‘పంచతంత్రం’ పజిల్లో గెలిస్తే కిడ్నాప్ చేసిన ఇద్దరు పిల్లలను షామీర్పేట్ చెరువు దగ్గర వదిలిపెడతానని సైకో చెప్పాడు. దాంతో సిబ్బందితో కలిసి అక్కడికి ప్రయాణమయ్యాడు ఇన్స్పెక్టర్ రుద్ర. దారి మధ్యలో.. అంతకుముందు సైకో చెప్పిన కొన్ని మాటలు రుద్ర మెదడులో తిరుగుతున్నాయి.
‘తప్పు ఆన్సర్ చెప్తే నలుగురు పిల్లల శవాలు హుస్సేన్‌సాగర్‌లో తేలుతాయ్’ అని వార్నింగ్ ఇచ్చిన సైకో.. ఇప్పుడు ఇద్దరు పిల్లలను షామీర్పేట్ చెరువు దగ్గర ఎందుకు విడిచిపెడుతున్నట్టు? తనకు పంచతంత్ర కథలు ఇష్టమని సైకోకు అసలు ఎలా తెలుసు? తనను ఫ్రెండ్ అని ఎందుకు అంటున్నాడు?? ఆలోచనలతో రుద్ర బుర్ర వేడెక్కిపోయింది. ఈ ఆలోచనల్లో ఉండగానే షామీర్పేట్ చెరువు రానేవచ్చింది. కారులోంచి రుద్ర దిగుతున్నాడో లేదో.. మొబైల్‌కు ఓ ఇంటర్నెట్ కాల్ వచ్చింది. ‘హాయ్.. రుద్రా. నేనే.. ఫాస్ట్‌గానే వచ్చావ్. ఈ చెరువు నీకు గుర్తుందా? కట్ట మీదున్న కట్టమైసమ్మ గుడి యాదికొచ్చిందా?’ అంటున్న సైకో మాటలకు రుద్ర గుండె కొట్టుకోవడం పెరిగిపోయింది. ‘ఓకే ఫ్రెండ్.. టెన్షన్ పడకు. ఆ సంగతి మనం తర్వాత మాట్లాడుకొందాం.. ఇక విషయానికొస్తే.. పంచతంత్రం పజిల్లో నువ్వు గెలిచావ్ కాబట్టి.. నేను చెప్పినట్టే ఇద్దరు పిల్లలను విడిచిపెడతా. అయితే, మామూలుగా అప్పగిస్తే మజా ఏముంటుంది చెప్పు..? అందుకే వాళ్లను ఓ కంటైనర్‌లో పెట్టి.. లోపల ఆక్సిజన్ సిలిండర్లను ఏర్పాటుచేసి ఈ చెరువు నీటిలో ఎక్కడో ఓ దగ్గర దాచిపెట్టా. 1200 ఎకరాల విస్తీర్ణం ఉన్న ఈ చెరువులో వాళ్లను నువ్వు కనిపెట్టడం కష్టంగానీ.. నేను ఇంకో 5 ప్రశ్నలు నీకు వేస్తా. వాటికి నేను చెప్పిన టైమ్‌లో నువ్వు కరెక్ట్ ఆన్సర్ చెప్తే.. ఆ కంటైనర్ నీటిపైకి తేలుతుంది. తప్పు చెప్పావో.. ఇద్దరు పిల్లలు జలసమాధే. క్వశ్చన్స్, టైమ్ ఫార్మాట్ ఇలా మొత్తం అన్నిటినీ మన పంచతంత్రం పజిల్నే ఫాలో అయిపోదాం. రెండు నిమిషాల్లో కాల్ చేస్తా.. అప్పట్లోపు ఎఫ్బీ, యూట్యూబ్ లైవ్ కవరేజీకి ఏర్పాట్లు పూర్తిచెయ్’ అంటూ ఫోన్ కట్ చేశాడు సైకో. నిస్సహాయంగా కూలబడిపోయాడు రుద్ర.
