరానికి వారసత్వంగా వస్తున్న రుంజ వాద్యకళ ప్రస్తుతం అరుదుగానే కనిపిస్తున్నది. నాగరికత, సాంకేతికత అభివృద్ధితోపాటు సామాజిక వ్యవస్థలో చోటుచేసుకుంటున్న మార్పుల కారణంగా ఈ కళ అంతరించే స్థితికి చేరింది.
రుంజలు చెప్పే కథలు
రుంజలు విశ్వకర్మ పుట్టుక, పంచబ్రహ్మల పుట్టుక, దక్షయజ్ఞం, పార్వతీ కల్యాణం, రుంజల పుట్టుక, వీరబ్రహ్మం చరిత్ర, విశ్వగుణ దర్శనం, దేవబ్రాహ్మణ మహత్యం, వీరభద్ర విజయం తదితర కథలు చెబుతారు. విశ్వబ్రాహ్మణుల కృషిని, వారు చేసే పంచవృత్తులు, జీవన శైలిలో వారి పాత్రలు, సమాజంలో విశ్వబ్రాహ్మణుల ప్రాధాన్యం గురించి వేనోళ్లా కీర్తిస్తారు.
-అరవింద్ ఆర్య ,7997 270 270