మ.హరియంశంబున బుట్టె కృష్ణు డిలపై, నద్దేవునిన్ గూర్ప, వా
గ్వరుడూహించి విచిత్ర కల్పనముగా,బద్మాంగి నీలాల కో
త్కరమున్నీ సుదతిన్ సృజించి, జఘన స్థానంబుగా జేసెనో
ధరణిన్, దత్తరుణీత్రయంశాకృతి దత్తాద్దేతువై కన్పడన్
ఈ పద్యం విస్మృత కవి కొలనుపాక గ్రామ నివాసి రావూరి సంజీవ రాయ కవి రచించిన రుక్మిణీ పరిణయం అనే కావ్యం లోనిది. కొలనుపాక శాసనాల ఆధారంగా ఈ కవి వివరాలు కొంత తెలిసినప్పటికీ ఈ పుస్తకం ఇప్పుడు అందుబాటులో లేదు. ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన పరిశోధకులు ఒకరిద్దరు ఈ కావ్యం పరిష్కరించి ప్రచురించినట్లు తెలుస్తున్నది. కానీ, ప్రతులు అందుబాటులో లేవు. ఈ ప్రతి గ్రంథం విజయవాడకు యాజ్ఞవల్క్య శర్మ వద్ద ఉన్నట్లు తెలిసింది. రిటైర్డ్ ఇంజినీర్ కీ.శే.గంధం వేంకాస్వామి మాతామహుల వంశంలో ఆరు తరాలకు ముందు వారైన ఈ కవి గురించిన వివరాలు పుస్తకాలు వేంకాస్వామి గారు ప్రచురించారు. విరాట్ అనే బిరుదు కల ఈ కవి రచించిన వీరనారాయణ శతకంలోని పద్యాలు అందుబాటులో ఉన్నాయి.
హరి ఇలపై కృష్ణుడిగా వెలసిన తరువాత రుక్మిణిని అతనికి కట్టబెట్టటానికి బ్రహ్మ ఆమెను ఏ విధంగా తీర్చిదిద్దినాడో ఈ పద్యం చెబుతుంది. ఒకటి రెండు తప్పులు ఉత్కరంబుగా, తరుణీత్రయాంశకృతి లాంటివి సరిచేశాను. కృష్ణుడిని గుర్తుకు తెచ్చే నీలాల రాశిగా, పద్మాంగిగా, విశాలమైన (ధరణి) జఘనంతో ఆ రుక్మిణి అరుణత్రయాంశాకృతితో నిగనిగలాడుతు కనిపిస్తుంది. ఇక్కడ అరుణత్రయం అంటే మామిడి పువ్వు, ఎర్ర తామర, మంకెన పూవు అనీ! ఇవేవీ కూడా ఆమెకు సరితూగడం లేదట. ఇది గొప్ప భావుకత. ఈ కావ్యం అనేక ప్రయోగాలకు నిలయం. తమ కవిత్వంలో ఎన్నో ప్రయోగాలు చేసి చిత్ర కవిత్వంలో నిష్ణాతులైన సంజీవరాయ కవి రచించిన ఒక పద్య భ్రమకం చుద్దాం.
కం. దాయద కరిభూనవ కరి
సామరమా భూ తనయ దశరథ కుమారా !
రామా కుథశరథ యనత
భూమారమ సారిక వన భూరిక దయదా!
ఈ పద్యం పై నుంచి కిందకి, కిందనుంచి పైకి ఎలా చదివినా ఒకే రకంగా ఉంటుంది. పాలిన్డ్రోమ్ సంఖ్యలాగా. దీనిని పద్య భ్రమకం అంటాం.ఈ పద్యం కొంత పరిష్కరించాల్సి ఉన్నది. మొదటి పాదం ప్రాస సరిపోలేదు. అయినప్పటికీ.. గొప్ప ప్రయోగమే కదా!
-చేపూరి శ్రీరాం, హన్మకొండ