రెండు నిమిషాలు గడిచాయి.. ‘హాయ్ రుద్రా.. నా ఫోన్‌కాల్ లైవ్‌లో స్ట్రీమింగ్ అవుతున్నట్టుంది కదూ! ఓకే.. ఇక మనం గేమ్ స్టార్ట్ చేద్దాం. పంచతంత్రం పజిల్ గుర్తుందిగా.. ప్రశ్న పూర్తవగానే 5 సెకండ్లపాటు వెయిట్ చేస్తా. ఆలోపు కరెక్ట్ ఆన్సర్ ఇవ్వాలి. కరెక్ట్ ఆన్సర్ అయితే, తర్వాతి ప్రశ్నకు వెళ్తా. తప్పు చెప్పావో.. కంటైనర్‌లోని పిల్లలు జలసమాధి కావడంతోపాటు నా క్వశ్చన్లు కూడా ఆగిపోతాయి. రెడీయా’ అంటున్న సైకో సవాలుకు ‘ఊ..’ అంటూ బదులిచ్చాడు రుద్ర. ‘ఫస్ట్ క్వశ్చన్.. ఒంటినిండా రంధ్రాలు ఉన్నా.. నీటిని నింపుకొంటూనే ఉంటుంది. ఏమిటది?’ యువర్ టైమ్ స్టార్ట్ నౌ.. ఫైవ్..’ రుద్ర సమాధానం. ‘రెండో ప్రశ్న.. ఒక ఎలక్ట్రిక్ రైలు ఉత్తరం నుంచి దక్షిణం వైపునకు గంటకు 100 కిలోమీటర్ల వేగంతో వస్తుంది. ఆ తర్వాత తూర్పు వైపునకు తిరిగిన రైలు గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించింది. ఆ రైలు నుంచి వచ్చే పొగ ఏ వైపు వెళ్తుంది?’ యువర్ టైమ్ స్టార్ట్ నౌ.. ఫైవ్..ఫోర్..’ రుద్ర సమాధానం. ‘మూడో ప్రశ్న.. ఒక బుట్టలో 15 మామిడిపండ్లు ఉన్నాయి. అందులోంచి 7 పండ్లను నువ్వు తీసుకొన్నావ్. ఇప్పుడు నీ దగ్గర ఎన్ని పండ్లు ఉన్నాయి? యువర్ టైమ్ స్టార్ట్ నౌ.. ఫైవ్..’ రుద్ర సమాధానం. ‘ఒక కారులో ఇద్దరు తల్లులు, ఇద్దరు కూతుళ్లు ప్రయాణిస్తున్నారు. అయితే, కారులో ఉన్నది మాత్రం ముగ్గురు మహిళలు మాత్రమే.. ఎలా? యువర్ టైమ్ స్టార్ట్ నౌ.. ఫైవ్, ఫోర్, త్రీ..’ రుద్ర సమాధానం. ‘సూపర్ రుద్రా.. ఇక ఆఖరు ప్రశ్న.. జాగ్రత్తగా విను.. అదిగో పండు అన్నవాడు ఆ పండును తెంపడు. అనని వాడు మాత్రం పండును తెంపుతాడు. తెంపినోడు తినడు.
