Regina | ‘ఎస్ఎంఎస్’తో టాలీవుడ్‌కు పరిచయమైన చెన్నై చిన్నది.. రెజీనా కసాండ్రా! అందం, అభినయం ఉన్నా.. అదృష్టం కలిసిరాక, సరైన అవకాశాలు దక్కించుకోలేక పోయింది. దక్షిణాదిన అన్ని భాషల్లోనూ సినిమాలు చేసినా.. కెరీర్‌ను మలుపుతిప్పే హిట్ మాత్రం కొట్టలేక పోయింది. మెల్లమెల్లగా బాలీవుడ్ బాటపట్టి.. ప్రస్తుతం రెండు హిందీ సినిమాలు చేస్తున్నది ఈ బ్యూటీ. దక్షిణాదివాళ్లు ‘బీటౌన్’లో రాణించడం కష్టమంటూ.. రెజీనా పంచుకున్న కబుర్లు..
నేను హైపర్ ఇండిపెండెంట్ ఉమెన్ కేటగిరీకి చెందినదాన్ని. ప్రేమ, పెళ్లి అంటూ.. చాలామంది ప్రపోజ్ చేశారు. కానీ, నన్ను జాగ్రత్తగా చూసుకునే వ్యక్తినే నేను ఇష్టపడతాను. నా పూర్తి బాధ్యత తీసుకోవడానికి సిద్ధంగా ఉన్న వ్యక్తితోనే జీవితాన్ని పంచుకోవాలని అనుకుంటున్నా.
స్కూల్, కాలేజ్ రోజుల్లో స్టేజ్ అంతా నాదే! ఆ అనుభవమే ఇండస్ట్రీలో నటిగా రాణించడానికి ఉపయోగపడింది. భిన్నమైన పాత్రలు చేసి మంచినటిగా గుర్తింపు పొందడమే లక్ష్యంగా కొనసాగుతున్నా. నా మొదటి సినిమా నుంచీ విభిన్న పాత్రలు చేసుకుంటూ వచ్చాను. నేను చేయగల అన్ని రకాల పాత్రలు చేయడమే.. నా లక్ష్యం.
స్కూల్లో ఉన్నప్పుడే దూరదర్శన్‌లో ఒక పిల్లల ప్రోగ్రామ్‌కు హోస్ట్‌గా చేశాను. ఆ తర్వాత మోడలింగ్ అవకాశాలు వచ్చాయి. చాలా షార్ట్ ఫిల్మ్స్ కూడా చేశాను. తర్వాత ‘కండ నాళ్ ముదల్’ అనే తమిళ చిత్రంలో అవకాశం వచ్చింది. అప్పటికి నేను తొమ్మిదో తరగతే. తమిళ సినిమా.. నన్ను నటిని చేసింది. తెలుగు సినిమా.. నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది. మిగతా భాషల చిత్రాలూ గుర్తింపు తెచ్చాయి.
నిజానికి నన్ను ఎవరైనా ‘మీరు ప్రాంతం వాళ్లు?’ అని అడిగితే.. చాలా కన్ఫ్యూజ్ అవుతాను. ఎందుకంటే.. నేను పుట్టింది తమిళనాడులో. నా మాతృభాష తమిళం. అమ్మది కర్ణాటక. నాన్న నార్త్ ఇండియన్. నానమ్మ.. గోవాకు చెందిన ఆంగ్లో ఇండియన్. తాతయ్య అయ్యంగార్ కుటుంబంలో పుట్టి.. క్రైస్తవం స్వీకరించారు. దాంతో.. నాది ఏ ప్రాంతం, ఏ భాష అంటే ఠక్కున చెప్పలేకపోతుంటా!
తొమ్మిదేళ్లకే నటించడం ప్రారంభించా. 25 ఏళ్లుగా ఎన్నో సినిమాలు, ప్రకటనల్లో కనిపించాను. ఈ సుదీర్ఘ అనుభవం.. నాకు ఇండస్ట్రీ మీద పూర్తి అవగాహన తీసుకొచ్చింది. పరిశ్రమలో నటిగా ఉండటం.. ముఖ్యంగా బాలీవుడ్లో దక్షిణాది నటిగా కొనసాగడం చాలా కష్టం.
నేను హిందీ సినిమా కోసం ఆడిషన్ ఇచ్చినప్పుడు.. ఆ భాష మాట్లాడగలనో, లేదో అని చూశారు. దక్షిణాది పరిశ్రమలో ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోరు. ఏ భాషకు చెందినవారినైనా.. ఎంపిక చేసుకుంటారు.
టాలీవుడ్, కోలీవుడ్‌లో.. ఇతర భాషలకు చెందిన ఎంతోమంది నటీనటులు అగ్రతారలుగా వెలుగొందారు. నేను హిందీ సరిగ్గా మాట్లాడలేక.. ఎన్నో అవకాశాలు కోల్పోయాను. ఒక పంజాబీ అమ్మాయి పాత్రకు నన్ను ఎంపిక చేయలేరు. కానీ, ఒక పంజాబీ అమ్మాయి మాత్రం.. దక్షిణాదిలో అగ్రనటిగా ఎదగగలదు. నా విషయంలోనూ అదే జరిగింది.
నా ప్రయారిటీ సినిమా.. భాష కాదు. అందుకే, హిందీలోనూ నటించాలని నిర్ణయించుకున్నా. అప్పుడు.. ముంబైలోనే ఉండాలని, మీటింగ్స్‌లో పాల్గొనాలని అక్కడివాళ్లు చెప్పారు. నాకు పెద్దగా నచ్చకపోయినప్పటికీ.. బీటౌన్‌లో అదే ముఖ్యమని అర్థమైంది. అందుకే.. నాకోసం ఒక టీమ్‌ను ఏర్పాటు చేసుకున్నా. అవకాశాల విషయంలో వాళ్లు సాయం చేస్తారు. నేను కేవలం ఆడిషన్లలో పాల్గొంటా.