పార్వతీ తనయుడు స్వయంభూగా వెలిసిన క్షేత్రాలు తెలంగాణ ప్రాంతంలో బహు అరుదుగా కనిపిస్తాయి. అలాంటి వాటిలో ఒకటి రేజింతల్. ఇక్కడ పార్వతీ నందనుడు సిందూర వర్ణంలో సిద్ధి వినాయకుడిగా కొలువుదీరాడు. సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం రేజింతల్ గ్రామ శివారులో స్వామి ఆలయం ఉంది. ఇక్కడి దైవాన్ని దర్శించుకునేందుకు రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు వస్తుంటారు. తెలంగాణ రాష్ర్టానికి తలమానికమైన రేజింతల్ వినాయకుడి క్షేత్రం 225వ వార్షికోత్సవం జరుపుకొంటున్నది. ఈ సందర్భంగా ఆ ఆలయ విశేషాలు తెలుసుకుందాం..
రేజింతల్ వినాయకుడు స్వయంభూగా వెలిశాడని స్థల పురాణం. అయితే, 225 సంవత్సరాల కిందట స్వామి జాడ తెలిసింది. ఆ కాలంలో శివరాం అనే భక్తుడు కాలినడకన తీర్థయాత్రలకు బయల్దేరాడట. అనేక క్షేత్రాలు దర్శిస్తూ రేజింతల్ ప్రాంతానికి రాగానే అతనికి ఏదో తెలియని అనుభూతి కలిగింది. గ్రామంలోనే చాలాకాలం ఉండి తపస్సులో నిమగ్నుడయ్యాడు. మళ్లీ తీర్థయాత్రలు కొనసాగించాడు. ఒకసారి శిష్య బృందంతో తిరుపతి వెళ్తూ మళ్లీ రేజింతల్ ప్రాంతానికి వచ్చాడు. చీకటి పడటంతో ఆ రాత్రి అందరూ అక్కడే బస చేశారు. మర్నాడు పుష్య శుక్ల చవితి కావడంతో.. వినాయకుడికి పూజలు చేయాలని శిష్యులు కోరారు. శివరాం పంతులుకు రాత్రి కలలో వినాయకుడు కనిపించి తన ఉనికిని తెలియజేశాడట. తన విగ్రహాన్ని వెలికితీసి పూజాదికాలు నిర్వహించాలని ఆజ్ఞాపించాడట. మర్నాడు ఆ ప్రాంతంలో వెదకగా వినాయకుడి విగ్రహం కనిపించిందట. అలా అవతరించిన స్వామికి భక్తులు ఆలయాన్ని నిర్మించారు. తర్వాతి కాలంలో కంచి కామకోటి పీఠం ఆధ్వర్యంలో ఆలయ అభివృద్ధి జరిగింది.
సహజంగా ఆంజనేయస్వామికి సిందూరం అలదుతారు. ఎక్కడాలేని విధంగా రేజింతల్ వినాయకుడికి సిందూరం పులమడం ఆచారం. అంతేకాదు స్వామివారి రూపం ఒకవైపు నుంచి ఆంజనేయుడిగా, మరో కోణంలో వినాయకుడిగా దర్శనమివ్వడం విశేషం. ఈ వినాయకుడి విగ్రహం ఏటా పెరుగుతుందని చెబుతారు. మొదట్లో రెండున్నర అడుగులు ఎత్తూ మూడడుగుల వెడల్పు ఉన్న స్వామివారి విగ్రహం ఇప్పుడు ఐదున్నర అడుగుల ఎత్తు, ఆరడుగుల వెడల్పుతో ఉందని చెబుతారు. పృథ్వీ తత్వానికి ప్రతీకగా భావించే వినాయకుడు సకల విఘ్నాలను, సమస్త క్లేశాలను తొలగిస్తాడని భక్తుల నమ్మకం. ఇన్ని ప్రత్యేకతలు ఉండబట్టే.. రేజింతల్ వినాయకుణ్ని నిత్యం వందలాది మంది భక్తులు దర్శించుకుంటారు. అంగారక చతుర్థి, సంకష్టహర చతుర్థి లాంటి పర్వదినాల్లో వేలమంది భక్తులు ఆలయానికి వస్తారు. ఏటా పుష్య శుక్ల పాడ్యమి నుంచి చవితి వరకు స్వామివారి జయంత్యుత్సవాలు వైభవంగా చేస్తారు. ఇందులో భాగంగా సహస్ర మోదకాలతో 451 గణపతి హవనాలు, శతచండీ యాగం, లక్ష గణేశ గాయత్రీ హవనం నిర్వహిస్తారు. సంగారెడ్డి, సదాశివపేట, జహీరాబాద్ పరిసర గ్రామాల ప్రజలు వారి ఇండ్లలో ఏ శుభకార్యం జరిగినా ముందుగా రేజింతల్కు వచ్చి స్వామిని అర్చించిన తర్వాతే.. పనులు మొదలుపెడతారు. స్వామివారి ఆలయ ప్రాంగణంలోని మేడిచెట్టుకు ముడుపులు కడతారు. కోరికలు నెరవేరిన తర్వాత మళ్లీ వచ్చి స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లిస్తారు.
ఈ నెల 31 నుంచి జనవరి 4వ తేదీ వరకు రేజింతల్‌లో 225వ వార్షికోత్సవాలు జరగనున్నాయి. ఇందులో భాగంగా స్వామివారికి అభిషేకాలు, గణపతి హోమాలు నిర్వహించనున్నారు. రేజింతల్ క్షేత్రం జహీరాబాద్-బీదర్ రహదారిలో ఉంటుంది. జహీరాబాద్‌కు చేరుకుంటే అక్కణ్నుంచి ఆటోలో ఆలయానికి వెళ్లొచ్చు.