‘ఫ్యాషన్’ ఎంతమారినా.. దేశభక్తిపై భారతీయుల ప్యాషన్ మాత్రం మారదు.వార్డ్రోబ్ నిండా ఎన్ని ట్రెండీ దుస్తులున్నా.. జాతీయ దినోత్సవాల్లో మాత్రం భారతీయతకే పెద్దపీట వేస్తారు. స్వాతంత్య్ర, గణతంత్ర దినోత్సవాల సందర్భంగా దేశభక్తిని చాటే దుస్తులనే ఎంచుకుంటారు. పాఠశాల విద్యార్థులు మొదలుకొని కార్పొరేట్ ఉద్యోగుల వరకూ.. మువ్వన్నెల ఫ్యాషన్‌కే జై కొడుతారు.
జనవరి 26ను పురస్కరించుకొని.. సాధారణ టెక్స్టైల్ వ్యాపారుల నుంచి దిగ్గజ ఫ్యాషనిస్టుల వరకూ, రిపబ్లిక్ స్పెషల్ ఫ్యాషన్‌ను తీసుకొస్తున్నారు. ఇందులో భారతీయతను చాటే ఖాదీ దుస్తులకే అగ్రతాంబూలం ఇస్తున్నారు. మువ్వన్నెలతో ఖాదీని మేళవించి.. అద్భుతమైన చీరలు, దుపట్టాలతోపాటు కుర్తాలనూ రూపొందిస్తున్నారు. మన నేతకళను ప్రపంచవ్యాప్తం చేసిన స్వచ్ఛమైన కంచిపట్టు, బనారసీ, ఇక్కత్, చందేరి వంటి వస్ర్తాల్లోనూ.. త్రివర్ణ పతాక సౌందర్యాన్ని, సాంస్కృతిక గొప్పతనాన్ని ఇనుమడింప జేస్తున్నారు. మరికొందరు ఫ్యాషనిస్టులు.. ఎండ్రాయిడరీతోనే మాయ చేస్తున్నారు. పిల్లలు, యూత్ కోసం వెస్ట్రన్ వేర్‌లోనూ భారతీయతను జొప్పిస్తున్నారు. దుస్తులతో ప్రయోగాలు వద్దనుకునే వారి కోసం.. మూడురంగుల యాక్ససరీస్‌ను సిద్ధం చేస్తున్నారు.
మహిళల కోసం గాజులు, చెవిపోగులు, నెక్లెస్ లాంటి ఆభరణాలను జెండా థీమ్‌తో తయారు చేస్తున్నారు. ఇక నెయిల్ ఆర్ట్ ట్రెండ్కూడా పెరుగుతున్నది. గోళ్లను రిపబ్లిక్ డే థీమ్‌లో పెయింట్ చేసి.. వాటిపై వివిధ డిజైన్లను సృష్టిస్తున్నారు. ఆ తర్వాత దేశీయ హస్త కళలకు పెద్దపీట వేస్తున్నారు. చైన్ లాకెట్స్, కీ చెయిన్స్లోనూ దేశభక్తిని చాటుతున్నారు. మొత్తంగా.. రిపబ్లిక్ డే అంటే జాతీయ స్ఫూర్తిని గౌరవించడం. కాబట్టి, మీరు ధరించే ఏ వస్త్రమైనా.. మీరు మన దేశం పట్ల ఎంత గర్వంగా, అంకితభావంతో ఉన్నారో చూపించాలి. దుస్తుల ఎంపిక దేశం పట్ల గర్వం, ఆప్యాయత, నిజాయతీని చూపించాలి. గణతంత్ర వేడుకలు ఇంట్లో జరుపుకొంటున్నా, అధికారిక కార్యక్రమాలకు హాజరైనా, సమాజ కార్యకలాపాల్లో పాల్గొన్నా.. మీ ఫ్యాషన్ స్టేట్మెంట్ను నలుగురికీ పంచాలి. అదే సమయంలో.. దేశభక్తినీ ప్రతిబింబించాలి.. అనేది ఫ్యాషన్ నిపుణుల మాట. ఇంకేం.. ఫ్యాషన్‌తో పాటు దేశభక్తినీ చాటుతూ మీరూ రిపబ్లిక్ ఉత్సవానికి సిద్ధమైపోండి!