తెంపనివాడు తింటాడు. పండు తిన్నవాడిని కొట్టరు. పండు తినని వాడిని కొడతారు. ఇంతకీ తిన్నవాడెవ్వడు? తన్నులు తిన్నవాడెవ్వడు? యువర్ టైమ్ స్టార్ట్ నౌ.. ఫైవ్, ఫోర్, త్రీ, టూ..’ అంటూ సైకో చదువుతుండగా.. రుద్ర నుదిటిపై చెమటలు పట్టాయి. ఎలాగోలా స్థిమితపడ్డ రుద్ర సమాధానం ఇచ్చాడు. ఇంతలో ఫోన్‌లైన్ కట్ చేశాడు సైకో. దీంతో అసలు రుద్ర ఇన్‌టైమ్‌లో ఆన్సర్ చెప్పాడా? ఆ చెప్పిన ఆన్సర్ అసలు కరెక్టేనా? అంటూ అటు పోలీసు సిబ్బంది, ఇటు లైవ్ స్ట్రీమింగ్ చూస్తున్న లక్షలాది మంది నెటిజన్లలో ఒకటే టెన్షన్ మొదలైంది. ఇంతలో రుద్ర మొబైల్‌కు ఫోన్ చేసిన సైకో.. ‘అన్ని ఆన్సర్లూ కరెక్ట్‌గా చెప్పావ్ రుద్రా. సో.. నేను చెప్పినట్టే కంటైనర్‌లోని ఇద్దరు పిల్లలను ప్రాణాలతో వదిలిపెడ్తున్నా. ఇక, అసలు విషయానికి వద్దాం. నేను ఎవరు? ఎందుకు ఇలా చేస్తున్నాను? అనే కదా నీ ప్రశ్న. దానికి సమాధానం నీకు తెలుసు. మళ్లీ అడుగుతున్నా.. ఈ చెరువు నీకు గుర్తుందా? కట్ట మీదున్న కట్టమైసమ్మ గుడి యాదికొచ్చిందా? ఒకవేళ యాదికి రాకపోతే.. 15 ఏండ్ల వెనక్కి వెళ్లు. అప్పుడైనా నీకు గుర్తొస్తుందేమో.. హహ్హహ్హ..’ అంటూ నవ్వుతూ ఫోన్ కట్ చేశాడు సైకో. అది విన్న రుద్ర.. ‘బాబాయ్.. సైకో ఎవరో తెలిసిపోయింది. మనమంతా సూరారం వెళ్లాలి’ అంటూ హెడ్‌కానిస్టేబుల్ రామస్వామితో కాస్త ఆందోళనతో అన్నాడు.
అందరూ సూరారం బయల్దేరుతుండగా ఇంతలో.. రుద్ర మొబైల్ మళ్లీ మోగింది. ఫోన్లో సైకో మాట్లాడుతూ.. ‘వావ్ రుద్రా. నీ జ్ఞాపకశక్తి అద్భుతం. అయితే, మేము ఇప్పుడు సూరారంలో ఉండట్లేదు గానీ.. నేనొకటి అడుగుతా చెప్పు. పంచతంత్రం అంటే ఇష్టపడే నువ్వు.. అందులోని నీతి-నియమం-నిజం అంటూ లెక్చర్లు దంచిన నువ్వు.. కట్టమైసమ్మ ముందు అబద్ధం ఎలా చెప్పగలిగావ్రా?’ అంటూ రుద్రను గద్దించాడు కిల్లర్. ‘ఈరోజు గేమ్‌లో ఐదో ప్రశ్న అడుగుతుండగా.. నీకు చెమటలు పట్టినట్టున్నాయి కదూ.. నీకు-నాకు మధ్య జరిగిన విషయం ఆ ప్రశ్న ద్వారా గుర్తొచ్చిందా? ఫ్రెండ్??’ అంటూ మళ్లీ నవ్వాడు సైకో. ఆ నవ్వును వింటూ వణికిపోతున్నాడు రుద్ర. కుంగిపోతూ కిందకూలబడిపోతున్న రుద్రను పట్టుకొన్నాడు రామస్వామి. ఇంతలో సైకో.. ‘రుద్రా.. అంత డీలాపడిపోకు ఫ్రెండ్.. మన చివరి గేమ్.. ఆపరేషన్ హుస్సేన్‌సాగర్: ద ఫైనల్ డెస్టినేషన్. ఇంకా మిగిలే ఉంది. అక్కడ కలుద్దాం. బైబై’ అంటూ ఫోన్ పెట్టేశాడు సైకో. అసలేం జరిగిందంటూ రుద్రను ఊరడిస్తూ ఆరా తీశాడు రామస్వామి. ఆ విషయం పక్కనబెడితే.. సైకో అడిగిన ఐదు ప్రశ్నలకు రుద్ర ఇచ్చిన కరెక్ట్ సమాధానాలు ఏమిటో.. మీరు కనిపెట్టారా?
సమాధానం : మొదటి సమాధానం: స్పాంజీ, రెండోది: అది ఎలక్ట్రిక్ రైలు.. పొగ రాదు, మూడో జవాబు: 7 మామిడి పండ్లు, నాలుగోది: అమ్మమ్మ, అమ్మ, కూతురు, ఐదో సమాధానం: నోరు, చెయ్యి.